తూర్పు చాళుక్యులు
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని 7 - 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వారికి వీరిని వేంగి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. ఈ ప్రాంతాన్నిసా.శ. 1130 వరకూ పాలించారు. సా.శ 1189 వరకు వారు ఈ ప్రాంతాన్ని చోళుల సామంతులుగా పాలించారు.
నిజానికి, తూర్పు చాళుక్యులు రాజధాని వేంగి నగరం (ఆధునిక పెదవేగి, ఏలూరు వద్ద ఉంది). తరువాత దీనిని రాజమహేంద్రవరానికి (ఆధునిక రాజమండ్రి ) తరలించారు. వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న వేంగీ దేశంపై నియంత్రణ కోసం బలవంతులైన చోళులకు పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వేంగిలో ఐదు శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్య పాలన వలన ఈ ప్రాంతం మొత్తాన్నీ ఏకీకృతం చేయడమే కాకుండా, వారి పాలన యొక్క తరువాతి భాగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, కళలు అభివృద్ధి చెందాయి. [1]
తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించాడు.
తూర్పు చాళుక్యుల రాజ్య అవతరణ సవరించు
ప్రసిద్ధి గాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేసి (సా.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని (ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) సా.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినుని ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేసి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని అక్కడ తన ప్రతినిధిగా నియమించాడు. రెండవ పులకేసి మరణించాక ఈ ప్రాంతం యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఒక స్వతంత్ర వేంగి సామ్రాజ్యంగా పరిణితి చెందింది. సా.శ.641-705 మధ్య తూర్పు చాళుక్య పరిపాలనలో మొదటి జయసింహ, మంగి యువరాజు తప్పితే మిగతా రాజుల పరిపాలన కాలం చాల తక్కువగా ఉంది. తరువాతి కాలంలో కుటుంబ కలహాల వల్ల పరిపాలన మరింత క్షీణించింది. అప్పుడు రాష్ట్రకూటులు, బాదామి చాళుక్యులు వేంగి సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. మూడవ గుణగ విజయాదిత్యుని పాలనలో అప్పటి రాష్ట్రకూట రాజు అమోఘవర్షునితో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మూడవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులకు సామంత రాజుగా ఉన్నాడు. అమోఘవర్షుడు మరణించిన తరువాత మూడవ విజయాదిత్యుడు తిరిగి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నాడు. తూర్పు చాళుక్యులు అగ్నివేస్య, కౌండిన్య, కౌశిక, గౌతమ, పరాశర, భరద్వాజ, వత్స, శాండిల్య, సంకృతి, హరిత గోత్రములకు చెందినవారని పలువురి అభిప్రాయం. తణుకు తాలూకా జుత్తిగ గ్రామంలో గల సోమేశ్వరుని ఆలయంలో లభించిన శిలాశాసనాలు (A. R. No. 748 of 1920.), (A. R. No. 746 of 1920.), తూర్పు గోదావరి జిల్లాలోని ఆడ్డతీగల తాలూకా డి-భీమవరంలో భీమేశ్వర ఆలయంలోని లభించిన శిలాశాసనం (A. R. No. 337 of 1919.) బట్టి తూర్పు చాళుక్యులు చంద్రవంశానికి చెందినవారని తెలుస్తున్నది.
పరిపాలనా యంత్రాంగం సవరించు
తూర్పు చాళుక్యుల పరిపాలన ప్రారంభంలో వారి రాజ్యసభ బాదామి గణతంత్ర రాజ్య సభగా ఉండేది. తరువాతి కాలంలో రాజ్యంలో సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యగలిగారు. వీరు ప్రక్క రాజులైన చోళులు, రాష్ట్రకూటులు, పల్లవులు, కళ్యాణి చాళుక్యులతోను మిత్రత్వం ఉన్నా శత్రుత్వం ఉన్నా సఖ్యతగా మెలిగేవారు. తూర్పు చాళుక్య పరిపాలన యంత్రాంగం హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సప్తాంగాలతో, పద్దెనిమిది శాఖలతో ఉండేది.
- మంత్రి
- పురోహితుడు
- సేనాపతి
- యువరాజు
- ద్వారపాలిక
- ప్రధాని
- అధ్యక్ష (విభాగానికి అధ్యక్షుడు) మొదలైనవి .
పరిపాలన ఏవిధంగా జరిగిందని వివరించడానికి ఆధారాలు లేవు. లభించిన ఆధారాల ప్రకారం విషయం, కొట్టం అనే రెండు ఉపవిభాగాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కమ్మకొట్టం లేదా కమ్మనాడు, బోయ కొట్టం. రాజ్యంలో దానంగా ఇవ్వబడిన కానుకలు, గ్రామాల వివరాలు రాజ్యప్రకటన కాగితాలు వ్రాసేవారు తమ రికార్డులలో వ్రాసుకొనేవారు. వీటిని నియోగి కవల్లభలు అని పిలిచేవారు వాటికి కప్పం ఉండేది కాదు. ఈ మాన్యాలను శిలాశాసనాలలో పొందు పరచేవారు. మిగిలిన గ్రామాలలో కప్పాలు వసూలు చేయడం జరిగేది. వంశపారపర్యంగా వచ్చే ఆస్తి వల్ల, బయటి వారు ఆక్రమించుకోవడం వల్ల భూముల మీద తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. రాజ్యం చిన్న చిన్న విభాగాలుగా విభజించబడింది. వీటిలో ముఖ్యమైనవి ఎలమంచిలి, పిఠాపురం ముదిగొండ. ఈ విభాగాల వారిలో ముఖ్యమైన క్షత్రియ రాజులైన కోన హైహయలు, హైహేయలు, కాలచూరి, కోట, ఛాగి, పరిఛ్ఛేద, వంశజులతో తూర్పు చాళుక్యు రాజులకు వివాహ సంబంధాలు ఉండేవి. వెలనాడు, కొండ అదమటి, మొదలైన క్షత్రియులు కాని వంశాల వారితో కూడా వివాహ సంబంధాలు ఉండేవి.
సమాజం సవరించు
వేంగి సామ్రాజ్యంలోని ప్రజలు అభ్యుదయ భావాలు కలిగినవారు. తూర్పు చాళుక్యుల రాజ్యం విస్తరించాక హుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు రాజ్యం అంతా తిరిగి అక్కడి ప్రజల గురించి ఉదాత్త స్వభావం కలవారని, నల్లటి ఛాయ కలిగిన వారని, కళలు అంటే అత్యంత ప్రీతి కలిగిన వారని వ్రాసుకొన్నాడు. సమాజంలోని ప్రజలు వంశ పారంపర్యంగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. ముందు నిరాకరించినా బౌద్ధులు, జైనులు కూడా వర్ణాలు పాటించేవారు.చాళుక్యులు క్షత్రియ కులస్తులు.వీరు తమిళులైన చోళులను వివాహాలు చేసుకున్నారు.కాక బోయ, సరవర అనే తెగలు కూడా ఉండేవి.
చతుర్వర్ణాలు : బ్రాహ్మణులు సమాజంలో గౌరవాన్ని అనుభవించారు. వీరు శాస్త్రాలు, వేదాలలో ప్రావీణ్యత కలిగినవారు. వీరికి రాజులు భూములు, నిధులు విరాళంగా ఇచ్చేవారు. వీరు పరిపాలన యంత్రాంగంలో మంత్రుల వంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు అనుభవించేవారు. కొంత మంది బ్రాహ్మణులు సైన్యంలో చేరి ఉన్నత పదవులు అనుభవించారు.
క్షత్రియులు పరిపాలనా వర్గానికి చెందిన వారు. వీరికి యుద్ధమంటే ఉన్న ప్రీతి వల్ల రెండు శతాబ్దాలపాటు యుద్ధాలు జరిగాయి.
వైశ్యులు: ఈ వర్ణానికి చెందినవారి హస్తాలలో వర్తకం అభివృద్ధి చెందింది. వీరి సంఘం చాలా శక్తి వంతమైన సంఘంగా పెనుగొండ వద్ద ఉండేది. దీనికి 17 శాఖలు ఉండేవి. సమాజ కార్యకలాపాలు చూడడానికి సమయ మంత్రి ఉండేవాడు.
శూద్రులు: ఈ వర్ణం వారు సమాజంలో అధిక సంఖ్యలో ఉండేవారు. వీరిలో మళ్ళీ వివిధ తెగలు ఉండేవి. సైన్యములో వీరికి ఉద్యోగాలు కల్పించబడేవి. ప్రతిభ చూపిన వారికి రాజ్యంలో సామంత రాజుల లేదా మాండలికుల హోదా కల్పించబడేది.
మతాలు - వాటి ఆదరణ సవరించు
శాతవాహనుల కాలంలో ప్రబలంగా ఉన్న బౌద్ధ మతం చాళుక్యుల కాలానికి క్షీణించింది. బౌద్ధాశ్రమాలు నిర్మానుష్యంగా ఉండేవి. బౌద్ధ స్థూపాల వద్ద నివాసం ఏర్పాటు చేసుకొన్నవారు ఆ స్థూపాలను అంటిపెట్టుకొని ఉండేవారు. అప్పటి చైనా రాయబారి హుయాన్ త్సాంగ్ అందించిన ఆధారాల ప్రకారం 20 బౌద్ధాశ్రమాలు, ప్రతి ఆశ్రమంలోను 3000 బౌద్ధ సన్యాసులు నివసించేవారు. బౌద్ధ మతం క్షీణించినా జైనమతం ప్రజల ఆదరణ కలిగి ఉంది. ఈ విషయం ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాలలో శిథిలమైన విగ్రహాలు చూస్తే తెలుస్తుంది. తూర్పుచాళుక్య రాజులు జైన దేవాలయాలకు నిధులు, విరాళాలు ఇచ్చేవారని శిలాశాసనాల ఆధారంగా తెలుస్తున్నది. కుబ్జ విష్ణువర్థనుడు, మూడవ విష్ణువర్థనుడు, రెండవ అమ్మ జైన మతాన్ని ఆదరించారని తెలుస్తోంది. విమలాదిత్యుడు, మహావీరుని నియమాలను పాటించాడని తెలుస్తోంది. అప్పట్లో విజయవాడ, జెనుపాడు, పెనుగొండ, మునుగొండ ప్రసిద్ధ జైన క్షేత్రాలు. హిందూ మతం చాళుక్యుల పరిపాలన కాలంలో రాజ్య మతం. హిందూ మతంలోని రెండు విభాగాలలో వైష్ణవం కంటే శైవంకు ఆదరణ ఎక్కువగా ఉండేది. కొంతమంది రాజులు తమను తామే చక్రవర్తులుగా ప్రకటించుకొన్నారు. బౌద్ధ క్షేత్రాలు వీరి కాలంలో శైవ క్షేత్రాలుగా పరిణతి చెందాయి. తూర్పు చాళుక్య రాజులైన రెండవ విజయాదిత్యుడు, మెదటి యుద్ధమల్ల, మూడవ విజయాదిత్యుడు, మెదటి భీముడు శివాలయాలు నిర్మించడం మీద ఆసక్తి చూపారు. దేవాలయాలు దైవారాధనకే కాక నృత్యం, సంగీతం, మొదలైన కళలకు వేదికగా ఉండేవి.
సాహిత్యం సవరించు
తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పండరంగని శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతి గాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో కవిత్రయంలో మెదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించేవరకు జరగలేదు.
శిల్ప సంపద సవరించు
శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంచేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించడం జరిగింది. రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలు నిర్మించాడని ప్రతీతి. యుద్ధమల్ల విజయవాడలో కార్తికేయుడి దేవాలయాన్ని నిర్మించాడు. ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామంలోని దేవాలయాన్ని, సామర్లకోటలోని చాళుక్య భీమేశ్వర దేవాలయాన్ని కూడా నిర్మించాడని చెబుతారు. పశ్చిమ గోదావరి జిల్లా కలిదిండిలో రాజరాజ నరేంద్రుడు మూడు స్మారక క్షేత్రాలు ఏర్పాటు చేశాడు. తూర్పు చాళుక్యులు చోళ రాజుల, చాళుక్యుల శిల్పశైలిని అనుసరించినా, వారి శిల్పశైలి విభిన్నంగా ఉంది. వారి శిల్పశైలి చెప్పడానికి పంచారామాలలోనున్న దేవాలయాలు, ద్రాక్షారామంలోనున్న భీమేశ్వరాలయం, బిక్కవోలులోనున్న గోలింగేశ్వర దేవాలయం నిదర్శనాలు. బిక్కవోలు లోనున్న గోలింగేశ్వర దేవాలయంలో చెక్కబడిన అర్థనారీశ్వరుడు, శివుడు, విష్ణువు, అగ్ని, చాముండి, సూర్యుడు మొదలైన విగ్రహాలు అప్పటి శిల్పకళను చూపడానికి నిదర్శనాలు.
పాలించిన రాజులు: సవరించు
- కుబ్జ విష్ణువర్ధనుడు (624 – 641 C.E.)
- జయసింహుడు 1 (641 – 673 C.E.)
- ఇంద్రబట్టారకుడు (673 C.E., seven days)
- విష్ణువర్ధనుడు 2 (673 – 682 C.E.)
- మంగి యువరాజు (682 – 706 C.E.)
- జయసింహుడు 2 (706 – 718 C.E.)
- కొక్కిలి (718-719 C.E., six months)
- విష్ణువర్ధనుడు III (719 – 755 C.E.)
- విజయాదిత్యుడు I (755 – 772 C.E.)
- విష్ణువర్ధన IV (772 – 808 C.E.)
- విజయాదిత్యుడు II (808 – 847 C.E.)
- విష్ణువర్ధనుడు V (847– 849 C.E.)
- గుణగ విజయాదిత్యుడు లేదా విజయాదిత్య III (849 – 892 C.E.) తన సోదరులతో: విక్రం ఆదిత్య I, యుద్ధ మల్ల I
- చాళుక్య భీముడు I (892 – 921 C.E.)
- విజయాదిత్యుడు IV (921 C.E., 6 నెలలు)
- అమ్మ I, విష్ణువర్ధనుడు VI (921 – 927 C.E.)
- విజయాదిత్యుడు V (927 C.E., 15 రోజులు)
- తదప (927 C.E., 1 నెల)
- విక్రం ఆదిత్య II (927 – 928 C.E.)
- చాళుక్య భీముడు II (928 - 929 C.E.)
- యుద్ధమల్లుడు II (929 – 935 C.E.)
- చాళుక్య భీముడు III, విష్ణువర్ధన VII (935 – 947 C.E.)
- అమ్మ II (947 – 970 C.E.)
- దానర్ణవుడు (970 – 973 C.E.)
- జటా చోడ భీముడు (973 - 999 C.E.)
- శక్తి వర్మ I (999 - 1011 C.E.)
- విమలాదిత్యుడు (1011 – 1018 C.E.)
- రాజరాజ నరేంద్రుడు (1018 – 1061 C.E.)
- శక్తి వర్మ II (1062 C.E.)
- విజయాదిత్యుడు VI (1063 – 1068 C.E., 1072 – 1075 C.E.)
- రాజరాజ II (1075 - 1079)
- వీర చోళ విష్ణువర్ధనుడు IX (1079 - 1102
వనరులు సవరించు
బయటి లింకులు సవరించు
- https://web.archive.org/web/20150606122134/http://www.whatisindia.com/inscriptions/south_indian_inscriptions/volume_1/chalukya_dynasty.html
- https://web.archive.org/web/20140718014056/http://www.whatisindia.com/inscriptions/south_indian_inscriptions/volume10/eastern_chalukyas.html