మాలపిల్ల

1938 తెలుగు సినిమా

మాలపల్లి గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో "సారధి ఫిలిమ్స్ " నిర్మాణంలో గోవిందరాజులు సుబ్బారావు, కాంచనమాల, గాలి వెంకటేశ్వరరావు ప్రధానపాత్రల్లో నటించిన 1938 నాటి తెలుగు సాంఘిక చలనచిత్రం[1]. గుడిపాటి వెంకటచలం రాసిన అముద్రిత నవల మాలపిల్ల సినిమాకు ఆధారం. మాటలు, కొన్ని పాటలు తాపీ ధర్మారావు నాయుడు రాయగా, మిగిలిన పాటలు అప్పటికే ప్రచారంలో ఉన్న బసవరాజు అప్పారావు గేయాలు, జయదేవుని అష్టపదుల నుంచి తీసుకున్నారు. భీమవరపు నరసింహారావు సంగీతాన్ని అందించారు. చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ప్రోత్సాహం, ఆర్థిక సహకారంతో గూడవల్లి రామబ్రహ్మం ఎండీగా ప్రారంభమైన సారధి ఫిలిమ్స్ తొలి చిత్రంగా మాలపిల్ల నిర్మించారు. రంగస్థలంలో ప్రఖ్యాతుడైన గోవిందరాజులు సుబ్బారావుకూ, సినిమా రంగంలో ప్రయత్నాలు చేస్తున్న గూడవల్లి రామబ్రహ్మానికి కూడా ఇదే తొలి చిత్రం.

మాలపిల్ల
(1938 తెలుగు సినిమా)
దర్శకత్వం గూడవల్లి రామబ్రహ్మం
కథ గుడిపాటి వెంకటచలం
తారాగణం గోవిందరాజులు సుబ్బారావు,
కాంచనమాల,
భానుమతి,
సుందరమ్మ,
పి.సూరిబాబు,
గాలి వెంకటేశ్వరరావు,
వెంకటసుబ్బయ్య,
రాఘవన్,
గంగారత్నం,
లక్ష్మీకాంతమ్మ,
టేకు అనసూయ,
పువ్వుల అనసూయ
సంగీతం భీమవరపు నరసింహారావు
సంభాషణలు గుడిపాటి వెంకటచలం, తాపీ ధర్మారావు
నిర్మాణ సంస్థ సారధి ఫిలిమ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కళ్యాణపురం అన్న గ్రామంలో హరిజన యువతి, బ్రాహ్మణ యువకుడు ప్రేమించుకుని సాంఘిక స్థితిగతులను ఎదిరించి ప్రేమ సఫలం చేసుకోవడమూ, హరిజనులు పోరాటం ద్వారానూ, తమ సహృదయత ద్వారానూ ఛాందస బ్రాహ్మణుడైన ధర్మకర్త సుందరరామశాస్త్రి మనసు మార్చి దేవాలయ ప్రవేశం పొందడం సినిమా కథాంశం[2]. అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా స్వీకరించి సినిమా తీశారు[1].[3] ఐతే కులవివక్ష సమాజం అంతా ఉండగా కేవలం బ్రాహ్మణులనే లక్ష్యంగా చేసుకుని, సంస్కరణాభిలాష మొత్తానికి చౌదరి అనే పాత్రనే ప్రతినిధిగా చేసి సినిమా తీయడం వివక్షాపూరితంగా ఉందంటూ సమకాలీన బ్రాహ్మణుల నుంచి విమర్శలు, నిరసనలు వచ్చాయి.

సినిమాను 1938 మే 1న ప్రారంభించి మద్రాసు (నేటి చెన్నై)లోని మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియోలోనూ, నగరం చుట్టుపక్కల గ్రామాల్లోనూ చిత్రీకరణ చేశారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు బొంబాయి (నేటి ముంబై)లో పూర్తిచేసుకున్నారు. సినిమా నిర్మాణానికి రూపాయలు లక్షా పదివేలు ఖర్చు అయ్యింది. సినిమా ముగింపులో హరిజనులకు దేవాలయ ప్రవేశాన్ని కల్పిస్తూ శాసనం చేసిన తిరువాన్కూరు మహారాజును ప్రశంసిస్తూ కొన్ని ప్లేబాక్ డైలాగులు చేర్చారు. మాలపిల్ల సినిమాను సంస్కరణవాది, ప్రముఖ దాత కాశీనాథుని నాగేశ్వరరావుకు అంకితం ఇచ్చారు. నిర్మాణానికి కొన్ని రోజుల ముందు మరణించిన నాగేశ్వరరావు పంతులు అంతిమయాత్రను సినిమా చివరిలో అనుబంధంగా చేర్చారు.

మాలపిల్ల సినిమా తెలుగు సినిమా రంగంలో తొలి వివాదాస్పదమైన సినిమా. సినిమాను నిషేధించాలని, కొన్ని భాగాలు పునర్నిర్మించాలని కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లో సభల్లో తీర్మానాలు జరిగాయి. సినిమా సమాజంలోని వాస్తవాలకు బదులు పక్షపాతధోరణులతో చిత్రీకరిస్తోందంటూ పత్రికల్లో విమర్శలు, సమాజంలోని దుర్లక్షణాలను వ్యతిరేకించిందే తప్ప వర్గాన్ని లక్ష్యం చేసుకోలేదని సమర్థనలు వచ్చాయి. సినిమా కారణంగా కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులకు మంచినీరు ఇవ్వకపోవడం, పారిశుధ్య కార్మికులు తిరుగుబాటు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. బ్రాహ్మణుల అభ్యంతరాలకు ఆజ్యం పోస్తూ పిలక బ్రాహ్మణులకు ఉచిత పాసులు అంటూ ప్రచారం చేశారు. ఐతే వాదోపవాదాలు, వివాదాల కారణంగా మరింత ప్రాచుర్యం లభించి సినిమా విజయవంతం అయింది. సినిమా దశాబ్దాలు గడిచేకొద్దీ సాహసోపేతమైన చిత్రంగా, సందేశాత్మక చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని తెలుగు సినిమా రంగంలో క్లాసిక్ గా పేరుపొందింది.

కళ్యాణపురం అనే గ్రామంలో రాధాబాయమ్మ, తదితరులు గాంధీజీ స్ఫూర్తితో హరిజనోద్యమాన్ని లేవనెత్తుతారు. ఆ క్రమంలో హరిజనులతో ఆలయ ప్రవేశం చేయబోతుంటే బ్రాహ్మణులు ఆగ్రహిస్తారు. ఆలయ ప్రవేశాన్ని ధర్మకర్త సుందరరామశాస్త్రి అడ్డుకుంటాడు. చౌదరి బ్రాహ్మణులకు, హరిజనులకు వివాదం సమసిపోయేలా చేసి, రాజీ కుదర్చాలని ప్రయత్నం చేస్తూంటాడు. బ్రాహ్మణుల వల్ల మంచినీరు దొరకక హరిజనులు అల్లల్లాడతారు. మరోవైపు సుందరరామశాస్త్రి కుమారుడు నాగరాజు, హరిజనుల అమ్మాయి శంపాలత ప్రేమించుకుంటారు. గ్రామంలోని వివాదాల మధ్య ఎవరో చెప్పిన మాటలు విని శంపాలత నాగరాజును అనుమానిస్తుంది.

గ్రామంలో వివాదాలు ముదిరి చౌదరి నాయకత్వంలో హరిజనులు తమ వృత్తి పనులు చేయడం మానేస్తారు. బ్రాహ్మణులతో పాటుగా అగ్రవర్ణస్తులందరూ తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. తన కొడుకు శంపాలతను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న సుందరరామశాస్త్రి అతన్ని మందలిస్తాడు. ప్రేమికుల మధ్య అనుమానం తొలగిపోవడంతో, ఊరొదిలి శంపాలతకు తోడుగా చెల్లెలు అనసూయను కూడా తీసుకుని ప్రేమికులు కలకత్తా పారిపోతారు. కలకత్తాలో నాగరాజు ఉద్యోగం చేస్తూ, శంపాలతకు విద్య నేర్పిస్తూంటాడు.

కళ్యాణపురంలో అగ్నిప్రమాదం జరుగుతుంది, అందులో చిక్కుకున్న సుందరరామశాస్త్రి భార్యని హరిజనులు ప్రాణాలకు తెగించి కాపాడతారు. వారిలోని మానవత్వాన్ని, సహృదయాన్ని అర్థం చేసుకున్న సుందరరామశాస్త్రి హరిజనుల దేవాలయ ప్రవేశానికి అనుమతి తెలుపుతాడు. మల్లికార్జున శర్మ వంటి ఇతర బ్రాహ్మణులు దీన్ని వ్యతిరేకిస్తారు. పోలీసుల రాకతో గొడవ సర్దుమణిగి హరిజనులు దేవాలయ ప్రవేశం చేస్తారు. తండ్రి అంగీకారంతో శంపాలతను నాగరాజు వివాహం చేసుకుంటాడు.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

నాటక కర్త, సినిమా రంగంలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన గూడవల్లి రామబ్రహ్మం 1937 డిసెంబరులో తాను మేనేజింగ్ డైరెక్టరుగా, చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ కృష్ణప్రసాద్ ఛైర్మన్ గా సారధి ఫిలింస్ ప్రారంభించారు. సినిమా మొదటి చిత్రంగా అస్పృశ్యత, హరిజన సమస్యల అంశాన్ని కేంద్రంగా తీసుకున్న కథాంశంతో తీయాలని పలు కథలను పరిశీలించాయి. గుడిపాటి వెంకట చలం రాసిన అముద్రిత నవల "మాలపిల్ల" సంస్థ డైరెక్టర్లకు అందరికీ నచ్చింది. చలం నవలను కథాంశంగా స్వీకరించి తీసేందుకు ఆయన అంగీకరించినా కథాచర్చలకు వచ్చేందుకు ఒప్పుకోలేదు. సంపాదకుడు, రచయిత తాపీ ధర్మారావు నాయుడును సినిమాకు రచయితగా పెట్టుకుని స్క్రీన్ ప్లే, సంభాషణలు రాయించారు. అప్పటికే ప్రాచుర్యం పొందిన బసవరాజు అప్పారావు రాసిన పాటలను సినిమాలో ఉపయోగించుకున్నారు. చలం రాసిన నవలలో ప్రధానాంశం బ్రాహ్మణ యువకుడు, హరిజన యువతి ప్రేమించి పెళ్ళిచేసుకోవడం వరకే కావడంతో గూడవల్లి రామబ్రహ్మం, తాపీ ధర్మారావు నాయుడు సమకాలీన అంశాలైన మద్యపాన నిషేధం, హరిజనుల దేవాలయ ప్రవేశం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి అంశాలతో కథను విస్తరించారు. చలం రాసిన సంభాషణలు కొన్ని ఉంచేసి, అవసరమైనంత మేరకు మిగతా సంభాషణలు తాపీ ధర్మారావు రాసుకున్నారు.

మాలపల్లి సినిమాకు ఛాయాగ్రాహకునిగా శైలేన్ బోస్ పనిచేశారు. నాట్యాలను చమన్ లాల్ నిర్వహించగా, కూర్పు ధరంవీర్ సింగ్ చేశారు. ఎస్.వి.ఎస్.రామారావును కళాదర్శకునిగా, పి.వి.విశ్వనాథ శర్మను శబ్ద గ్రాహకునిగా తీసుకున్నారు.[4]

నటీనటుల ఎంపిక

మార్చు

సినిమాలో కీలకమైన సుందరరామశాస్త్రి పాత్రకు రంగస్థలంపై ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కం నాటకాల్లో పాత్ర పోషణకు ప్రఖ్యాతుడైన గోవిందరాజులు సుబ్బారావును తీసుకున్నారు. అప్పటికే రంగస్థలంపై గొప్ప నటునిగా ప్రేక్షకాదరణ పొందిన గోవిందరాజుల సుబ్బారావు నటించిన తొలి సినిమా మాలపిల్ల. నాగరాజు పాత్రలో గాలి వెంకటేశ్వరరావు నటించారు. ప్లేబాక్ సౌకర్యం లేని రోజులు కావడంతో, సంగీత కుటుంబం నుంచి వచ్చివుండడం గాలి వెంకటేశ్వరరావుకు ఉపకరించింది. శంపాలత పాత్రకు అప్పటికే నాలుగు సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి ప్రఖ్యాతి కలిగిన కాంచనమాలను తీసుకున్నారు. అయితే అమాయకమైన, సుగుణవతియైన కథానాయిక శంపాలత పాత్రకు, కాంచనమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన పేరు తీసుకువచ్చిన విప్రనారాయణ, గృహలక్ష్మి సినిమాల్లోని వ్యాంప్ పాత్రలకు ఇమేజ్ భేదం వస్తుందని సంశయించి పుష్పవల్లి పేరునూ పరిశీలించారు. ఐతే చివరకు ఆ పాత్ర కాంచనమాలకే వెళ్ళింది. చౌదరి పాత్రకు అప్పటికి పౌరాణిక చిత్రాల్లో పలు పాత్రలు పోషించిన పువ్వుల సూరిబాబును ఎంపికచేశారు. సుందరరామశాస్త్రి భార్య పాత్రలో పువ్వుల లక్ష్మీకాంతం, శంపాలత చెల్లెలు అనసూయగా సుందరమ్మ, తల్లిదండ్రులు మునెయ్య దంపతులుగా ఎం.సి.రాఘవన్, గంగారత్నం, రాధాబాయమ్మగా హేమలతాదేవి, మల్లికార్జునశర్మగా వంగర వెంకటసుబ్బయ్య నటించారు.[4]

చిత్రీకరణ, పోస్ట్-ప్రొడక్షన్

మార్చు

1938 మే 1న మద్రాసు (నేటి చెన్నై)లోని మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియో (తర్వాతి కాలంలో జెమినీ స్టూడియోగా ప్రసిద్ధం)లో ప్రముఖ రాజకీయ నేత, సాహిత్యవేత్త బెజవాడ గోపాలరెడ్డి చేతుల మీదుగా మాలపిల్ల చిత్రీకరణ ప్రారంభం అయింది. కథా వేదిక అయిన కళ్యాణపురంగా చెన్నై సమీపంలోని క్రోమ్ పేట, పల్లవరం మధ్యన ఉన్న ఒక ఊరిని చూపించారు. చెన్నైకి అత్యంత సమీపంలో ఉన్న, వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన తిరునీర్మలైలో హరిజన పాత్రలు పాడే పాట, దేవాలయ ప్రవేశం సన్నివేశాలు చిత్రీకరించారు. మిగిలిన సినిమా అంతటినీ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియోలోనే చిత్రీకరించారు. జూన్ 15 నాటికి సినిమా చిత్రీకరణ పూర్తయింది. 1938 ఆగస్టు నెలలో మాలపిల్ల సినిమా కూర్పు, రీరికార్డింగ్, ప్రింటింగ్ వంటి కార్యక్రమాలు పూర్తిచేశారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలన్నిటినీ బొంబాయి (నేటి ముంబై)లో చేశారు.

మాలపిల్ల సినిమా బడ్జెట్ పూర్తయ్యేసరికి రూ.లక్షా పదివేలు. అప్పట్లో తెలుగు సినిమాలు లక్ష రూపాయల లోపు బడ్జెట్ తో నిర్మించేవారు. ఆ ప్రమాణాల్లో మాలపిల్ల భారీ బడ్జెట్ సినిమాగా చెప్పాలి.[4]

విడుదల

మార్చు

మాలపిల్ల సినిమా విజయదశమి సందర్భంగా 1938 సెప్టెంబరు 25న విడుదల అయింది. ఆంధ్ర ప్రాంతంలో 11 కేంద్రాలు, బెంగళూరు నగరంలోనూ సినిమా విడుదల అయింది.

స్పందన

మార్చు
 
మాలపిల్ల సినిమా పోస్టరు [1]

మాలపిల్ల సినిమా మంచి విజయం సాధించింది. సినిమాపై రేకెత్తిన వివాదాలు మాలపిల్ల సినిమాను ప్రచారంలోకి తీసుకురావడానికి ఉపకరించి విజయానికి దోహదం చేశాయి. వసూళ్ళపరంగానూ, విడుదలైన థియేటర్ల పరంగానూ కూడా మాలపిల్ల అప్పటి సినిమా రంగంలో కొత్త రికార్డులు నెలకొల్పింది. సినిమా విడుదల సమయంలో వచ్చిన సమీక్షలు సినిమాకు సానుకూలంగా రాలేదు. ఆంధ్రపత్రికలో సినిమా విడుదలకు ముందే ప్రచురితమైన సమీక్షలో "కళ్యాణపురంలో బ్రాహ్మణులకు, హరిజనులకు తప్ప మిగతా కులాల వారందరికీ ఈ సమస్య (ఛాందసం, మౌఢ్యం) సంబంధం లేకుండా ఎందుకు చేశారో బోధపడకుండా ఉంది. నాగరాజు, శంపాలతల మధ్య చూపించింది ప్రేమగా కాక కామంగా అగుపిస్తుంది. ఉదాత్తమైన ప్రేమానుబంధం లేకపోవడం వల్ల ఈ పాత్రలు సానుభూతికి నోచుకోకుండా పోయాయి" అని విమర్శించారు.[4] అయితే సమకాలీన విమర్శకుల స్పందన మిశ్రమంగానూ, కొంత వ్యతిరేకంగానూ ఉన్నా కాలానుగుణంగా సినిమాను విమర్శకులు క్లాసిక్ గా గుర్తించారు. సాంఘిక సమస్యలపై సాహసోపేతంగా తీసిన సినిమాగా తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు.

వివాదాలు

మార్చు

మాలపిల్ల సినిమా అత్యంత వివాదాస్పదమైన, వాదవివాదాలకు కారణమైన సినిమా. కుల మౌఢ్యం అన్ని కులాల వారిలోనూ ఉండగా కేవలం బ్రాహ్మణులనే కేంద్రం చేసుకుని తీశారని, సినిమాలో చౌదరి పాత్ర ద్వారా కమ్మవారు మాత్రమే సంస్కరణాభిలాషులు అన్నట్టు చూపిస్తున్నారన్న విమర్శతో బ్రాహ్మణులు వ్యతిరేకించారు. విజయవాడ బ్రాహ్మణ సంఘం నియమించగా పండ్రంగి కేశవరావు అనే ప్రముఖుడు సినిమాను సమీక్షించి సినిమాకు అననుకూలమైన నివేదిక సంఘానికి సమర్పించాడు.[5] బ్రాహ్మణులకు, హరిజనులకు మధ్య వైషమ్యాలు రేకెత్తించేందుకు, బ్రాహ్మణుల పట్ల ద్వేషం రగిలించేందుకు సినిమా తీశారంటూ అభ్యంతరకరమైన సన్నివేశాలను, సంభాషణలను తొలగించి పునర్నిర్మించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.[6] కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం వారు సినిమాను నిషేధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సినిమా ప్రభావంతో కొన్ని పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. దాంతో పట్టణాల మున్సిపాలిటీలు సినిమా నిషేధించాలని ప్రయత్నాలు చేశాయి. అయితే వీటివల్ల సినిమా నిషేధం కానీ, ప్రదర్శనలకు ఆటంకం కానీ కాలేదు.

బ్రాహ్మణులకు సినిమాపై ఉన్న ఆగ్రహాన్ని పెంచుతూ సినిమా బృందం "పిలక బ్రాహ్మణులకు ఫ్రీ పాసులు" అంటూ కరపత్రాలు ప్రచురించారు. బి.నరసింహారావు అనే వ్యక్తి సినిమాను సమర్థిస్తూ రాశాడు. కొన్ని గ్రామాల్లో బ్రాహ్మణులు మంచినీటి చెరువుకు వెళ్ళి నీరు తెచ్చుకోనియ్యకపోవడంతో కలకలం రేగింది. జరిగిన వాదోపవాదాలు, వివాదాలు అన్నీ చివరకు చిత్రంపై ఆసక్తి పెంచేందుకే పనికి వచ్చి ఘన విజయం సాధించింది.[4]

థీమ్స్

మార్చు

మాలపిల్ల సినిమాలో హరిజనోద్ధరణ, హరిజనుల దేవాయల ప్రవేశం, అంటరానితనం నిర్మూలన వంటివి ప్రధానమైన థీమ్స్. సినిమాకు ఆధారమైన చలం నవల మాలపిల్లలో బ్రాహ్మణ యువకుడు, హరిజన బాలిక ప్రేమ, సమాజంలో వారికి ఎదురైన సమస్యలు మాత్రమే ఇతివృత్తం కాగా దర్శక, రచయితలు దీనికి హరిజనుల దేవాలయ ప్రవేశం, అంటరానితన నిర్మూలన, గాంధేయవాదం వంటి అంశాలపై కథాంశాన్ని విస్తరించారు. సినిమా చివరిలో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించిన తిరువాన్కూరు మహారాజు చర్యను ప్రశంసిస్తూ సంభాషణలు రాయించారు. మాలపిల్ల సినిమాను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు, సంస్కరణాభిలాషి అయిన కాశీనాథుని నాగేశ్వరరావుకు అంకితం ఇచ్చారు. సినిమా చిత్రీకరణ ప్రారంభించే సమయానికి ఆయన మరణించారు, ఆయన అంతిమయాత్రను చిత్రీకరించి సినిమాతో పాటుగా అనుబంధంగా విడుదల చేశారు.[4]

సంగీతం

మార్చు

1930ల్లో సంగీత భరితమైన సినిమాల పద్ధతిని అనుసరించి మాలపిల్ల సినిమాలో 17 పాటలు, 12 వరకూ పద్యాలు ఉంటాయి. సాంఘిక సమస్యలపై, ప్రణయ ఇతివృత్తంపై ప్రముఖ భావకవి బసవరాజు అప్పారావు అంతకుముందే రాయగా, ప్రజాదరణ పొందిన పలు గీతాలను సినిమా కోసం తీసుకున్నారు. "కొల్లాయి గట్టితేనేమి", "నల్లవాడేనే గొల్లవాడేనే", "ఆ మబ్బు ఈ మబ్బు" వంటివి ఆ పాటల్లో ఉన్నాయి. ఒక సందర్భానికి జయదేవుని అష్టపదుల నుంచి "సావిరహే తవ దీనా రాధా" గీతాన్ని తీసుకున్నారు. మిగిలిన సందర్భాలకు తాపీ ధర్మారావు నాయుడు రాశారు. ఈ సినిమాకి భీమవరపు నరసింహారావు సంగీత దర్శకత్వం వహించారు.[4]

పాటలు

మార్చు
  1. మనుజుల విభజన మేలా - రచన: బసవరాజు అప్పారావు
  2. లేరా లేరా నిదుర మానరా - రచన: బసవరాజు అప్పారావు
  3. కొల్లాయి కట్టితేయేమి మా గాంధి - రచన: బసవరాజు అప్పారావు
  4. ఏలా ఈ బ్రతుకేలా - రచన: బసవరాజు అప్పారావు
  5. నల్లవాడేనే గొల్లవాడేనే - రచన: బసవరాజు అప్పారావు
  6. వడుకు వడుకు (రాట్నం పాట) - రచన: బసవరాజు అప్పారావు
  7. జాతర సేతామురా దేవత - రచన: బసవరాజు అప్పారావు
  8. వేణు మనోహర గానము - రచన: బసవరాజు అప్పారావు
  9. ఆమబ్బు ఈమబ్బు ఆకాశ - రచన: బసవరాజు అప్పారావు
  10. సావిరహే తవదీనా - జయదేవ కవి
  11. మాలలు మాత్రం మనుజులు - రచన: తాపీ ధర్మారావు నాయుడు
  12. లేవు పేరునకెన్నియో మతము - రచన: తాపీ ధర్మారావు నాయుడు
  13. కూలీలందరు ఏకము కావలె - రచన: తాపీ ధర్మారావు నాయుడు
  14. జైజై మహాదేవా పాపపరిహారా - రచన: తాపీ ధర్మారావు నాయుడు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Naati 101 Chitralu, S. V. Rama Rao, Kinnera Publications, Hyderabad, 2006, pp.14.
  2. Nostalgia Mala Pilla (1938) at Cinegoer.com Archived 26 సెప్టెంబరు 2012 at the Wayback Machine
  3. "Nostalgia Mala Pilla (1938) at Cinegoer.com". cinegoer.com. Archived from the original on 26 సెప్టెంబరు 2012. Retrieved 4 ఆగస్టు 2017.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 వి., బాబూరావు (6 February 2008). "వివాదాలకు తెరతీసిన తొలి తెలుగు సినిమా మాలపిల్ల". నవ్య: 67 - 71. Archived from the original on 10 జూన్ 2017. Retrieved 13 June 2017.
  5. ఆంధ్రపత్రిక, విలేకరి (30 September 1938). "సంఘ సంస్కరణమా? సంఘ విద్వేషమా?". ఆంధ్రపత్రిక.
  6. ఆంధ్రపత్రిక, విలేకరి (30 September 1938). "నింద్యమైన భాగాలు తీసివేయాలి". ఆంధ్రపత్రిక.

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మాలపిల్ల&oldid=3835458" నుండి వెలికితీశారు