వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 33వ వారం

సీతాదేవి

హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత, శ్రీమహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. జానకి, మైధిలి, వైదేహి, రమ కూడా సీత పేర్లు. సీతను తరచు సీతమ్మ తల్లి, చల్లని తల్లి అని వివిధ రచనలలోను, కీర్తనలలోను ప్రస్తావిస్తారు. మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము . సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాసం శుక్లపక్షంలో జరిగింది. ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న జనక్‌పూర్ సీత జన్మస్థలమని చెబుతారు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిధులను ఆహ్వానించి జనకుడు వారికోరికపై తనవద్దనున్న శివధనుస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు.
(ఇంకా…)