టంగుటూరి అంజయ్య
టంగుటూరి అంజయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రి. అతను 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. టి. అంజయ్యగా సుపరిచితుడైన టంగుటూరి అంజయ్య అలియాస్ రామకృష్ణారెడ్డి తాళ్ళ 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లా, భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. అంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తరువాత ఉన్నత విద్యాభాసం చేయలేదు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల (24 పైసలు) కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు. కాంగ్రెసు పార్టీ కి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభ కు ఎన్నికైనాడు. 1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రి గా నియమించింది. అతను మర్రి చెన్నారెడ్డి తరువాత 1980 అక్టోబరు 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించాడు.
(ఇంకా…)