వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 14వ వారం

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా అన్నది చారిత్రక కారణాలతో వెనుకబడివున్న భారతదేశ రాష్ట్రాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెలుసుబాట్లు కల్పించేందుకు ఏర్పరిచిన హోదా.  రాష్ట్రాలను ప్రత్యేక హోదా కల్పించడానికి ప్రణాళికా సంఘం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రప్రభుత్వంలోని మంత్రుల సలహా మేరకు ప్రధానమంత్రి అధ్యక్షతలోని జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) భౌగోళిక సమస్యలు, జనాభాపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా లోటుపాట్లు, వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో నెలకొనివుండడం వంటి కారణాల ప్రాతిపదికపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయాన్ని గ్రాంట్ల రూపంలోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వడం ద్వారానూ, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీలు, రుణాల చెల్లింపు వాయిదాలు వంటివి ఇవ్వడం ద్వారా వాటిని ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తుంది. 1969లో 5వ ప్రణాళికా సంఘం సూచనల మేరకు 3 రాష్ట్రాలకు హోదా కల్పిస్తూ ప్రత్యేక హోదా ప్రారంభం కాగా, 2010లో చివరగా చేరిన ఉత్తరాఖండ్‌తో కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉంది. ప్రత్యేక హోదా కల్పించమని బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తూండగా, 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని రాజ్యసభలోనూ, ప్రస్తుత ప్రధాని మోడీ ఎన్నికల సభలోనూ పేర్కొనడం, తర్వాత నిరాకరించడంతో ఆ అంశంపై రాజకీయంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

(ఇంకా…)