వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 39వ వారం

చిలకమర్తి లక్ష్మీనరసింహం

చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు. లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889 లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం హైస్కూల్ గా మార్చబడింది.

(ఇంకా…)