వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 20వ వారం
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 - జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు. మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు. ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. సర్ ఆర్థర్ కాటన్ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరీవాహక జిల్లా లను అత్యంత అభివృద్ధి, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి.
(ఇంకా…)