వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 17వ వారం

చౌరీ చౌరా సంఘటన

సహాయ నిరాకరణోద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922 ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్‌ లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12 న నిలిపేశారు. ప్రజాగ్రహాన్ని చూసి భయపడిన గాంధీ ఐదు రోజులు నిరాహార దీక్ష చేపట్టాడు. తాను ఎంచుకున్న అహింసా సిద్ధాంతాన్ని ప్రజలకు పూర్తిగా నేర్పించలేకపోయానని ఆయన అభిప్రాయపడ్డాడు. గాంధీజీ ఉద్యమం నిలిపివేసినపుడు జవహర్ లాల్ నెహ్రూతో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం దేశం ఏకమై బలం పుంజుకుంటున్న సమయంలో అది మంచిది కాదేమోనని అభిప్రాయపడ్డారు. గాంధీజీని కూడా అరెస్టు చేసి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కానీ ఆయన అనారోగ్యం దృష్ట్యా 1924 లో విడుదలయ్యాడు.

దీని పర్యవసానంగా బ్రిటిష్ అధికారులు సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో సైనిక శాసనాన్ని ప్రకటించారు. అనేక దాడులు చేసి సుమారు 228 మందిని అరెస్టు చేశారు. వీరిలో 6 మంది పోలీసు కస్టడీలోనే మరణించగా, దోషులుగా నిర్ధారించబడిన 172 మందికి ఉరిశిక్ష విధించారు. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భారత కమ్యూనిస్టు నాయకుడు ఈ తీర్పును చట్టబద్ధమైన హత్యగా అభివర్ణించాడు. ఆయన భారత కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చాడు. 1923 ఏప్రిల్ 20 న, అలహాబాద్ హైకోర్టు మరణ తీర్పులను సమీక్షించింది. 19 మందికి మరణశిక్షలను నిర్ధారించింది. 110 మందికి జీవిత ఖైదు విధించింది. మిగిలిన వారికి దీర్ఘకాలిక జైలు శిక్ష విధించింది. ఈ సంఘటనకు గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం చనిపోయిన పోలీసులకు 1923 లో స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఉరి తీసిన వారిని గౌరవించటానికి భారత ప్రభుత్వం తరువాత మరొక షాహీద్ స్మారక్ను నిర్మించింది. ఈ పొడవైన స్మారక చిహ్నంపై వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి. స్మారక చిహ్నం సమీపంలో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన లైబ్రరీ, మ్యూజియం ఏర్పాటు చేయబడింది. భారత రైల్వేలు ఒక రైలుకు చౌరి చౌరా ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు, ఇది గోరఖ్‌పూర్ నుండి కాన్పూర్ వరకు నడుస్తుంది.


(ఇంకా…)