వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 39వ వారం
అత్తారింటికి దారేది |
---|
అత్తారింటికి దారేది 2013 సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త చనిపోబోయే ముందు తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన కుమార్తెను చూడాలని తాపత్రయపడుతుంటాడు. అతని మనవడు వెళ్ళి తన మేనత్తకు నచ్చజెప్పి ఎలా తీసుకువచ్చాడనేది ఈ చిత్ర కథాంశం. 2012 నవంబరు 23న ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు హైదరాబాదు లోని ఫిలిం నగర్ దేవాలయంలో నిర్వహించబడ్డాయి. ఆపై చిత్రీకరణ తమిళనాడులోని పొల్లాచి వద్ద 2013 ఫిబ్రవరి 10 నుంచి మొదలయ్యింది. పొల్లాచిలో చిత్రీకరణ జరుపుకున్నాక ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు లోని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ ఇంటి సెట్టులో కొనసాగింది. ఈ సెట్టుని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ 3 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తయారు చేయించారు. 2013 మే 25 నుంచి ఒక నెలపాటు యూరోప్ దేశంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ ఒక నెల వ్యవధిలో జరుపబడతాయని వెల్లడించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా సినిమా యూనిట్ సమక్షంలో హైదరాబాదులోని శిల్పకళా వేదికలో 2013 జూలై 19న విడుదలయ్యాయి.
|