చందమామ
చందమామ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది. చందమామను బి.నాగిరెడ్డి - చక్రపాణి లు 1947 జూలైలో ప్రారంభించారు . కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం, ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 - 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి.
(ఇంకా…)