ప్రత్యేక హోదా అన్నది చారిత్రక కారణాలతో వెనుకబడివున్న రాష్ట్రాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెసులుబాట్లు కల్పించేందుకు ఏర్పరిచిన హోదా.[1] రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడానికి ప్రణాళికా సంఘం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రప్రభుత్వంలోని మంత్రుల సలహా మేరకు ప్రధానమంత్రి అధ్యక్షతలోని జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) భౌగోళిక సమస్యలు, జనాభాపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా లోటుపాట్లు, వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో నెలకొనివుండడం వంటి కారణాల ప్రాతిపదికపై నిర్ణయం తీసుకుంటుంది.[2] ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయాన్ని గ్రాంట్ల రూపంలోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వడం ద్వారానూ, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీలు, రుణాల చెల్లింపు వాయిదాలు వంటివి ఇవ్వడం ద్వారా వాటిని ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తుంది.[3]1969లో 5వ ప్రణాళికా సంఘం సూచనల మేరకు 3 రాష్ట్రాలకు హోదా కల్పిస్తూ ప్రత్యేక హోదా ప్రారంభం కాగా, 2010లో చివరగా చేరిన ఉత్తరాఖండ్‌తో కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉంది.[4][5] ప్రత్యేక హోదా కల్పించమని బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తూండగా, 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని రాజ్యసభలోనూ, ప్రస్తుత ప్రధాని మోడీ ఎన్నికల సభలోనూ పేర్కొనడం, తర్వాత నిరాకరించడంతో ఆ అంశంపై రాజకీయంగా ఆందోళనలు జరుగుతున్నాయి.[6]

2018 మార్చి నాటికి ప్రత్యేక హోదా కలిగివున్న భారతీయ రాష్ట్రాలు (ఆకుపచ్చ రంగులో)

చరిత్ర మార్చు

రాజ్యాంగంలో ఏ రాష్ట్రాన్నైనా ప్రత్యేక హోదాతో వర్గీకరించేందుకు ప్రత్యేకించి ఏ ఏర్పాట్లూ లేవు.[7] 1969లో 5వ ప్రణాళికా సంఘం సూచనలను అనుసరించి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రారంభించారు. మొదట రాజకీయంగా అనిశ్చితి, సరిహద్దుల్లో ఉండి, భౌగోళికంగానూ సమస్యలు ఎదుర్కొంటున్న అసోం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీరు రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా కల్పించారు. తర్వాతికాలంలో డిమాండ్లను అనుసరించి, అక్కడి పరిస్థితుల ఆధారంగానూ అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కల్పించారు. దీనితో ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు 11 ఉన్నాయి.

ప్రతిపాదనలు, డిమాండ్లు మార్చు

బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి, తెలంగాణ ఏర్పాటుచేసేప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విభజన తర్వాత 13 జిల్లాలతో ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా సహాయకరంగా ఉండేందుకు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు.ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు. ఈ వివాదం తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రయోజనాలు మార్చు

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా వెసులుబాట్లు, ప్రోత్సాహకాలు, పన్నురాయితీలు లభిస్తాయి.

  • ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పరిచేందుకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని బ్లాక్ గ్రాంట్ల రూపంలో అందిస్తుంది.[7]
  • గతంలో గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా మేరకు కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పంచాకానే మిగిలిన నిధులు ఇతర రాష్ట్రాలకు ఇచ్చేవారు.[7]ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు.
  • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పన్నుల విషయంలోనూ రాయితీలు వర్తిస్తాయి.[8]
  • పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడం, రుణాల చెల్లింపును వాయిదా వేసేందుకు నిర్ణయించడం వంటివి చేస్తారు.[8]

ప్రాతిపదికలు మార్చు

ప్రత్యేక హోదాపై నిర్ణయాన్ని ప్రధానమంత్రి ఆధ్వరంలోని జాతీయ అభివృద్ధి మండలి తీసుకుంటుంది. ఈ నిర్ణయంపై నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మండలి ప్రతిపాదనల ప్రభావం చూపుతాయి. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) ప్రత్యేక హోదాని రాష్ట్రాలకు కేటాయించేప్పుడు వివిధ ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం చేస్తారు, ఆయా ప్రాతిపదికలు ఇలా ఉన్నాయి:[8][7]

  • భౌగోళికాంశాలు: పర్వత ప్రాంతాలు, భౌగోళికంగా సంక్లిష్టమై రవాణా సౌకర్యాల విషయంలో ఇబ్బంది కలిగిన ప్రదేశాలు ఉండడం
  • జనాభాపరమైన అంశాలు: తక్కువ జనసాంద్రత లేక ఎక్కువ సంఖ్యలో గిరిజనులు ఉండడం
  • వెనుకబాటు
    • మౌలిక సదుపాయాలపరంగా వెనుకబాటు
    • అభివృద్ధి చెందే వీలున్నా ఆర్థికంగా వెనుకబాటు
    • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోలేకుండా ఉండడం
  • వ్యూహాత్మక స్థితి: విదేశాలతో సరిహద్దులు కలిగివుండి, వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగివుండడం

నోట్స్ మార్చు

మూలాలు మార్చు

  1. "Special Category Status and States". Civilsdaily. 2015-08-26. Archived from the original on 2018-03-25. Retrieved 2018-03-22.
  2. Ramani, Srinivasan (2016-08-06). "What is the special category status?". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-03-22.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-10. Retrieved 2018-03-22.
  4. Bhattacharjee, Sumit (2014-02-28). "'Special Category Status' is the new catch phrase". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-03-22.
  5. Anda, Nama. "List of Special Category Status States in India". :: GK Planet. Archived from the original on 2018-03-15. Retrieved 2018-03-22.
  6. K, Deepalakshmi (2016-08-02). "Special category status: The new buzz word in Andhra Pradesh". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-03-22.
  7. 7.0 7.1 7.2 7.3 శ్రీనివాసన్, రమణి (6 August 2016). "What is the special category status?". ద హిందూ (in ఆంగ్లం). Retrieved 14 March 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  8. 8.0 8.1 8.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ప్రత్యేక హోదా ఏమిటి బీబీసీ తెలుగు అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు