వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 16వ వారం

రైలు

రైలు అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో ధూమశకటం అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అందురు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ "గ్లాస్ గో" విశ్వవిద్యాలయంలో 1776 లో కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా "బుల్లెట్ రైళ్లు" బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. నునుపైన రాళ్ళను గానీ, కొత్త దూలాలను గానీ సమాంతర పట్టాల లాగ పరిచినపుడు లేదా రోడ్డు తలాన్ని గట్టి పరచినపుడు స్లెడ్జిలూ, బండ్లూ వాటిపై సులభంగా చలించగలవని మానవుడు చాలాకాలం క్రితమే కనుగొన్నాడు. ప్రాచీన గ్రీసు దేశంలో 5,6 అంగుళాల లోతు, 2,3 అంగుళాల వెడల్పు గల గాడీలను 3-5 అడుగుల ఎడం ఉండేటట్లు ఏర్పరచి, మత సంబంధమైన ఉత్సవాల్లో అలంకరించిన బండ్లను ఊరేగించారు.

(ఇంకా…)