విప్రనారాయణ (1954 సినిమా)
విప్రనారాయణ 1954 డిసెంబరు 10వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. దీనిని భానుమతి, రామకృష్ణారావులు భరణీ పిక్చర్స్ పతాకం క్రింద నిర్మించారు. ఈ సినిమాకు కీలకమైన మాటలు, పాటలను సముద్రాల రాఘవాచార్య సమకూర్చారు.
విప్రనారాయణ (1954 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | పి.ఎస్.రామకృష్ణారావు |
నిర్మాణం | పి.ఎస్.రామకృష్ణారావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , పి.భానుమతి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
కూర్పు | పి.ఎస్.రామకృష్ణారావు |
నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ పూర్తి సంగీతభరితమైన చిత్రంలోని పాటల్ని ఎ.ఎమ్.రాజా, భానుమతి గానం చేయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని కూర్చారు.
సంక్షిప్త చిత్రకథ సవరించు
ఇది పన్నెండుమంది ఆళ్వారులలో ఒకడైన తొండరడిప్పొడి ఆళ్వారు జీవితచరిత్ర. ఇతడు విప్రనారాయణ అనే పేరుతో ప్రసిద్ధుడు. ఇతని చరిత్రను సారంగు తమ్మయ్య వైజయంతీ విలాసము అనే పేరుతో కావ్యంగా రచించాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు.[1]
విప్రనారాయణ (అక్కినేని నాగేశ్వరరావు) శ్రీరంగని భక్తుడు. పరమ నిష్టాగరిష్టుడైన పూజారి. రంగనాథున్ని పూలదండలతో అలంకరించి, పూజించి తరించాలనే భక్తాగ్రగణ్యుడు. నర్తకి దేవదేవి (భానుమతీ రామకృష్ణ) అందించిన నమస్కారాన్ని అన్యమనస్కుడైన విప్రనారాయణుడు గమనించడు. దానితో ఆమెలోని అహంకారం పడగ విప్పి ఎలాగైనా అతడిని తన పాదదాసున్ని చేసుకొంటానని అక్క (సంధ్య) తో పందెం వేస్తుంది. భక్తినెపంతో ఏకాకినని చెప్పి విప్రనారాయణుని ఆశ్రయం సంపాదిస్తుంది. అందుకు విప్రనారాయణుని ప్రియ సచివుడు రంగరాజు (రేలంగి) అడ్డు తగిలినా లాభం లేకపోతుంది.
దేవదేవి నెరజాణ, వేశ్య. నాట్యం, హొయలు, నయగారాలు, అమాయకంగా కళ్ళభాషతో కవ్వించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. విప్రనారాయణునిలో నెమ్మదిగా సంచలనం కలిగిస్తూ అక్కడ వున్న మూడో వ్యక్తి రంగరాజుకు ఉద్వాసన పలికిస్తుంది. ఆమె భక్తినుంచి రక్తిపైపు విప్రనారాయణుని మళ్ళిస్తుంది. అదను కోసం ఎదురుచూసిన దేవదేవికి అవకాశం రానే వస్తుంది. వర్షంలో తడిసి జ్వరంతో కాగిపోతున్న అతనికి సపర్యలు చేసే వంకతో దేవదేవి అతనిపై చేయివేస్తుంది. స్త్రీ స్పర్శ తొలిసారిగా అనుభవించిన ఆ పూజారి మెల్లగా ఆమెకు దాసుడవుతాడు. ఆమె లేనిదే క్షణం కూడా ఉండలేనివాడవుతాడు.
అప్పుడు శ్రీరంగనాథుడు తన భక్తుడికి ఐహిక బంధాల నుండి విముక్తి కలిగించే ఉద్దేశ్యంతో, ఆలయంలోని కాంచనపాత్రను అపహరించిన నేరం విప్రనారాయణునిపై పడేటట్లు చేస్తాడు. రాజసభలో విచారణ జరిగి అతనికి శిక్ష పడుతుంది. విప్రనారాయణుడు తాను భగవంతుడిని విస్మరించిన సంగతి గుర్తించి పశ్ఛాత్తాప పడతాడు. రాజభటులు విప్రనారాయణుని చేతులు నరకబోయే సమయంలో భగవంతుడు కలుగజేసుకుని అతన్ని రక్షిస్తాడు. తరువాత పతాక సన్నివేశంలో విప్రనారాయణుడిని, దేవదేవినీ తనలో ఐక్యం చేసుకుంటాడు.
పాత్రలు-పాత్రధారులు సవరించు
- విప్రనారాయణ - అక్కినేని నాగేశ్వరరావు
- దేవదేవి - భానుమతి
- రంగరాజు - రేలంగి వెంకట్రామయ్య
- దేవదేవి తల్లి - ఋష్యేంద్రమణి
- దేవదేవి అక్కయ్య - సంధ్య
- మహారాజు - వల్లభజోస్యుల శివరాం
- - అల్లు రామలింగయ్య
పాటలు సవరించు
- చూడుమదే చెలియా కనులా బృందావనిలో నందకిశోరుడు: అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి అభినయించిన ఈ పాటను సముద్రాల రాఘవాచార్య రచించగా ఎ. ఎం. రాజా పాడాడు. హిందోళరాగంలో కూర్చిన ఈ పాటలో నారీ నారీ నడుమ మురారి/హరికీ హరికీ నడుమ వయ్యారి/తానొకడైనా తలకొక రూపై అంటూ శ్రీకృష్ణుని శృంగార లీలా విలాసాన్ని అతి క్లుప్తంగా వివరించాడు రచయిత. ఈ సన్నివేశ సమయానికి విప్రనారాయణుడిలో ఇంకా శృంగారభావాలకు సంబంధించిన చిత్తచాంచల్యం మొదలు కాలేదు. దేవదేవిలో కూడా అతనికి శ్రీకృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు. ఈ భావాన్ని ప్రేక్షకుల మనస్సులలో నాటుకొనేలా దర్శకుడు భానుమతిని శ్రీకృష్ణుని గెటప్‌లో నారీ నారీ నడుమ మురారి చరణానికి ముందు చూపిస్తాడు.[2]
- ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా ఇందుకేనా:ఈ పాటను సముద్రాల రాఘవాచార్య రచించగా భానుమతి గానం చేసింది. భానుమతి, అక్కినేని నాగేశ్వరరావులపై ఈ పాటను చిత్రీకరించారు. కీరవాణి రాగంలో ఈ పాటను స్వరపరచాడు సంగీత దర్శకుడు[2].
- 'సావిరహే తవదీనా రాధా': ఈ పాటను భానుమతి ఆలపించగా అక్కినేని నాగేశ్వరరావు, భానుమతిలపై చిత్రీకరించారు. 12వ శతాబ్దానికి చెందిన జయదేవుడు రచించిన గీతగోవిందంలోని ఈ అష్టపదికి సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేశాడు. యమన్ కళ్యాణి రాగంలో ఈ పాటకు సంగీతం కూర్చబడింది[2].
- మధురమధురమీ చల్లని రేయీ మరువతగనిదీ:మోహనరాగంలో స్వరపరచబడిన ఈ పాట రికార్డింగులో హవాయిన్ గిటార్ అనే వాద్యపరికరాన్ని ఉపయోగించారు. ఈ పాటను ఎ. ఎం. రాజా, పి. భానుమతి పాడగా అక్కినేని నాగేశ్వరరావు, భానుమతిలపై చిత్రీకరించారు.[2]
- ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం - రేలంగి
- ఎవ్వాడే అతడెవ్వాడే కలలోన నను డాసినాడే ఓ భామా - పి. భానుమతి
- ఏలా నాపై దయచూపవు దేవా వేడుక చూసేవా - పి. భానుమతి
- కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా - ?
- ధిల్లానా - ?
- పాలించర రంగా పరిపాలించర రంగా కరుణాంతరంగ శ్రీరంగా - గానం: ఎ. ఎం. రాజా
- మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా - గానం: ఎ. ఎం. రాజా
- రంగా కావేటి రంగ శ్రీరంగ రంగా నా పైయిన్ బడె - ఎ. ఎం. రాజా
- రారా నా సామి రారా రారా దాపేల చేసేవు రా ఇటు రారా నా సామి - గానం: పి. భానుమతి
- అనురాగాలు దూరములాయెనా? - సముద్రాల; భానుమతి, ఎ. ఎం. రాజా
విశేషాలు సవరించు
- కాంచనమాల, కస్తూరి నరసింహారావు నటించగా ఇదే కథతో ఇదే పేరుతో 1937 లోనే ఓ చిత్రం వచ్చింది.
- 1954లో భరణీ పిక్చర్స్ సంస్థ ఒకే సంవత్సరంలో రెండు చిత్రాలు చక్రపాణి అనే సాంఘిక చిత్రాన్ని, విప్రనారాయణ అనే భక్తి చిత్రాన్ని నిర్మించి విడుదల చేసింది. రెండూ ఘన విజయాలు సాధించాయి. ఇది ఆ సంవత్సరం రికార్డు[3].
- ఈ సినిమా ఇదే పేరుతో తమిళభాషలోకి డబ్బింగ్ చేయబడి 1955లో విడుదలయ్యింది.
- 2012లో గోపీచంద్, నయనతారలతో జైబాలాజీ రియల్ మీడియా అధినేత తాండ్ర రమేష్, కొమర వెంకటేష్‌తో కలిసి మళ్ళీ నిర్మించాలని ప్రయత్నించాడు[4]. ఇదే సినిమాని తెలుగుతో బాటు హిందీభాషలో కూడా నిర్మించాలని ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చినట్టు లేదు.
స్పందన, ప్రాచుర్యం సవరించు
సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయవంతం అయింది. విమర్శకుల నుంచి కూడా సానుకూల స్పందన సంపాదించుకున్నది. ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఆనాటి సమీక్షలో పాటల సంఖ్య, అసహజమైన కొన్ని అంశాలను ప్రస్తావించి ఇన్ని లోపాలున్నప్పటికీ ఇది చక్కని చిత్రమని, ఒక స్థాయికి దిగకుండా తీసిన చిత్రమని కితాబిచ్చింది.[5] ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో గొప్ప సినిమాల్లో ఒకటిగా, తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే యుగంలో ముఖ్యమైన భాగంగా విమర్శకుల నుంచి గుర్తింపు పొందింది. అక్కినేని నాగేశ్వరరావు అత్యుత్తమ సినిమాగా చాలామంది దేవదాసును భావించినా "పాత్రకు వేరుగా నాగేశ్వరరావును చూడలేనంత"గా నటించిన కారణంగా అతని అత్యున్నత నటన భరణీ వారి విప్రనారాయణలోనే చూడవచ్చని సినీ విమర్శకుడు ఎం.వి.రమణారెడ్డి భావించాడు. భానుమతి గానం, సాలూరి రాజేశ్వరరావు సంగీతాల మేలు కలయికగా ఈ సినిమా గీతాలు రూపొందాయని అతను వ్యాఖ్యానించాడు.[6]
పురస్కారాలు సవరించు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1954) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా - ప్రశంసా పత్రం[7]
మూలాలు సవరించు
- ↑ చీమలమర్రి బృందావనరావు (1 May 2010). "నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం". ఈమాట. Retrieved 5 May 2018.
- ↑ 2.0 2.1 2.2 2.3 రాజా (16 January 2002). "ఆపాత(ట) మధురం - విప్రనారాయణ". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): 48–50.
- ↑ సుదర్శనాచార్య (5 January 1955). "1954లో తెలుగు సినిమాలు". ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక. No. సంపుటి 3, సంచిక 21. Retrieved 5 May 2018.[permanent dead link]
- ↑ విద్యాబాలన్-దీపికా-పదుకునెలతో-విప్రనారాయణ
- ↑ సంపాదకుడు (29 December 1954). "రసవంతమైన చిత్రం విప్రనారాయణ". ఆంధ్ర సచిత్రవార పత్రిక. 48 (18): 51–53. Archived from the original on 18 సెప్టెంబరు 2020. Retrieved 5 May 2018.
- ↑ రమణారెడ్డి, ఎం.వి. (2004). తెలుగు సినిమా స్వర్ణయుగం. ఎం.వి.రమణారెడ్డి. pp. 175, 176.
- ↑ "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 23 August 2011.