వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 23వ వారం

తూర్పు చాళుక్యులు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని సా.శ 7 - 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వారికి వీరికి వేంగి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. వీరు ఈ ప్రాంతాన్ని సా.శ. 1130 వరకూ పాలించారు. సా.శ 1189 వరకు వారు ఈ ప్రాంతాన్ని చోళుల సామంతులుగా పాలించారు. రాజధాని వేంగి నగరాన్ని కొంతకాలం పరిపాలించిన తరువాత రాజమహేంద్రవరానికి (ఆధునిక రాజమండ్రి ) తరలించారు. వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న వేంగీ దేశంపై నియంత్రణ కోసం బలవంతులైన చోళులకు పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వేంగిలో ఐదు శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్య పాలన వలన ఈ ప్రాంతం మొత్తాన్నీ ఏకీకృతం చేయడమే కాకుండా, వారి పాలన యొక్క తరువాతి భాగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, కళలు అభివృద్ధి చెందాయి. తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించాడు.
(ఇంకా…)