మూగ మనసులు (1964 సినిమా)

1964 తెలుగు సినిమా

మూగమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నిర్మించిన 1964 నాటి తెలుగు చిత్రం. అంతస్తుల కారణంగా విడిపోయిన జంట పునర్జన్మలో వివాహం చేసుకుని కలవడం కథాంశం. సినిమాని చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బాబూ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఆదుర్తి తాను చదివిన చిన్న కథను అనుసరించి తయారుచేసిన లైన్ కి, ఆదుర్తి కోరికపై ముళ్ళపూడి వెంకటరమణ మూగమనసులు పేరిట ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు.[1]
సాధారణంగా అప్పటి సినిమాలు మద్రాసులోని వివిధ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకునేవి, అయితే సినిమా మాత్రం చాలాభాగం భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న గోదావరి పరిసరప్రాంతాల్లోనూ, గోదావరి మీదా అవుట్ డోర్ లో చిత్రీకరణ జరుపుకుంది. సినిమా పాటలు ఆత్రేయ, కొసరాజు, దాశరథి రాయగా, కె.వి.మహదేవన్ స్వరపరిచారు.
విడుదలకు ముందే సినిమా బాగోలేదన్న పుకార్లను, గోదావరిపై జరిగిన పడవ ప్రమాదాలను తట్టుకుని 1964లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం పొందింది. ప్రేక్షకాదరణ, విమర్శల ప్రశంసలు పొందిన ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఈ సినిమాని తారాచంద్ బర్జాత్యా, ఎల్.వి.ప్రసాద్ ల నిర్మాణంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా, నూతన్, సునీల్ దత్ ప్రధాన పాత్రలలో హిందీలో మిలన్గా తీశారు. అక్కడా సినిమా విజయవంతమైంది.

మూగ మనసులు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
జమున
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ బాబూ మూవీస్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

కొత్త దంపతులు గోపీనాథ్, రాధ హనీమూన్ కోసం బయలుదేరడంతో కథ ప్రారంభమై, గోదావరిలో పడవ ప్రయాణిస్తుండగా - కొద్ది దూరంలో ప్రాణాంతకమైన సుడిగుండాలు ఉన్నాయంటూ పడవను ఆపమని విలపిస్తాడు గోపీనాథ్, నాయిక రాధ కూడా కోరడంతో పడవను ఆపుతాడు సరంగు.

గోపీనాథ్ అన్యమనస్కంగా అల్లంతదూరాన ఉన్న పాడుపడ్డ మేడ వద్దకు వెళ్ళి, గతజన్మ స్మృతులు గుర్తుకు రాగా, అక్కడ ఒక ముసలివాడు తారసిల్లి అది జమిందారు భవంతి అని చెప్పి, అమ్మాయిగారు రాధ, గోపీల సమాధుల దగ్గరకు తీసుకు వెళతాడు. అక్కడ ఆ సమాధులకు దీపం పెడుతూ చావు కోసం నిరీక్షిస్తున్న వృద్ధురాలు గౌరిని చూసి వివరాలు అడుగుతారు.

గత జన్మలో వారిద్దరూ జమీందారు గారి అమ్మాయిగానూ, బల్లకట్టు గోపిగానూ జన్మించినట్టు తెలుస్తుంది. ఆ గత జన్మలో, అమ్మాయి గారూ అంటూ ఆప్యాయంగా బల్లకట్టు గోపి ఆమెను తన కళాశాల ఉన్న ఆ దరికి గోదావరి మీద బల్లకట్టు నడిపి చేరుస్తూంటాడు. వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి అభిమానం ఉన్నా బయటకి చెప్పుకోలేని సామాజిక స్థితి. గోపీని అతని వాడలోనే ఉండే పల్లెపిల్ల గౌరి ప్రేమిస్తూంటుంది. వీరిద్దరికీ పెళ్ళి జరుగుతుందన్నట్టుగా ఉంటుంది వారి స్థితి.

ఇంతలో అమ్మాయి గారి కాలేజీలోనే ఉండే మరో డబ్బున్న కుర్రాడు ఆమెను ప్రేమిస్తాడు. ఆమె వెంటపడడం చూసి గోపీ కొడితే, విషయం తెలిసి ఇరువైపుల పెద్దలూ వివాహం కుదురుస్తారు. ఆ వివాహం జరిగిన కొన్నాళ్ళకే భర్త చనిపోయి కథానాయిక తిరిగి పుట్టింటికి చేరుతుంది. కొన్నాళ్ళకు గోపీ మీద, కథానాయిక మీద ఊళ్ళో పుకార్లు చెలరేగుతాయి. చివర్లో వాళ్ళిద్దరూ వెళ్లిపోవాలని బల్లకట్టుపై బయలుదేరుతారు. వారిని కథానాయిక బావ ఆపకుండా ఉండేందుకు గౌరి అతని బలాత్కారాన్ని భరిస్తుంది. చివరికి ఆ వరద గోదారి ఉధృతిలో బల్లకట్టుతో సహా గోపీ, అమ్మాయిగారూ మరణిస్తారు.

తర్వాతి జన్మలో వారి ప్రేమ పండి వివాహమౌతుంది. ఈ కథ మొత్తాన్ని వృద్ధురాలైన గౌరీ వాళ్లిద్దరికీ చెప్తుంది.

తారాగణం

మార్చు
 • అక్కినేని నాగేశ్వరరావు (గోపి),
 • సావిత్రి (రాధ),
 • జమున (గౌరి),
 • గుమ్మడి,
 • సూర్యకాంతం,
 • నాగభూషణం (రాజేంద్ర),
 • పద్మనాభం (రామరాజు),
 • అల్లు రామలింగయ్య

సాంకేతిక వర్గం

మార్చు
 • సంభాషణలు: ముళ్లపూడి వెంకట రమణ, ఆత్రేయ
 • సాహిత్యం: ఆత్రేయ, దాశరథి
 • సంగీతం: కేవీ మహదేవన్
 • ప్లేబ్యాక్: ఘంటసాల, పి. సుశీల, జమున రాణి
 • సినిమాటోగ్రఫీ: పిఎల్ రాయ్
 • ఎడిటింగ్: టి.కృష్ణ
 • కొరియోగ్రఫీ: హీరాలాల్, పిఎస్ గోపాల కృష్ణ
 • కళ: జివి సుబ్బారావు
 • దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు

నిర్మాణం

మార్చు

కథా చర్చలు

మార్చు

దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చిన్న కథొకటి చదివారు, దానికి ఓ హిందీ సినిమా మిలన్ పునర్జన్మను కలిపి ఓ లైన్ అనుకున్నారు. "ఒక పేద పడవ కుర్రాడు, జమీందారు కూతురు ప్రేమించుకుంటారు. కానీ ఒకరికొకరు చెప్పుకోరు, నిజానికి వారికే స్పష్టంగా తెలియదు, ప్రేక్షకులకు మాత్రం తెలుస్తూంటుంది. ఆ జన్మలో వారి కలయిక సాధ్యం కాదు. వారు కలిసేందుకు మరోజన్మ కావాల్సివస్తుంది. మొత్తంగా ఇది మూడుజన్మల్లో జరిగే కథ" అన్నదే ఆయన మనసులో ఉన్న లైన్. దీన్ని ఆదుర్తి సుబ్బారావు కోరిక మేరకు ఆచార్య ఆత్రేయ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. ఆర్నెల్లపాటు సినిమా స్క్రిప్ట్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించి కుదరక ఆదుర్తితో ఆత్రేయ చివరకి "ఈ కథ సినిమాకి పనికిరాదని" చెప్పి వదిలేశారు.[2]

ముళ్ళపూడి వెంకటరమణను రచయితగా పరిచయం చేస్తూ, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో దాగుడు మూతలు సినిమా తీయాలని 1961 నుంచీ డి.బి.నారాయణ ప్రయత్నాలు సాగించారు. కానీ వేరే సినిమాల హడావుడిలో ఆదుర్తి కాలం గడిపేస్తూ వచ్చారు, ఈలోగా గుడిగంటలు, రక్తసంబంధం సినిమాలకు ముళ్ళపూడి స్క్రిప్ట్ రాశారు. ఆ సమయంలో ఈ సినిమా లైన్ ముళ్లపూడి వెంకటరమణకు చెప్పారు ఆదుర్తి. రమణ ఈ సినిమా లైన్ గురించి ఆయన బాల్యమిత్రుడు, గోదావరి పరిసరాల్లో ఇరిగేషన్ ఇంజనీరుగా పనిచేస్తున్న బి.వి.ఎస్.రామారావుతో చర్చించారు. ముందుగా బల్లకట్టుమీద కాలవ దాటించే హీరోకీ, హీరోయిన్ తో ప్రేమ అనుకున్నా, రామారావు బల్లకట్టు మీద దాటించడమంటే నిమిషాల్లో గడిచిపోతుందనీ గోదావరి అనుకుంటే కనీసం 45 నిమిషాల పాటు హీరో హీరోయిన్లకు ఏకాంతం సమకూరుతుందని సూచించారు. అలానే సఖినేటిపల్లి గోదావరికి ఒకవైపు ఉండగా, ఆ ఊరి వాళ్ళు నరసాపురం వై.ఎన్.కళాశాలలో చదువుకునే వైనం నేపథ్యంగా వివరించారు. వారిద్దరి మధ్య చర్చల్లోనే కథలో హీరోను ఇష్టపడే గౌరి పాత్ర వచ్చి చేరింది.[3] తాను అనుకున్న లైన్ మీద ఆదుర్తి స్క్రిప్ట్ రమణను కథ రాయమని హోటల్లో పెట్టి, ఆదుర్తి టి.ఆర్.సుందరం స్టూడియోలో తాను డైరెక్ట్ చేస్తున్న కాట్టు రోజా అనే తమిళ చిత్రం షూటింగ్ చూసుకున్నారు. ముందుగానే అనుకున్న చేర్పులను కొనసాగిస్తూ అయిదురోజుల్లో ఆ చిన్న లైన్ ని ముళ్ళపూడి వెంకటరమణ 40 పేజీల స్క్రిప్ట్ గా మలిచి ఆదుర్తికి ఇచ్చారు. దర్శకుడు ఆదుర్తికి స్క్రిప్ట్ చాలా నచ్చింది. ఆ సందర్భంలోనే సినిమాకి మూగమనసులు అన్న పేరు రమణ సూచన మేరకు నిర్ణయించారు.[2]
హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్లో రూములు బుక్ చేసి రచయిత ఆత్రేయ, దర్శకుడు ఆదుర్తి సహాయ దర్శకుడు కె.విశ్వనాథ్, సహనిర్మాత సుందరం పిళ్ళై, సహరచయిత ముళ్లపూడి వెంకటరమణ తదితరులతో కథాచర్చలు ఏర్పాటుచేశారు. అంతకుముందే రమణ రాసిన స్క్రిప్టును దగ్గరపెట్టుకుని ఆత్రేయ ట్రీట్మెంట్ రాయడం ప్రారంభించారు, ఒకవేళ ఆ కథనం కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావుకి నచ్చకుంటే ఆయన కాల్షీట్లు చేజారకుండా జాగ్రత్త కోసం ఆదుర్తి సమాంతరంగా స్క్రిప్టుకు వేరే ట్రీట్మెంట్ రాశారు. చివరకు ఆత్రేయ నాలుగురోజుల పాటు రాయడం పూర్తయ్యాకా ఆదుర్తిని పిలిచి - రమణ రాసిన కథని మార్చి రాయడం అనవసరమనీ, అందరూ తన కథని ఫెయిర్ చేస్తే ఈరోజు సినిమాల్లో కొత్తవాడైన రమణ కథని ఫెయిర్ మాత్రమే చేస్తున్నానని చెప్పడంతో కథ అభివృద్ధి పూర్తైంది. సినిమా కథాప్రకారం (స్క్రీన్ ప్లే) సహా అభివృద్ధి చేసేప్పుడు తర్వాతికాలంలో ప్రముఖ దర్శకుడైన నాటి అసోసియేట్ డైరెక్టర్ కె.విశ్వనాథ్ కథలో హాస్యసన్నివేశాలను రాశారు. దాంతో కథాప్రకారం (స్క్రీన్ ప్లే) కూడా పూర్తైపోయింది.[2] సినిమా ప్రారంభమయ్యాకా కొన్ని డైలాగుల విషయంలో అతికొద్ది, చిరుమార్పులు చోటుచేసుకున్నాయి. క్లైమాక్స్ లో బల్లకట్టు సుడిగుండం వద్దకు వచ్చి రాధ - గోపీ మరణించేప్పుడు "చావు అందరినీ విడదీస్తుంది. కాని ఒక్కోసారి కొందరిని కలుపుతుంది. మనలాటి వాళ్ళకి చావులోనే కలయిక సాధ్యం" అంటూ రాధ (సావిత్రి) చెప్పే డైలాగును షూటింగులో సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కొద్దిసేపు ముందు బాపురమణలు రాసి, అంతకుముందు రాసిన మాటలు మార్చి చేర్చారు.[2]

నటీనటుల ఎంపిక

మార్చు
 
సినిమాలోని ఒక సన్నివేశంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి.

ఆదుర్తి సుబ్బారావు తన మొదటి సినిమా నిర్మాత డి.బి.నారాయణకు దాగుడు మూతలు చేసిపెట్టాల్సివుంది. దాని స్క్రిప్ట్ పనికి ముళ్లపూడిని సినీరంగంలోకి తీసుకువస్తే అది సాగకపోగా రమణ మరో రెండు రీమేక్ సినిమాలకు రాసి విజయవంతమై ఉన్నారు. అయితే దాగుడుమూతలు సినిమా ఎప్పుడు రాద్దామని రమణ అడుగుతూండగా అది పక్కనపెట్టి మూగమనసులు స్క్రిప్ట్ పూర్తిచేయమన్నారు ఆదుర్తి. అయితే ఆ క్రమంలోనే డి.బి.నారాయణతో దాగుడుమూతలు సినిమా సంగతి మరోసారి చూడవచ్చు, ప్రస్తుతం మీరే ఈ సినిమాని నిర్మించమని ఆదుర్తి ఆఫర్ చేశారు. అయితే ఎన్టీఆర్ అప్పటికే డిబిఎన్ కు దాగుడుమూతలు సినిమా తీస్తే డేట్లిస్తానని కమిట్ అయి ఉన్నారు. అందువల్ల చేస్తే ఎన్టీ రామారావుతోనే చేస్తానని డి.బి.ఎన్. అన్నారు. దానికీ ఆదుర్తి అంగీకరించి మూగమనసుల్లో హీరోగా ఎన్టీఆర్ ని పెట్టుకుందామని సిద్ధం కాగా, రామారావు స్టూడియోల్లో తప్ప అవుట్-డోర్ షూటింగులకు ఒప్పుకోవట్లేదని ఈ సినిమా మొత్తం గోదావరి ప్రాంతంలోనే అవుట్-డోర్ లో తీయాల్సివస్తుందని కాబట్టి నాగేశ్వరరావును పెట్టుకుని మీరే తీసుకోండి అనేశారు డి.బి.ఎన్. దాంతో సినిమా హీరోగా నాగేశ్వరరావునే నిర్ణయించుకున్నారు.[4]
అలా హీరో పాత్రకి నాగేశ్వరరావుని అనుకోగా, లోతైన భావాలు పండించాల్సిన రాధ పాత్రకి సావిత్రిని, హుషారైన పల్లెటూరి పిల్ల గౌరిగా జమునని ఎంచుకున్నారు. మూగమనసులు కథాప్రకారం (స్క్రీన్ ప్లే) సహితంగా రాసేసుకున్నాకా సికిందరాబాద్ క్లబ్ లో స్టార్ మీటింగ్ ఏర్పాటుచేశారు ఆదుర్తి. ముఖ్యపాత్రలు పోషిస్తున్నవారికీ, డిస్ట్రిబ్యూటర్ నవయుగ నుంచి వాసు, శర్మ, చంద్రశేఖరరావులు, ఇతర కథ, దర్శకత్వ శాఖల వారూ అందులో పాల్గొన్నారు. కథ అందరికీ నచ్చడంతో ప్రధానపాత్రలు ధరించే నటులంతా అక్కడే అంగీకరించారు. అలానే సినిమా నిర్మాణానికి ఫైనాన్షియర్ గానూ, అనంతరం విడుదలకు డిస్ట్రిబ్యూటర్ గానూ వ్యవహరించే నవయుగ వాసు కూడా సినిమాకు అంగీకారం తెలపారు.[2]

చిత్రీకరణ

మార్చు

సినిమా చిత్రీకరణ చాలాభాగం అవుట్-డోర్‌లో జరిగింది. గోదావరి తీరంలో ఉన్న పల్లెటూళ్ళో కథ సాగడం, అదీ హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు ప్రధానంగా గోదావరిపైన బల్లకట్టు మీద కావడంతో షూటింగ్ కోసం పెద్ద లాంచీలు, 6*15 అడుగుల కొలతలతో ఉండే పంట్ లు, పెట్రోల్ బోట్, విక్టోరియా స్టీమర్ లతో కలిపి భారీ నౌకాదళం వినియోగించారు. నౌకల్లో, బోట్లలో ప్రయాణం చేస్తూ భద్రాచలంలో ప్రారంభించి ధవళేశ్వరం వరకూ చిత్రీకరణ చేశారు. వాటి మీదే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బస ఏర్పాటుచేసి ప్రయాణం చేస్తూన్నప్పుడు దర్శకుడికి ఎక్కడ నచ్చితే ఆ లొకేషన్లో ఆపి చిత్రీకరణ జరిపేవారు.
అయితే చిత్రీకరణకు ముందు సినిమా అవుట్ డోర్ షూటింగ్ అయితే నాగేశ్వరరావు, సావిత్రిలాంటి స్టార్స్ తో జనాన్ని కంట్రోల్ చేయలేమనీ గోదావరి మీద సినిమా వద్దనీ సహనిర్మాత సుందరం అడ్డుపడ్డారు. ఆఖరి నిమిషంలో మొదట అనుకున్నట్టే గోదావరి పరిసరాల్లోనే అవుట్-డోర్లో సినిమా తీసేందుకే సిద్దపడ్డారు. క్లైమాక్స్ సన్నివేశంలో హీరోహీరోయిన్లు ప్రమాదవశాత్తూ చనిపోతారు. ఆ సన్నివేశం వరదల్లో ఆనకట్ట వద్ద నీటి ఉధృతితో సుడిగుండాలు ఏర్పడగా హీరోహీరోయిన్లు ప్రయాణిస్తున్న నావ దాంట్లో పడి కొట్టుకుపోయేట్టు, వారు వరదలో మరణించినట్టూ రాశారు రచయిత రమణ. ఆ సన్నివేశాన్ని రాసేప్పుడు అందుకు తగ్గ వాతావరణాన్ని, ఆనకట్ట, వరదాకాలం వంటి విషయాలను రమణ బాల్యమిత్రుడు, అప్పటికి గోదావరి ప్రాంతంలో నీటిపారుదల శాఖలో ఇంజనీరింగు విభాగంలో పనిచేస్తున్న బి.వి.ఎస్.రామారావు సూచించారు. అయితే చిత్రీకరణ ప్రారంభమవుతుండగా ముళ్ళపూడి ఆ విషయాన్ని బి.వి.ఎస్.రామారావుకు ఫోన్ చేసి చెప్పారు. అయితే అప్పటికి వరదలు కొనసాగుతున్నాయి, మరో వారం పదిరోజుల్లో వరద తగ్గిపోతే షట్టర్లు ఎత్తేస్తారు. మళ్ళీ ఆ వరదను చిత్రీకరించాలంటే సంవత్సరం దాకా ఎదురు చూడాల్సిందే. ఆ విషయాన్ని రామారావు ముళ్ళపూడి వెంకటరమణకి ఫోన్ చేసి చెప్పడంతో, ఆదుర్తితో మాట్లాడి మరో మూడురోజుల్లో ఆదుర్తి, ముళ్లపూడి, కెమెరామాన్ పి.ఎల్.రాయ్, డూపులు తదితరులు వచ్చారు. పిచుకల లంకలో షూటింగ్ చేశారు. డూపులను నించోబెట్టిన నావ ఆనకట్ట వరకూ చేరడం లాంగ్ షాట్ లో చిత్రీకరించి, తర్వాతి షాట్లో డమ్మీలతో నావ సుడిలో ఆనకట్ట వద్ద పడేలా వదిలి ఆ ప్రమాదాన్ని చిత్రీకరించారు. అలా సినిమా క్లైమాక్సుతోనే చిత్రీకరణ ప్రారంభించింది.[3]
సినిమా చిత్రీకరణలో ఒకసారి కథానాయిక సావిత్రికి ఘోర ప్రమాదం జరిగింది. ఈ నాటి ఈ బంధమేనాటిదో పాటకి ఐ.ఎల్.టి.డి పెట్రోల్ బోటులో చిత్రీకరణ జరుగుతోంది. గంటకు పదికిలోమీటర్ల వేగంతో ఆ బోటును ఆనకట్ట దగ్గర నడిపిస్తున్నారు. ఆ బోటుపై సావిత్రి, నాగేశ్వరరావు ఉన్నారు. వేరే బోటుమీద కెమెరా, డైరెక్టరు తదితరులు ఉండి చిత్రీకరణ జరుపుతున్నారు. సావిత్రి ఒక షాట్లో బోటుపై ఉన్న జెండా కర్ర పట్టుకుని వయ్యారంగా వెనక్కి వాలింది. హఠాత్తుగా ఆ కర్ర విరిగిపోగా సావిత్రి నడి గోదారిలో పడిపోయింది. ఈ హడావుడిలో ఆమె చీర బోటుకింద ఉండే మోటారుచక్రంలో ఇరుక్కుని లుంగచుట్టుకుపోయింది. ఆమె బోటు అంచును చేత్తోపట్టుకుంది, బోటు ఆనకట్ట వైపుకు వెళ్తోంది. అక్కడికి వెళ్తే సావిత్రి జలపాతంలో పడికొట్టుకుపోతుంది. ఈలోగా నాగేశ్వరరావు చేయందిస్తూ పట్టుకోమంటున్నాడు. గట్లపై వేలమంది జనం, తానేమో చీర జారిపోయివుంది, దాంతో సావిత్రి సిగ్గు, భయంతో రావట్లేదు. ఆ స్థితిలో లాంచిడ్రైవర్ సింహాచలం దాన్ని ఆపేందుకు రివర్స్ గేర్ వేశారు. సమస్య అర్థం చేసుకున్న నాగేశ్వరరావు బోటులోని కాన్వాస్ గుడ్డ ఆమెకు అందించగా చుట్టుకుంది, ఇంతలో లాంచివాళ్ళూ, ఈతగాళ్ళూ చుట్టూ తమ తలగుడ్డలు అడ్డుపెట్టి నుంచోగా నాగేశ్వరరావు చేసాయంతో పైకెక్కారు. దాంతో పెనుప్రమాదం తప్పిపోయింది. ఈ సంఘటన జరగడంతో సావిత్రి చాన్నాళ్ళు గోదావరి పరిసరాల్లో అవుట్-డోర్ షూటింగుల్లో నటించలేదు. ఆశ్చర్యకరంగా చాన్నాళ్ళకు జరిగిన మరోసినిమా షూటింగులోనూ ప్రమాదం జరిగి సావిత్రి కొద్దిలో తప్పించుకున్నారు.[2]

సంగీతం

మార్చు

మూగమనసులు సినిమాకి సంగీత దర్శకత్వం కె.వి.మహదేవన్ వహించారు.[5][6] దాశరథి, కొసరాజు ఒక్కోపాట వ్రాయగా, ఆత్రేయ మిగిలిన పాటలన్నీ రాశారు. సినిమా స్క్రీన్ ప్లేతో సహా తయారై, విన్న ముఖ్యులకు ఒకే అయిపోగానే వెనువెంటనే హైదరాబాదులోనే పాటల రచన, స్వరకల్పన ప్రారంభమైంది. ఆత్రేయ రాయక రికార్డింగ్, షూటింగ్ వేళలు మించిపోతున్నా రాయక దర్శక నిర్మాతలను ఇబ్బందిపెట్టేవారు. దాంతో ఆయన గురించి బాగా తెలిసినవారవడంతో దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు మద్రాసు నుంచి హైదరాబాదుకు కె.వి.మహదేవన్, పుహళేంది, తబలా వాద్యకారుడు మైకేల్ పిలిపించి తాజ్ మహల్ హోటల్లోనే అప్పటికప్పుడే మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టుకున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ ప్రాంతంలోనే ఆదుర్తి వేరే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పగలంతా ఆత్రేయ, ఇతర రచయితలు పాటలు రాయడం, వాటిని మహదేవన్ ట్యూన్లు కట్టడం పూర్తయ్యాకా సాయంత్రం షూటింగ్ ఆపి వచ్చి ఆదుర్తి విని ఒకే చేసేవారు. వారంరోజుల్లో సినిమా పాటలన్నీ తయారైపోయాయి.[2] ఆపైన మద్రాసులో పాటలను రికార్డ్ చేశారు.

పాటల వివరాలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది దాశరథి కె.వి.మహదేవన్ పి.సుశీల
ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
నా పాట నీ నోట పలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గు లోలకాల సిలకా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా కొసరాజు కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల
ముక్కుమీద కోపం నీ ముఖానికీ అందం ఆత్రేయ కె.వి.మహదేవన్ జమునారాణి

స్పందన

మార్చు

విమర్శలు

మార్చు

సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు కొద్దిపాటి కథను తెలుసుకున్నవారు బాగోలేదన్న పుకార్లు లేవదీశారు. కోనసీమ ప్రాంతంలో చుట్టూ వేలాదిమంది మూగివున్న అవుట్-డోర్లో సినిమా చిత్రీకరణ జరుపుకోవడంతో చిత్రీకరణ దశలోనే కొన్ని విషయాలు బయటకు తెలిసాయి. అప్పటి స్టార్ హీరో నాగేశ్వరరావు రొమ్ముపై జమున కాలుపెట్టగా ఆయన పారాణి పెట్టడం, మహానటిగా పేరుగడించిన సావిత్రి పాత్రకి, హాస్యనటుని ఇమేజ్ ఉన్న పద్మనాభం పాత్రకీ పెళ్ళిచేయడం, కథానాయకి పాత్ర నాగేశ్వరరావు పాత్రని ఒరేయ్ అని సంబోధించడం వంటివి చిత్రీకరణ సమయంలోనే తెలుసుకున్న వారు ఇమేజిని పట్టించుకోకుండా తీసిన ఈ సినిమా ఘోరంగా దెబ్బతింటుందని ప్రచారం ప్రారంభించారు. ఈ విషయాలు గోదావరి జిల్లాల నుంచి మద్రాసు చేరుకుని ఎన్టీఆర్ సన్నిహితుల్లో, మిగిలిన స్టూడియోల వారిలో పెరిగి తిరిగి కోనసీమలో షూటింగ్ చేస్తున్న బృందం వరకూ వచ్చాయి. సినిమా ఫలితంపై ధైర్యంగానే ఉన్నా దర్శకుడు, హీరో, డిస్ట్రిబ్యూటర్లు, రచయితలతో కలిపి చిన్నపాటి మీటింగ్ జరిగిది. అందులో భాగంగా సినిమాలో జమున పాత్ర కాళ్ళుపట్టుకుని నాగేశ్వరరావు పాత్ర పారాణి పెట్టే సన్నివేశం వరకూ తొలగిస్తే ఎలావుంటుందని, అసలింతకి ఇది కేవలం కల్పితమేనా అనీ చర్చించారు. శివ తపోభంగానికి ముందు ఘట్టంలో మన్మథుడు తన భార్య రతీదేవికి పారాణి దిద్దుతున్నారనీ, ఆ పని ఆపి శివుని తపోభంగానికి వెళ్ళడంతోనే భస్మమవుతాడని పురాణాల్లో ఈ అంశానికి ఉన్న నేపథ్యమూ, రావణ కృత శివతాండవస్తోత్రంలోనూ ఇలాంటిదే శివుడు చేసినట్టు ఉండడాన్ని రమణ చెప్పగా ఆ సన్నివేశం అలాగే ఉంచేశారు.[2]

ప్రచారం

మార్చు
 
బాపు వేసిన మూగమనసులు టైటిల్ డిజైన్, ప్రధాన పాత్రలైన గోపి, రాధ, గౌరిలకు సంకేతంగా పడవ, ముద్దబంతిపూవు, పంగలకర్ర కనిపిస్తాయి ఇందులో

ప్రముఖ చిత్రకారుడు బాపు సినిమాకి టైటిల్ డిజైన్, పబ్లిసిటీ డిజైన్ చేసిచ్చారు. ముఖ్యంగా ఆయన వేసిన టైటిల్ డిజైన్ చాలామందిని ఆకట్టుకుంది. సినిమా వాతావరణాన్ని, కతలోని ముఖ్యపాత్రలని బాపు తాను వేసిన టైటిల్ డిజైన్లో ఇమిడ్చారు. టైటిల్ డిజైన్లో రాదారి పడవ, ముద్దబంతిపువ్వు, పంగల కర్ర కనిపిస్తాయి. కథానాయకుడు గోపి గోదాట్లో పడవ నడుపుతూ అద్దరికి ఇద్దరికి తిప్పుతూ జీవిస్తుంటాడు, అతనికి డిజైన్లో వేసిన రాదారి పడవ సంకేతం. ఇక రాధ (సావిత్రి) పాత్రకి సంకేతంగా ముద్దబంతిపువ్వును పెట్టారు ఇందులో, రోజూ పడవ నడిపే గోపీ తనకిచ్చే ముద్దబంతి పువ్వును జళ్ళో పెట్టుకుంటుంది ఆమె, పైగా ఆ పువ్వు వారిద్దరి మూగప్రేమకూ కూడా సంకేతం. ఇక కింద గోదావరి అలల్లా కనిపించేవి సరిగా చూస్తే పంగలకర్ర, ఇది రెండవ కథానాయిక పాత్రైన గౌరికి సంకేతం. ఆమె గొర్రెల్ని కాసుకుంటూ పంగలకర్ర పట్టుకుని తిరుగుతుంది సినిమాలో, అదే కాక ఆమె చలాకీతనం, ఉత్సాహాలకు కూడా దాన్ని సంకేతంగా చూపిస్తున్నారు.[7]

విడుదల

మార్చు

సినిమా నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగానూ, పక్కరాష్ట్రాల్లోని తెలుగు ప్రాంతాల్లోనూ విడుదలయ్యింది. విడుదలయ్యాకా సినిమా ఘనవిజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగా నిర్మాతలకూ, పంపిణీదారులకూ చాలా లాభాలు అందించింది. అంతేకాక విమర్శకులు కూడా సినిమాను గొప్పగా మెచ్చుకున్నారు.[2]

పునర్నిర్మాణాలు

మార్చు

మూగమనసులు సినిమాని హిందీలో నూతన్, సునీల్ దత్ జంటగా మిలన్ పేరిట అనువదించారు. ఎల్.వి.ప్రసాద్, తారాచంద్ బర్జాత్యాలు సినిమాని హిందీలో పునర్నిర్మించగా, హిందీ వెర్షన్ కీ ఆదుర్తి సుబ్బారావే దర్శకత్వం వహించారు. మిలన్ ప్రేక్షకాదరణ పొంది 175రోజులు పూర్తిచేసుకుంది.

ఇది సావిత్రి దర్శకత్వంలో తమిళంలోకి 'ప్రాప్తం'గా, హిందీలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 'మిలన్'గా రీమేక్ చేయబడింది. కె.విశ్వనాథ్ రెండో యూనిట్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

దీనికి రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది.

మూలాలు

మార్చు
 1. "Mooga Manasulu (1964)". Indiancine.ma. Retrieved 2023-07-29.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 ముళ్ళపూడి, వెంకటరమణ (1 July 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
 3. 3.0 3.1 బి.వి.ఎస్.రామారావు (1 October 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
 4. ముళ్ళపూడి, వెంకటరమణ (సెప్టెంబరు 2014). ముక్కోతి కొమ్మచ్చి (4 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
 5. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 6. సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006
 7. (ఎంబీఎస్ కాలమ్ లో), ఎమ్.బి.ఎస్. "బాపు విశ్వరూపం- 9". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 24 డిసెంబరు 2014. Retrieved 28 July 2015.