వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 52వ వారం

మహా జనపదాలు

ప్రాచీన భారతదేశంలో సా.పూ ఆరు నుండి ఐదవ శతాబ్దం వరకు విలసిల్లిన 16 రాజ్యాలను మహాజనపదాలు అంటారు. వాటిలో రెండు గణతంత్రాలు కాగా, మిగతా వాటిలో రాచరికం ఉండేది. అంగుత్తార నికాయ వంటి పురాతన బౌద్ధ గ్రంథాలు పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల గురించి ప్రస్తావిస్తాయి. ఇవి భారతదేశంలో బౌద్ధమతం విస్తరించడానికి ముందు, భారత ఉపఖండంలో వాయవ్యంలోని గాంధార నుండి తూర్పున ఉన్న అంగ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు ఆవల ఉన్న ప్రాంతాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. సా.పూ 6 వ -5 వ శతాబ్దాలను భారతీయ ప్రారంభ చరిత్ర తొలినాళ్ళలో ఒక ప్రధానమైన మలుపుగా పరిగణిస్తారు; సింధు లోయ నాగరికత నశించిన తరువాత భారతదేశంలో మొట్టమొదటి పెద్ద నగరాల ఆవిర్భావం, అలాగే వేద కాలం నాటి సనాతన ధర్మాన్ని సవాలు చేసే శ్రమణ ఉద్యమాలు (బౌద్ధమతం, జైనమతాలతో సహా) పెరిగాయి. పురావస్తు పరంగా, ఈ కాలం నార్తరన్ బ్లాక్ పాలిష్ వేర్ సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది.
(ఇంకా…)