వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 04వ వారం

ఎ.ఎన్.ఆర్

మూగ మనసులు

మూగమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నిర్మించిన 1964 నాటి తెలుగు చిత్రం. అంతస్తుల కారణంగా విడిపోయిన జంట పునర్జన్మలో వివాహం చేసుకుని కలవడం కథాంశం. సినిమాని చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బాబూ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఆదుర్తి తాను చదివిన చిన్న కథను అనుసరించి తయారుచేసిన లైన్ కి, ఆదుర్తి కోరికపై ముళ్ళపూడి వెంకటరమణ మూగమనసులు పేరిట ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు. సాధారణంగా అప్పటి సినిమాలు మద్రాసులోని వివిధ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకునేవి, అయితే సినిమా మాత్రం చాలాభాగం భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న గోదావరి పరిసరప్రాంతాల్లోనూ, గోదావరి మీదా అవుట్ డోర్ లో చిత్రీకరణ జరుపుకుంది. సినిమా పాటలు ఆత్రేయ, కొసరాజు, దాశరథి రాయగా, కె.వి.మహదేవన్ స్వరపరిచారు. విడుదలకు ముందే సినిమా బాగోలేదన్న పుకార్లను, గోదావరిపై జరిగిన పడవ ప్రమాదాలను తట్టుకుని 1964లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం పొందింది. ప్రేక్షకాదరణ, విమర్శల ప్రశంసలు పొందిన ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఈ సినిమాని తారాచంద్ బర్జాత్యా, ఎల్.వి.ప్రసాద్ ల నిర్మాణంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా, నూతన్, సునీల్ దత్ ప్రధాన పాత్రలలో హిందీలో మిలన్ గా తీశారు. అక్కడా సినిమా విజయవంతమైంది.

(ఇంకా…)