పిజ్జా ఇటలీలో పుట్టిన వంటకం. పులియబెట్టిన గోధుమ పిండిలో టొమాటోలు, చీజ్, అనేక ఇతర పదార్థాలను (వివిధ రకాల సాసేజ్‌లు, ఆంకోవీస్, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, ఆలివ్‌లు, కూరగాయలు, మాంసం, హామ్ వంటివి) వేసి దీన్ని తయారు చేస్తారు. సాంప్రదాయికంగా పుల్లల పొయ్యి ఓవెన్‌పై అధిక ఉష్ణోగ్రత వద్ద దీన్ని కాలుస్తారు. చిన్న సైజు పిజ్జాను పిజ్జెట్టా అని పిలవడం కద్దు. పిజ్జా తయారు చేసే వ్యక్తిని పిజ్జాయోలో అంటారు.

పిజ్జా
పిజ్జా మార్గరీటా. ఇది నియాపోలిటన్ పిజ్జాకు ప్రధాన రూపం.
రకంఫ్లాట్‌బ్రెడ్
CourseLunch or dinner
మూల స్థానంఇటలీ
ప్రాంతం లేదా రాష్ట్రంకాంపానియా (నేపుల్స్)
Serving temperatureవేడిగా గాని, నులివెచ్చగా గానీ
మూల పదార్థాలుపిండి, సాస్ (సాధారణంగా టొమాటో సాస్), చీజ్
Variationsకాల్జోన్, పాంజెరోట్టి, స్ట్రోంబోలి
Cookbook:పిజ్జా  పిజ్జా

ఇటలీలో, రెస్టారెంట్లలో పిజ్జాను ముక్కలు చేయకుండా ఇస్తారు. దాన్ని కత్తి ఫోర్కులతో తింటారు. [1] [2] ఇళ్ళలోను, అంతగా ఫార్మాలిటీ లేని చోట్లా అయితే, ముక్కలు చేసుకుని చేతితో పట్టుకొని తింటారు.

పిజ్జా అనే పదం మొట్టమొదటగా 10వ శతాబ్దంలో ఇటలీ లోని కాంపానియా సరిహద్దులో ఉన్న లాజియోలో గేటా అనే పట్టణంలో లాటిన్ మాన్యుస్క్రిప్ట్‌లో నమోదైంది. [3] ఆధునిక పిజ్జాను నేపుల్స్‌లో కనుగొన్నారు. ఈ వంటకం, దాని వివిధ రూపాలూ అనేక దేశాలలో ప్రజాదరణ పొందాయి. [4] ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో ఒకటిగా మారింది. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఇదొక సాధారణ ఫాస్ట్ ఫుడ్ అంశంగా మారింది; పిజ్జేరియాలు (పిజ్జాలో ప్రత్యేకత కలిగిన రెస్టారెంట్లు), మధ్యధరా వంటకాలను అందించే రెస్టారెంట్లు, ఇంటికే తెచ్చి ఇవ్వడం ద్వారా, వీధి ఆహారంగా కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. [4] వివిధ ఆహార సంస్థలు రెడీ-బేక్డ్ పిజ్జాలను విక్రయిస్తాయి, వీటిని ఇంట్లోనే ఓవెన్‌లో తిరిగి వేడి చేసుకుని తినవచ్చు.

తయారీ

మార్చు

పిజ్జా తాజాగా గానీ, బాగా చల్లబరచి గానీ, మొత్తంగా గానీ, లేదా చిన్న ముక్కలుగా గానీ విక్రయిస్తారు. సాస్‌, పిండి కలవనీయకుండా నిరోధించడం, గట్టిగా మారకుండా శీతలీకరించి, మళ్లీ వేడి చేసుకోగల క్రస్ట్‌ను ఉత్పత్తి చేయడం వంటి సవాళ్లను అధిగమించడానికి కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టారు.

పిజ్జాల మరొక రూపం టేక్ అండ్ బేక్ పిజ్జేరియాలు. ఇలాంటి పిజ్జా దుకాణాల్లో పిజ్జా పిండిని కలిపి పచ్చిగా ఇస్తారు. కస్టమర్లు వాటిని కొనుక్కుని తమ స్వంత ఓవెన్‌లలో కాల్చుకుని తింటారు. కొన్ని కిరాణా దుకాణాల్లో తాజా పిండి, సాస్, తదితర ప్రాథమిక పదార్థాలను అమ్ముతారు. వీటిని కొనుక్కుని ఇంట్లోనే పిండి కలుపుకుని పిజ్జాను తయారు చేసుకోవచ్చు.

రెస్టారెంట్లలో, పిజ్జాను మంటపై ఇటుకలు పెట్టి దానిపై కాల్చడం గానీ, ఎలక్ట్రిక్ ఓవెన్ గానీ, కన్వేయర్ బెల్ట్ ఓవెన్ మీద గానీ, సాంప్రదాయ శైలిలో చెక్క లేదా బొగ్గును వాడే ఇటుక ఓవెన్‌పై గానీ తయారు చేస్తారు. పిజ్జాను పొడవాటి తెడ్డు మీదుగా బట్టీ లోకి జారుస్తారు. ఈ తెడ్డును పీల్ అని అంటారు. నేరుగా వేడి ఇటుకలపై గానీ, స్టీలు లేదా అల్యూమినియం చిల్లుల గరిటెపై గానీ, ఓవెన్ ఉపరితలంపై గానీ కాలుస్తారు. తెడ్డుపై పిజ్జా సులభంగా జారేందుకు గాను తెడ్డుపై మొక్కజొన్నను పూస్తారు (నూనె పూసినట్లుగా). ఇంట్లో తయారుచేసేటప్పుడు, ఇటుక బట్టీలో వచ్చేంతటి వేడి ప్రభావాన్ని కలిగించేందుకు ఇంట్లోని ఓవెన్‌లో పిజ్జా రాయి పెట్టి దానిపై పిజ్జాను కాల్చవచ్చు. లోహపు పళ్ళెంపై పెట్టి పిజ్జాను కాలిస్తే, వేడి చాలా వేగంగా వెళ్ళి పిజ్జా పైపెచ్చు మాడిపోతుంది. [5] కొంతమంది, ఇళ్ళలో కూడా కర్రల పొయ్యిని ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా ఆరుబయట ఏర్పాటు చేస్తారు. రెస్టారెంట్లలో లాగానే, ఇవి కూడా కుంభాకారంలో ఉంటాయి. వేడి సమంగా వ్యాపించేందుకు శతాబ్దాలుగా పిజ్జా ఓవెన్‌లను ఈ ఆకారం లోనే తయారుచేస్తూ ఉన్నారు. [6] మరొక రకం ఏమిటంటే, గ్రిల్‌పై కాల్చిన పిజ్జా. దీనిలో పిజ్జాను నేరుగా బార్బెక్యూ గ్రిల్‌పై కాలుస్తారు. గ్రీక్ పిజ్జా, డీప్ డిష్ చికాగో, సిసిలియన్ స్టైల్ పిజ్జా లను నేరుగా పిజ్జా ఓవెన్‌లోని ఇటుకలపై కాకుండా పాన్‌లలో కాలుస్తారు. చాలా రెస్టారెంట్లలో పిజ్జాలను తయారు చేయడానికి వాడే టేబుళ్ళు ప్రామాణికమైనవి, ప్రత్యేకంగా తయారుచేయించుకున్నవీ కూడా ఉంటాయి. పిజ్జా చెయిన్ స్టోర్లలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసే ప్రక్రియను పూర్తిగా ఆటోమాటిగ్గా చేస్తారు.

క్రస్ట్

మార్చు
 
కారామెలైజ్డ్ క్రస్ట్ - దాని కార్నిసియోన్ (బయటి అంచు) - న్యూయార్క్ తరహా పిజ్జా ముక్కలు

పిజ్జా లోని దిగువ భాగాన్ని "క్రస్ట్" అంటారు. ఇది వివిధ రకాలుగా ఉండవచ్చు. చేతితో ఎగరేస్తూ చేసే నియాపోలిటన్ పిజ్జా లాగా సన్నగాను, లేదా డీప్ డిష్ చికాగో పిజ్జా వలె మందంగానూ ఉండవచ్చు. సాంప్రదాయకంగా ఇది సాదాగా ఉంటుంది. కానీ రుచికోసం వెల్లుల్లి లేదా మూలికలు వెయ్యవచ్చు. చీజ్‌తోనూ నింప వచ్చు. పిజ్జా బయటి అంచుని కొన్నిసార్లు కార్నిసియోన్ అని పిలుస్తారు. కొన్ని పిజ్జాల పిండిలో చక్కెర ఉంటుంది. అది ఈస్ట్ పెరగడానికి, క్రస్ట్ బ్రౌనింగ్‌ మెరుగుపడడానికీ దోహద పడుతుంది.

అమెరికన్ పిజ్జా చైన్ పాపా జాన్స్ పిజ్జా, 1984లో పిజ్జా కోసం ప్రత్యేకంగా డిప్పింగ్ సాస్‌ను కనిపెట్టింది. అప్పటి నుండి పిజ్జా తినేటపుడు, ముఖ్యంగా క్రస్ట్ తినేటప్పుడు కొందరు ఈ సాస్‌లో ముంచుకుని తింటారు. [7]

 
లండన్‌లో ఒక పిజ్జా క్వాట్రో ఫార్మాగీ ("నాలుగు చీజ్‌లు").

సాధారణంగా పిజ్జాలో నేపుల్స్ పరిసరాలలో ఉత్పత్తి అయ్యే గేదె మోజారెల్లాతో తయారయ్యే మోజారెల్లా చీజ్ వాడతారు. [8] ఇతర చీజ్‌లను కూడా ఉపయోగిస్తారు. ప్రత్యేకించి ఇటాలియన్ చీజ్‌లలో ప్రోవోలోన్, పెకోరినో రొమానో, రికోటా, స్కామోర్జా ఉన్నాయి. బ్రౌనింగ్, మెల్టింగ్, స్ట్రెచినెస్, స్థిరమైన కొవ్వు, తేమ కంటెంట్, స్థిరమైన షెల్ఫ్ లైఫ్ వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో ఖరీదు తక్కువగా ఉండే చీజ్‌లను ఉత్పత్తి చేసారు. ఖరీదు తక్కువగా ఉండే మంచి పిజ్జా చీజ్‌ను రూపొందించాలనే ఈ అన్వేషణలో వివిధ పదార్థాలతో ప్రయోగాలు జరుగుతున్నాయి.

రకాలు, శైలులు

మార్చు

పిజ్జాల్లో అనేక రకాలు ఉన్నాయి. టాపింగ్స్‌ను బట్టి, క్రస్ట్‌ను బట్టి వీటిని నిర్వచించవచ్చు. పిజ్జా తయారీలో కూడా అనేక శైలులు ఉన్నాయి. ఆ రకాల్లో కొన్నిటిని కింది జాబితాల్లో చూడవచ్చు.

రకాలు

మార్చు
పిజ్జా రకాలు
చిత్రం పేరు లక్షణ పదార్థాలు మూలం మొదట ధృవీకరించబడింది గమనికలు
  పిజ్జా కాప్రిసియోసా హామ్, పుట్టగొడుగులు, ఆర్టిచోక్, గుడ్డు ఇటలీ Pizza quattro stagioni లాగా ఉంటుంది, కానీ టాపింగ్స్‌ విడిగా ఉండకూడదు, కలిపెయ్యాలి.
  క్లామ్ పై క్లామ్స్ న్యూ ఇంగ్లాండ్ 1950లు కలోనియల్ కాలం నుండి న్యూ ఇంగ్లాండ్‌లో అందించబడిన కవర్ పై పిజ్జా వెర్షన్.
  హవాయి పిజ్జా పైనాపిల్, హామ్ లేదా బేకన్ కెనడా 1962 ప్రముఖంగా వివాదాస్పదమైంది.
  పిజ్జా మార్గరీటా టమోటాలు, మోజారెల్లా, తులసి నేపుల్స్, ఇటలీ 1800లు ఆర్కిటిపికల్ నియాపోలిటన్ పిజ్జా .
  పిజ్జా మరీనారా టొమాటో సాస్, ఆలివ్ ఆయిల్, ఒరేగానో, వెల్లుల్లి. చీజ్ ఉండదు. నేపుల్స్, ఇటలీ 1734 పురాతన నియాపోలిటన్ పిజ్జాల్లో ఒకటి.
  పిజ్జా పగ్లీస్ టమోటా, ఉల్లిపాయ, మోజారెల్లా అపులియా, ఇటలీ
  పిజ్జా క్వాట్రో ఫార్మాగీ నాలుగు రకాల చీజ్: మొజారెల్లా, గోర్గోంజోలా. ప్రాంతాన్ని బట్టి మరో రెండు లాజియో, ఇటలీ 1700లు
  పిజ్జా క్వాట్రో స్టాజియోని ఆర్టిచోక్, పుట్టగొడుగు, హామ్, టమోటాలు ఇటలీ ఋతువులను సూచిస్తూ మూణ్ణెల్ల కోసారి టాపింగ్స్ మారుస్తారు.
  సీఫుడ్ పిజ్జా చేపలు, షెల్ఫిష్ లేదా స్క్విడ్ వంటివి ఉప రకాల్లో పిజ్జా ఫ్రూటీ డి మేర్ (చీజ్ ఉండదు). పిజ్జా పెస్కాటోర్ (మస్సెల్స్ లేదా స్క్విడ్‌తో) ఉన్నాయి.

శైలులు

మార్చు
పిజ్జా శైలులు
చిత్రం పేరు లక్షణాలు మూలం మొదట ధృవీకరించబడింది
  కాల్జోన్ పిజ్జాను సగానికి మడుస్తారు. నేపుల్స్, ఇటలీ 1700లు
  చికాగో తరహా పిజ్జా మందపాటి టాపింగ్స్ పొర కలిగి, పాన్లో కాలుస్తారు. క్రస్ట్‌ను కొన్నిసార్లు చీజ్ లేదా ఇతర పదార్ధాలతో నింపుతారు. చికాగో, USA సి. 1940లు
  బాగా వేయించిన పిజ్జా పిజ్జాను కాల్చడానికి బదులు డీప్-ఫ్రై చేస్తారు (నూనెలో వేయిస్తారు). స్కాట్లాండ్, ఇటలీ
  డెట్రాయిట్ తరహా పిజ్జా లోతైన క్రస్ట్, దీర్ఘచతురస్రాకార ఉక్కు ట్రేలలో కాల్చినది (వాస్తవానికి ఆటోమోటివ్ డ్రిప్ ప్యాన్లు). డెట్రాయిట్, USA 1946
  అమ్మమ్మ పిజ్జా సన్నని, చతురస్రంగా ఉండే, షీట్ పాన్‌లో కాల్చినది, "ఇటాలియన్ గృహిణులు ఇంట్లోనే పిజ్జా ఓవెన్ లేకుండా వండిన పిజ్జాలను గుర్తుకు తెస్తుంది". [9] లాంగ్ ఐలాండ్, USA 1900ల ప్రారంభంలో
  గ్రీక్ పిజ్జా ఆరబెట్టిన పిండిని లోతు లేని పాన్‌లో కాలుస్తారు; క్రస్ట్ పల్చగా,ఫోకాసియాను పోలి ఉంటుంది. కనెక్టికట్, USA 1955
  ఇటాలియన్ టమోటా పై మందపాటి పిండిపై టొమాటో పేస్ట్‌ కప్పి తయారు చేస్తారు; సిసిలియన్ పిజ్జాలో ఇదొక రకం. దీన్నే పిజ్జా స్ట్రిప్స్ (చిత్రంలో ఉన్నట్లుగా కత్తిరించినప్పుడు) అని, గ్రేవీ పై, చర్చి పై, రెడ్ బ్రెడ్, పార్టీ పిజ్జా అనీ కూడా అంటారు. USA 1900ల ప్రారంభంలో
  జంబో ముక్క చాలా పెద్ద పిజ్జా ముక్క. దీన్ని వీధి ఆహారంగా అమ్ముతారు. న్యూయార్క్, వాషింగ్టన్ DC, USA 1981
  న్యూయార్క్ తరహాలో నియాపోలిటన్ నుండి పుట్టిన పిజ్జా. సన్నగా, మడతపెట్టగల క్రస్ట్‌తో ఉంటుంది. న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతం (ఆ పైన) 1900ల ప్రారంభంలో
  పిజ్జెట్టా చిన్న పిజ్జా. హార్స్ డి ఓయూవ్రే లేదా చిరుతిండిగా తింటారు

పిజ్జా వ్యాపారం

మార్చు

2017 లో మొత్తం ప్రపంచ పిజ్జా మార్కెటు 12,800 కోట్ల డాలర్లుండగా, ఒక్క అమెరికా లోనే ఇది 4,400 కోట్ల డాలర్లుంది. అమెరికాలో 76,000 పిజ్జేరియాలున్నాయి.[10] మొత్తమ్మీద, అమెరికా జనాభాలో 2 సంవత్సరాలు పైబడిన వారిలో 13% మంది రోజుకు ఒక్కసారైనా పిజ్జా తిన్నారు. [11]

1995 లో డామినోస్ పిజ్జా రాకతో భారతదేశం లోకి పిజ్జా ప్రవేశించింది.[12] 1998 లో దేశంలో రోజుకు 12,000 పిజ్జాలు అమ్ముడవగా, 1999 లో ఇది 30,000 కు, 2000 లో 50,000 కూ పెరిగింది. [13] 2019 లో భారతదేశంలో పిజ్జా వ్యాపారం 150 కోట్ల డాలర్లను దాటింది. [12] పిజ్జా చెయిన్లతో పాటు స్థానికంగా ఉండే పిజ్జా దుకాణాలు కూడా ఉంటాయి.

రికార్డులు

మార్చు

గిన్నెస్ ప్రపంచ రికార్డుల ప్రకారం 2021 నాటికి:

  • ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా 2012 డిసెంబరులో రోమ్‌లో తయారు చేసారు. దాని వైశాల్యం 1,261 చ.మీ. మొదటి రోమన్ చక్రవర్తి ఆక్టేవియన్ అగస్టస్‌కు నివాళిగా ఆ పిజ్జాకు "ఒట్టావియా" అని పేరు పెట్టారు. గ్లూటెన్ రహిత బేస్‌తో దాన్ని తయారు చేసారు. [14]
  • ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిజ్జా 1,930 మీ. పొడవు ఉంది. దీన్ని 2017లో కాలిఫోర్నియాలోని ఫోంటానాలో తయారు చేసారు. [15]
  • గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాణిజ్యపరంగా లభించే పిజ్జా ధర US$2,700. 2017 ఏప్రిల్ 24 న దీన్ని న్యూయార్క్ లోని ఇండస్ట్రీ కిచెన్ (USA)లో విక్రయించారు. [16]
  • స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలోని హగ్గిస్ రెస్టారెంట్‌లోని GB£ 4,200 విలువైన "పిజ్జా రాయల్ 007" వంటి మరింత ఖరీదైన పిజ్జాలు తయారు చేసారు గానీ వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లు గుర్తించలేదు. ఇది కేవియర్, ఎండ్రకాయలు 24-క్యారెట్ బంగారు ధూళితో ఖరీదులో అగ్రస్థానంలో ఉంది. [17]
  • రెస్టారెంట్ డొమెనికో క్రోల్లా తయారు చేసిన పిజ్జా, ఇందులో సన్‌బ్లష్-టమోటో సాస్, స్కాటిష్ స్మోక్డ్ సాల్మన్, మెడల్లియన్స్ ఆఫ్ వెనిసన్, ఎడిబుల్ గోల్డ్, కాగ్నాక్‌లో మెరినేట్ చేసిన ఎండ్రకాయలు, షాంపైన్‌లో నానబెట్టిన కేవియర్ వంటి టాపింగ్స్ ఉన్నాయి. 2007లో స్వచ్ఛంద సంస్థ కోసం ఈ పిజ్జాను వేలం వేయగా, GB£ 2,150 ధర పలికింది. [18]

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. Naylor, Tony (6 September 2019). "How to eat: Neapolitan-style pizza". The Guardian. London. Archived from the original on 14 September 2019. Retrieved 20 September 2019.
  2. Godoy, Maria (13 January 2014). "Italians To New Yorkers: 'Forkgate' Scandal? Fuhggedaboutit". National Public Radio. Archived from the original on 20 September 2019. Retrieved 20 September 2019.
  3. Maiden, Martin. "Linguistic Wonders Series: Pizza is a German(ic) Word". yourDictionary.com. Archived from the original on 2003-01-15.
  4. 4.0 4.1 Miller, Hanna (April–May 2006). "American Pie". American Heritage. Archived from the original on 3 February 2012. Retrieved 4 May 2012.
  5. Chen, Angus (23 July 2018). "Pizza Physics: Why Brick Ovens Bake The Perfect Italian-Style Pie". NPR. Archived from the original on 24 July 2018. Retrieved 25 July 2018.
  6. "pizza oven kits". Californo. Archived from the original on 2018-04-26. Retrieved 2018-04-23.
  7. Shrikant, Adit (2017-07-27). "How Dipping Sauce for Pizza Became Oddly Necessary". Eater. Vox Media. Archived from the original on 27 July 2017. Retrieved 28 July 2017.
  8. Anderson, Sam (October 11, 2012). "Go Ahead, Milk My Day". The New York Times. Archived from the original on July 17, 2014. Retrieved November 7, 2014.
  9. Rosengarten, David (August 15, 2013). "Za-Za-Zoom: The 'Grandma Pizza' Forges Ahead In New York". Forbes. Archived from the original on August 17, 2013. Retrieved March 6, 2019.
  10. Hynum, Rick. "Pizza Power 2017 – A State of the Industry Report". PMQ Pizza Magazine. Archived from the original on 29 July 2017. Retrieved 28 July 2017.
  11. Rhodes, Donna; et al. (February 2014). "Consumption of Pizza" (PDF). Food Surveys Research Group Dietary Data Brief No. 11. USDA. Archived (PDF) from the original on 30 September 2017. Retrieved 27 September 2017.
  12. 12.0 12.1 Geeter, Darren (2020-04-28). "How Domino's beat Papa John's and Pizza Hut in India's pizza war". CNBC (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-25. Retrieved 2022-06-25.
  13. September 18, Ninad D. Sheth; September 18, 2000 ISSUE DATE:; December 7, 2000UPDATED:; Ist, 2012 15:35. "Pizza grows into Rs 150-crore business in India, doubles every two years". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-25. Retrieved 2022-06-25. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  14. "Largest pizza". Guinness World Records. Archived from the original on 2017-02-07. Retrieved 2016-11-17.
  15. "Longest pizza". Guinness World Records. Archived from the original on 19 October 2018. Retrieved 13 October 2018.
  16. "Most expensive pizza commercially available". Guinness World Records. Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  17. Shaw, Bryan (March 11, 2010). "Top Five Most Expensive Pizzas in The World". Haute Living. Archived from the original on 10 September 2014. Retrieved 9 September 2014.
  18. "Chef cooks £2,000 Valentine pizza". BBC News. 2007-02-14. Archived from the original on 2013-06-01. Retrieved 2012-07-07.
"https://te.wikipedia.org/w/index.php?title=పిజ్జా&oldid=3661672" నుండి వెలికితీశారు