వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 32వ వారం

మాలపిల్ల

మాలపల్లి గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో "సారధి ఫిలిమ్స్" నిర్మాణంలో గోవిందరాజులు సుబ్బారావు, కాంచనమాల, గాలి వెంకటేశ్వరరావు ప్రధానపాత్రల్లో నటించిన 1938 నాటి తెలుగు సాంఘిక చలనచిత్రం. గుడిపాటి వెంకటచలం రాసిన అముద్రిత నవల మాలపిల్ల సినిమాకు ఆధారం. మాటలు, కొన్ని పాటలు తాపీ ధర్మారావు నాయుడు రాయగా, మిగిలిన పాటలు అప్పటికే ప్రచారంలో ఉన్న బసవరాజు అప్పారావు గేయాలు, జయదేవుని అష్టపదుల నుంచి తీసుకున్నారు. భీమవరపు నరసింహారావు సంగీతాన్ని అందించారు. చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ప్రోత్సాహం, ఆర్థిక సహకారంతో గూడవల్లి రామబ్రహ్మం ఎండీగా ప్రారంభమైన సారధి ఫిలిమ్స్ తొలి చిత్రంగా మాలపిల్ల నిర్మించారు. రంగస్థలంలో ప్రఖ్యాతుడైన గోవిందరాజులు సుబ్బారావుకూ, సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తున్న గూడవల్లి రామబ్రహ్మానికి కూడా ఇదే తొలి చిత్రం. కళ్యాణపురం అన్న గ్రామంలో హరిజన యువతి, బ్రాహ్మణ యువకుడు ప్రేమించుకుని సాంఘిక స్థితిగతులను ఎదిరించి ప్రేమ సఫలం చేసుకోవడమూ, హరిజనులు పోరాటం ద్వారానూ, తమ సహృదయత ద్వారానూ ఛాందస బ్రాహ్మణుడైన ధర్మకర్త సుందరరామశాస్త్రి మనసు మార్చి దేవాలయ ప్రవేశం పొందడం సినిమా కథాంశం. అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా స్వీకరించి సినిమా తీశారు.

(ఇంకా…)