సుష్మా స్వరాజ్ (ఫిబ్రవరి 14, 1952 - ఆగస్టు 6, 2019) భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది, మిజోరాం గవర్నరుగా పనిచేశారు.

సుష్మాస్వరాజ్
సుష్మాస్వరాజ్


విదేశీ వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
2014, మే 26 నుంచి
నియోజకవర్గం విదిషా లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-02-14)1952 ఫిబ్రవరి 14
అంబాలా కంటోన్మెంట్, హర్యానా
మరణం 2019 ఆగస్టు 6(2019-08-06) (వయసు 67)
ఢిల్లీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి స్వరాజ్ కౌశల్
సంతానం బన్సూరి స్వరాజ్[1]
నివాసం ఢిల్లీ
మే 26, 2014నాటికి

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించిన సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.

రాజకీయ జీవితం మార్చు

హర్యానా రాజకీయాలు

1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికైనారు.[2] 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరినారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్య, సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.

జాతీయ రాజకీయాలు

1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు.[3] అంతకు ముందు 1980, 1984, 1989లలో కర్నాల్ నుంచి పోటీచేసి పరాజయం పొందినారు. 1996లో ఈమె దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికైనారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. 1998లో 12వ లోక్‌సభకు మళ్ళీ రెండో పర్యాయం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి [4] ఎన్నికై వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్ళీ అదే శాఖను చేపట్టినారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబరులో సుష్మాస్వరాజ్‌ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్రమంత్రిమండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడానికి పంపబడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించిననూ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందుటతో డిసెంబరులో మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశీంచారు.

బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయుసమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన మహిళా నాయకురాలిని నియమించుటకై సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దించారు. దేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడినుంచి విజయం సాధించలేకపోవడంతో సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొంది. ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయిననూ [5] సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.

రాజ్యసభ సభ్యురాలిగా

2004 ఏప్రిల్లో సుష్మాస్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసింది. 2003 జనవరి నుంచి మే 2004 వరకు మరో రెండూ శాఖలు (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు) అదనంగా చేపట్టింది. 2006 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతోంది.

వ్యక్తిగత జీవితం మార్చు

1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహంచేసుకున్నది. వారి సంతానం ఒక కూతురు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నరుగా పనిచేశాడు. బరోడా బాంబు పేలుళ్ళ కేసులో జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదించి గెలిపించాడు.

పురస్కారాలు మార్చు

  1. పద్మ విభూషణ్ పురస్కారం - భారత ప్రభుత్వం, (పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2020), 2020 జనవరి 26[6][7][8]

మరణం మార్చు

2019, ఆగస్టు 6 మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో చికిత్సకోసం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (27 March 2023). "రాజకీయాల్లోకి సుష్మాస్వరాజ్ కుమార్తె...ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్‌గా బన్సూరి స్వరాజ్". Archived from the original on 27 March 2023. Retrieved 27 March 2023.
  2. http://archive.eci.gov.in/se2000/pollupd/ac/states/s07/Partycomp08.htm[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-27. Retrieved 2008-06-05.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-03-16. Retrieved 2008-06-05.
  5. http://www.eci.gov.in/electionanalysis/GE/PartyCompWinner/S10/partycomp05.htm[permanent dead link]
  6. సాక్షి, ఎడ్యూకేషన్ (25 January 2020). "పద్మ పురస్కారాలు-2020". Archived from the original on 10 ఫిబ్రవరి 2020. Retrieved 10 February 2020.
  7. నమస్తే తెలంగాణ, జాతీయం (25 January 2020). "141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం". Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.
  8. హెచ్ఎంటీవి, ఆంధ్రప్రదేశ్ (26 January 2020). "పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా". రాజ్. Archived from the original on 10 February 2020. Retrieved 10 February 2020.