వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 07వ వారం

సుష్మాస్వరాజ్

భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది మరియు మిజోరాం గవర్నరుగా పనిచేశారు. 1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించిన సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు. 1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికైనారు.


(ఇంకా…)