వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 06వ వారం

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి

శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది. ఇది మన దేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపరయుగం నాటి ఆధారాలు లభిస్తాయి. ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఆ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారని కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఆ ఆలయానికి యెంతో ఘనమైన చరిత్ర ఉందని స్ధల పురాణం చెబుతోంది. ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాల యాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీస్తు శకం 545లో నిర్మించి నట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన వారసుడు ఒకటో దేవేంద్రవర్మ క్రీస్తు శకం 648లో సూర్యగ్రహణ సమయా న ఆదిత్య విష్ణుశర్మ, భానుశర్మలనే బ్రాహ్మణులకు అరస వల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.

(ఫిబ్రవరి 14 2016-రథసప్తమి సందర్భంగా...)

(ఇంకా…)