వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 06వ వారం
పిజ్జా |
---|
పిజ్జా ఇటలీలో పుట్టిన వంటకం. పులియబెట్టిన గోధుమ పిండిలో టొమాటోలు, చీజ్, అనేక ఇతర పదార్థాలను (వివిధ రకాల సాసేజ్‌లు, ఆంకోవీస్, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, ఆలివ్‌లు, కూరగాయలు, మాంసం, హామ్ వంటివి) వేసి దీన్ని తయారు చేస్తారు. సాంప్రదాయికంగా పుల్లల పొయ్యి ఓవెన్‌పై అధిక ఉష్ణోగ్రత వద్ద దీన్ని కాలుస్తారు. చిన్న సైజు పిజ్జాను పిజ్జెట్టా అని పిలవడం కద్దు. పిజ్జా తయారు చేసే వ్యక్తిని పిజ్జాయోలో అంటారు.
ఇటలీలో, రెస్టారెంట్లలో పిజ్జాను ముక్కలు చేయకుండా ఇస్తారు. దాన్ని కత్తి ఫోర్కులతో తింటారు. ఇళ్ళలోను, అంతగా ఫార్మాలిటీ లేని చోట్లా అయితే, ముక్కలు చేసుకుని చేతితో పట్టుకొని తింటారు.
పిజ్జా అనే పదం మొట్టమొదటగా 10వ శతాబ్దంలో ఇటలీ లోని కాంపానియా సరిహద్దులో ఉన్న లాజియోలో గేటా అనే పట్టణంలో లాటిన్ మాన్యుస్క్రిప్ట్‌లో నమోదైంది. ఆధునిక పిజ్జాను నేపుల్స్‌లో కనుగొన్నారు. ఈ వంటకం, దాని వివిధ రూపాలూ అనేక దేశాలలో ప్రజాదరణ పొందాయి. ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో ఒకటిగా మారింది. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఇదొక సాధారణ ఫాస్ట్ ఫుడ్ అంశంగా మారింది; పిజ్జేరియాలు (పిజ్జాలో ప్రత్యేకత కలిగిన రెస్టారెంట్లు), మధ్యధరా వంటకాలను అందించే రెస్టారెంట్లు, ఇంటికే తెచ్చి ఇవ్వడం ద్వారా, వీధి ఆహారంగా కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. వివిధ ఆహార సంస్థలు రెడీ-బేక్డ్ పిజ్జాలను విక్రయిస్తాయి, వీటిని ఇంట్లోనే ఓవెన్‌లో తిరిగి వేడి చేసుకుని తినవచ్చు.
|