వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 50వ వారం
విప్రనారాయణ 1954 డిసెంబరు 10వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. దీనిని భానుమతి మరియు రామకృష్ణారావులు భరణీ పిక్చర్స్ పతాకం క్రింద నిర్మించారు. ఈ సినిమాకు కీలకమైన మాటలు మరియు పాటలను సముద్రాల రాఘవాచార్య సమకూర్చారు. ఈ పూర్తి సంగీతభరితమైన చిత్రంలోని పాటల్ని ఎ.ఎమ్.రాజా మరియు భానుమతి గానం చేయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని కూర్చారు. ఇది పండ్రెండుమంది ఆళ్వారులలో ఒకడైన తొండరడిప్పొడి ఆళ్వారు జీవితచరిత్ర. ఇతడు విప్రనారాయణ అనే పేరుతో ప్రసిద్ధుడు. ఇతని చరిత్రను సారంగు తమ్మయ్యవైజయంతీ విలాసము అనే పేరుతో కావ్యంగా రచించాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. విప్రనారాయణ (అక్కినేని నాగేశ్వరరావు) శ్రీరంగని భక్తుడు. పరమ నిష్టాగరిష్టుడైన పూజారి. రంగనాథున్ని పూలదండలతో అలంకరించి, పూజించి తరించాలనే భక్తాగ్రగణ్యుడు. నర్తకి దేవదేవి (భానుమతీ రామకృష్ణ) అందించిన నమస్కారాన్ని అన్యమనస్కుడైన విప్రనారాయణుడు గమనించడు. దానితో ఆమెలోని అహంకారం పడగ విప్పి ఎలాగైనా అతడిని తన పాదదాసున్ని చేసుకొంటానని అక్క (సంధ్య) తో పందెం వేస్తుంది. భక్తినెపంతో ఏకాకినని చెప్పి విప్రనారాయణుని ఆశ్రయం సంపాదిస్తుంది. అందుకు విప్రనారాయణుని ప్రియ సచివుడు రంగరాజు (రేలంగి) అడ్డు తగిలినా లాభం లేకపోతుంది.
(ఇంకా…)