వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 24వ వారం

హల్దీఘాటీ యుద్ధం

హల్దీఘాటీ యుద్ధం 1576 జూన్ 18న మహారాణా ప్రతాప్ నేతృత్వంలోని మేవార్ దళాలు, అంబర్ కు చెందిన మాన్ సింగ్ I నేతృత్వంలోని మొఘల్ దళాల మధ్య జరిగిన యుద్ధం. మొఘలులు మేవార్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కలిగించి యుద్ధంలో విజయం సాధించారు. రాణా ప్రతాప్‌ తోటి సైనికాధికారుల బలవంతంపై యుద్ధరంగం విడిచి వెళ్ళిపోయాడు. దాంతో మొగలు సైన్యం అతన్ని పట్టుకోలేకపోయింది. 1568లో చిత్తోర్‌గఢ్ ముట్టడితో మేవార్ రాజ్యం లోని సారవంతమైన తూర్పు బెల్ట్‌ను మొఘల్‌ల హస్తగతమైంది. అయితే, చెట్లతో కొండలతో కూడిన మిగతా రాజ్యం సిసోడియాల నియంత్రణ లోనే ఉండిపోయింది. మేవార్ గుండా గుజరాత్‌ వెళ్ళేందుకు ఒక సుస్థిరమైన మార్గం కావాలని అక్బరు భావించాడు. 1572లో ప్రతాప్ సింగ్ రాజుగా (రాణా) పట్టాభిషిక్తుడైనప్పుడు అక్బరు, ఈ ప్రాంతం లోని అనేక ఇతర రాజపుత్ర నాయకుల మాదిరిగానే రాణాను సామంతుడిగా మారమని కోరుతూ అనేక మంది రాయబారులను పంపాడు. అయితే, ప్రతాప్ అలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి నిరాకరించడంతో యుద్ధం అనివార్యమైంది. యుద్ధం జరిగిన ప్రదేశం రాజస్థాన్‌లోని గోగుండా సమీపంలోని హల్దీఘాటి వద్ద నున్న ఇరుకైన కనుమ మార్గం. ఇరు సైన్యాల సంఖ్యపై విభిన్న అభిప్రాయాలున్నప్పటికీ, మొఘలు సైన్యం మేవార్ సైన్యం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిర్ధారించారు. తొలుత మేవారీలది పైచేయిగా ఉన్నప్పటికీ, పరిస్థితి నెమ్మదిగా వారికి వ్యతిరేకంగా మారింది. రాణా ప్రతాప్ గాయపడ్డాడు. మొఘలులు యుద్ధంలో గెలిచినందున, ఝాలా మాన్ సింగ్ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు రక్షక వలయంగా ఉంటూ రాణా తప్పించుకునేందుకు సహకరించారు.
(ఇంకా…)