వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 49వ వారం

నిక్ వుజిసిక్
నికోలస్ జేమ్స్ వుజిసిక్ ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు. ఇతను ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టాడు. వారి కుటుంబం యుగోస్లేవియా నుండి సెర్బియన్ వలసదారులు. అతను రెండు కాళ్ళు, చేతులు లేకుండా టెట్రా అమీలియా అనే అరుదైన వ్యాధితో జన్మించాడు. అతని జీవిత చరిత్ర ప్రకారం అతను అరుదైన వ్యాధితో జన్మించినందున అతని తల్లి ఆ స్థితిలో అతనిని తీసుకోవడానికి, ఎత్తుకోవడానికి నిరాకరించింది. తరువాత అతని తల్లిదండ్రులు పరిస్థితులను అర్థం చేసుకొని అతనిని తీసుకోవడానికి అంగీకరించారు. ఆ పరిస్థితిని "వారి కొడుకు కోసం దేవుని ప్రణాళిక" గా వారు అర్థం చేసుకొన్నారు. ఇతను కాళ్ళు, చేతులు లేకపోయినా తండ్రి సాయంతో ఐదేళ్ల వయసులోనే ఈత నేర్చుకున్నాడు, అంతేకాకుండా సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు. బాల్యంలో తన తల్లి చేతుల్లో మామూలు పిల్లవాడిలాగేనే పెరిగిన తను సమాజంలో మామూలు వ్యక్తిగా ఎదగడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. నోటిలో పెన్ను పెట్టుకొని రాయడం నేర్చుకున్నాడు. గొంతు కింద గోల్ఫ్‌స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు. 2005లో "లైఫ్ వితౌట్ లింబ్స్‌" అనే లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాడు. 2007లో "ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్" అనే ప్రేరణనందించే ప్రసంగాలనిచ్చే కంపెనీని స్థాపించాడు.
(ఇంకా…)