అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేది 2013 సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.[1][2] పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.[3][4]
అత్తారింటికి దారేది | |
---|---|
దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ (కథ/మాటలు/స్క్రీన్ ప్లే) |
నిర్మాత | బివిఎస్ఎన్ ప్రసాద్ |
తారాగణం | పవన్ కళ్యాణ్ సమంత ప్రణీత బొమన్ ఇరానీ నదియా |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | సెప్టెంబరు 27, 2013 |
సినిమా నిడివి | 175 ని |
భాష | తెలుగు |
వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త చనిపోబోయే ముందు తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన కుమార్తెను చూడాలని తాపత్రయపడుతుంటాడు. అతని మనవడు వెళ్ళి తన మేనత్తకు నచ్చజెప్పి ఎలా తీసుకువచ్చాడనేది ఈ చిత్ర కథాంశం.[5]
కథ
మార్చురఘునందన్ (బొమన్ ఇరానీ) ఇటలీలో ఒక పెద్ద వ్యాపారవేత్త. లక్ష కోట్ల పైచిలుకు ఆస్తి ఉన్నా తన కూతురు సునంద (నదియా) తనతో ఉండకపోవటం రఘునందన్ మనసుని కలచివేస్తుంటుంది. సునంద రఘు ఇష్టానికి వ్యతిరేకంగా రాజశేఖర్ (రావు రమేశ్) అనే ప్లీడరుని పెళ్ళి చేసుకుంటుంది. అందుకు ప్రతీకారచర్యగా రఘు వారిద్దరినీ ఇంటినుంచి వెళ్ళగొడతాడు. రఘు మనవడు గౌతం నందా (పవన్ కళ్యాణ్) ఇదంతా గమనించి రఘు రాబోయే పుట్టినరోజు సునంద, శేఖర్ మరియూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటావని మాటిస్తాడు.
అనుకున్నదే ఆలస్యంగా గౌతం తన అనుచరులతో కలిసి ఇండియాకి వెళ్తాడు. హైదరాబాదు విమానాశ్రయం దగ్గర శేఖర్ గుండెపోటుకి గురైతే గౌతం అతనిని కాపాడి హాస్పిటల్లో చేరుస్తాడు. అందుకు కృతజ్ఞతగా శేఖర్ గౌతమ్ని తన డ్రైవరుగా నియమిస్తాడు. సిద్ధు అనే పేరుతో ఆ ఇంటికి వెళ్ళిన గౌతం సునంద ఇద్దరి కూతుళ్ళు ప్రమీల (ప్రణీత), శశి (సమంత)ల గురించి తెలుసుకుంటాడు. ప్రమీలను ప్రేమలో పడేయాలనుకుంటే ప్రమీల ఇంతకు ముందే తను రోహిత్ (డా. భరత్) అనే అబ్బాయిని ప్రేమించానని చెప్తుంది. శశి అప్పటికే గౌతం మరియూ శేఖర్ ఆరోగ్యం చూసుకోడానికి వచ్చిన పద్దు (ఆలీ) అనే కాంపౌండరుకి శత్రువుగా మారుతుంది.
రోహిత్ పెళ్ళి వచ్చే రాత్రి జరుగుతుందని తెలిసి ప్రమీల ప్రేమను గెలిపించడానికి గౌతం, పద్దులిద్దరూ జీపులో బయలుదేరతారు. వీళ్ళిద్దరిపై సందేహం వ్యక్తం చేస్తున్న శశి అనుకోకుండా ఇంటి బాల్కనీ నుంచి జారి జీపు రాడ్డుకి తల తగిలి గతం మరిచి స్పృహ తప్పి వెనక సీటులో పడుంటుంది. మరుసటి ఉదయం శశికి స్పృహ వచ్చాక గౌతం తన బావని, పద్దు ఒక డాక్టరని, గౌతం శశి ప్రేమకై కోట్ల ఆస్తి వదులుకొచ్చాడని చెప్తారు. ఇది నమ్మి శశి గౌతంతో పీకల్లోతు ప్రేమలో పడుతుంది. ఆ రాత్రి పెళ్ళికి వెళ్ళి రోహిత్ గది నుంచి అతనిని తీసుకుని గౌతం, పద్దు, శశిలు జీపులో పారిపోతుండగా పెళ్ళికూతురు తండ్రి సిద్ధప్ప (కోట శ్రీనివాసరావు) తన మనుషులతో వారిని వెంబడిస్తుంటాడు. ఇంతలో శశికి గతం గుర్తుకు రావడం, గౌతం వాళ్ళతో పోరాడి రోహిత్, పద్దు, శశిలతో కలిసి హైదరాబాదు వెళ్ళిపోవడం జరిగిపోతాయి.
ఐతే నష్టపరిహారంగా సిద్ధప్ప సునంద ఇంటికి వచ్చి పరిష్కారం అడిగితే సునంద శశిని మీ ఇంటి కోడలిని చేస్తానని మాటిస్తుంది. తన సొంత కూతురిలా చూసుకుంటానని సిద్ధప్ప చెప్పి వెళ్ళిపోతాడు. సిద్ధప్పతో గొడవలు రాకూడదని శేఖర్ గౌతమ్ని పనిలోనుంచి తీసేస్తాడు. అప్పటికే సునందకి గౌతం ఉరఫ్ సిద్ధు తన మేనల్లుడని తెలుసు. ఈ రకంగా గౌతమ్ని ఇంట్లోనుంచి వెళ్ళగొట్టి తాననుకున్నది సాధించుకుంది సునంద. చేసేది లేక గౌతం వెళ్ళిపోతాడు. ఐతే పద్దు ద్వారా పెళ్ళి పనులు సమీక్షించడానికి సిద్ధప్ప తన అన్న కొడుకు భాస్కర్ (బ్రహ్మానందం)ని పంపిస్తున్నాడని తెలుసుకుని భాస్కర్ ఇండియాకి రాగానే తన దగ్గర సహాయకుడిగా చేరుతాడు గౌతం ఉరఫ్ సిద్ధు.
అప్పటికే శశి తనని తొలి చూపులోనే ప్రేమించిందని కాకపోతే డ్రైవరుతో పెళ్ళంటే తన పిల్లల భవిష్యత్తేంటని ఆలోచిస్తోందని గౌతం తెలుసుకుంటాడు. సునంద ఇంటికి భాస్కర్ సహాయకుడిగా చేరాక శశిని తనెవరో చెప్పకుండా తన దారిలోకి తెచ్చుకుంటాడు. భాస్కర్ విషయానికొస్తే భాస్కర్ శేఖర్ దగ్గర ఒకప్పుడు అసిస్టెంట్ లాయరుగా పనిచేసేవాడు. శేఖర్ ఇంటిలోంచి 2 లక్షలు తీసుకుని ఉగాండా దేశానికి పారిపోయి అక్కడ కొన్ని ఎకరాల భూమి కొంటాడు. అవి వజ్రాల గనులవ్వడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు. ఆడవాళ్ళ పిచ్చి ఉన్న భాస్కర్ శశిని చూసి మోహిస్తాడు. ఐతే తన ప్రతి ప్రయత్నాన్నీ గౌతం నాశనం చేస్తుంటాడు.
సునంద పెళ్ళి ఆగిపోతుందని చెప్పి గౌతమ్ని ఇంట్లోనుంచి పొమ్మంటుంది. అప్పుడు గౌతం, శశి లేచిపోయి చెన్నైకి పారిపోవాలనుకుంటారు. పెళ్ళి జరిగే ఉదయం శశి పద్దు సాయంతో ఇంట్లోనుంచి పారిపోతుంది. రైల్వే స్టేషనుకి సిద్ధప్ప మనుషులు వచ్చినా వాళ్ళందరికీ గౌతం దేహశుద్ధి చేసి పంపిస్తాడు. ఇంతలో సునంద, శేఖర్ మరియూ మిగిలిన వాళ్ళందరూ రైల్వే స్టేషనుకి వస్తున్నారని తెలిసి గౌతం డబ్బు, భయం ఉపయోగించి స్టేషను ఖాళీ చేయించమని తన అనుచరులని ఆడేశిస్తాడు. అప్పుడు శశి గౌతం నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది. శేఖర్ గౌతమ్ని చంపుతానన్నప్పుడు గౌతం తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు.
సునంద, శేఖర్ ఇద్దరినీ ఇంట్లోనుంచి గెంటేసాక రఘు శేఖర్ చేతిని గన్నుతో కాలుస్తాడు. తన ఆవేశపూరిత చర్యకి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు కానీ ఆ సమయంలో అనుకోకుండా ఆ గన్నులోని బుల్లెట్ గౌతం తల్లిని తాకడంతో తను చనిపోతుంది. నీ భర్తను గాయపరిచినందుకు నువ్వు వెళ్ళిపోతే తన తల్లిని చంపీన తాతను తానేం చెయ్యాలని గౌతం నిలదీస్తాడు. ప్రతీ సమస్యకి ప్రేమ, ద్వేషపూరిత దారులుంటాయని, నేను ప్రేమను ఎంచుకుంటే నువ్వు ద్వేషాన్ని ఎంచుకుని రఘు, తన మరియూ తన తండ్రి జీవితాలను నాశనం చేసావంటూ గౌతం సునందను నిందిస్తాడు. సునంద, శేఖర్ తమ తప్పును తెలుసుకుని గౌతంతో కలిసిపోతారు.
ఇంతలో శశిని భాస్కర్ కిడ్నాప్ చేయిస్తాడు. ఆ దుండగులకు ఈ కథంతా చెప్పాక గౌతం పద్దుతో కలిసి వచ్చి శశిని తీసుకుపోతాడు. ఉగాండా ప్రభుత్వం గనులను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో భాస్కర్ చేతిలో 2 లక్షలు మాత్రమే ఉంటాయి. శశి ప్రేమను గెలుచుకున్న గౌతమ్ని రఘు, తన తండ్రి మరియూ సునంద తమ కంపెనీ మీటింగులో గౌతమ్ని కంపెనీ అధిపతిని చేస్తారు. రఘునందన్ ఇంటినిండా చుట్టాలు, గౌతం అనుచరులు, పద్దు, భాస్కర్ తదితరుల సమక్షంలో విందు జరుగుతుంటుంది. ఆ సమయంలో గౌతం తన పక్కనే ఉన్న తన తాత రఘు చేతిని తన చేతిలోకి ఆప్యాయంగా తీసుకునే సన్నివేశంతో సినిమా ముగుస్తుంది.
తారాగణం
మార్చు- పవన్ కళ్యాణ్ - గౌతం నందా ఉరాఫ్ సిద్ధు
- సమంత - శశి
- ప్రణీత - ప్రమీల
- బోమన్ ఇరానీ - రఘునందన్
- ముకేష్ రిషి
- నదియా - సునంద
- రావు రమేశ్ - శేఖర్
- బ్రహ్మానందం - బద్దం భాస్కర్
- ఎం. ఎస్. నారాయణ - బాలు
- కోట శ్రీనివాసరావు - సిద్ధప్ప
- బ్రహ్మాజీ
- భరత్ రెడ్డి
- రఘుబాబు
- ఆలీ - పద్దు
- శ్రీనివాస రెడ్డి
- పోసాని కృష్ణమురళి
- పృథ్వీరాజ్ - పాతబస్తీ పరమేశ్వర్
- సమీర్ - ఎ. సి. పి
- ప్రదీప్
- అనంత్
- గిరిధర్
- రజిత
- భార్గవి
- నారిపెద్ది శివన్నారాయణ
- వైజాగ్ ప్రసాద్
- రవికాంత్
- ప్రభాకర్ గౌడ్
- ఆహుతి ప్రసాద్
నిర్మాణం
మార్చునటవర్గ ఎన్నిక
మార్చుజల్సా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా ఎన్నుకోబడింది.[6] ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ని కథానాయకుడిగా ఎన్నుకోవడానికి కారణాన్ని వివరిస్తూ త్రివిక్రమ్ ఈ సినిమాలోని సందేశం ఒక ప్రముఖ నటుడు హీరోగా నటించినప్పుడే ఎక్కువ మందికి చేరుకునే అవకాశం ఉందని తెలిపాడు.[7] అనతికాలంలో తమిళ నటి ప్రణీతను ఈ సినిమాలో రెండో కథానాయికగా ఎన్నుకున్నరు దర్శకనిర్మాతలు.[8] ఈ సినిమాలో ప్రముఖ హిందీ నటుడు బొమన్ ఇరాని నటిస్తున్నారని, దీని ద్వారా ఆయన తెలుగు చిత్రసీమకు పరిచయమౌతున్నారనీ తెలియజేయబడింది.[9] ఈ సినిమాలో సమంత తల్లిగా అలనాటి తార నదియా నటిస్తున్నారని జనాలకు తెలియజేయబడింది.[10] ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారనీ,[11] పవన్ కళ్యాణ్ ఇందులో ఒక ట్యాక్సీ డ్రైవర్ పాత్రను పోషించబోతున్నారని వెల్లడించబడ్డాయి.[12] ఐతే సినిమాలో పవన్ కళ్యాణ్ వేలకోట్ల ఆస్తివున్న వ్యాపారవేత్త అయివుండీ మేనత్తను ఇంటికి తీసుకువెళ్ళేందుకు వాళ్ళ ఇంటిలో డ్రైవర్ గా పనిచేసే పాత్ర పోషించారు.
చిత్రీకరణ
మార్చు2012 నవంబరు 23న ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు హైదరాబాదు లోని ఫిలిం నగర్ దేవాలయంలో నిర్వహించబడ్డాయి. ఆపై చిత్రీకరణ తమిళనాడులోని పొల్లాచి వద్ద 2013 ఫిబ్రవరి 10 నుంచి మొదలయ్యింది.[13] పొల్లాచిలో చిత్రీకరణ జరుపుకున్నాక ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు లోని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ ఇంటి సెట్టులో కొనసాగింది. ఈ సెట్టుని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ 3 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తయారు చేయించారు.[14] 2013 మే 25 నుంచి ఒక నెలపాటు యూరోప్ దేశంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ ఒక నెల వ్యవధిలో జరుపబడతాయని వెల్లడించారు.[15]
సంగీతం
మార్చుదేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా సినిమా యూనిట్ సమక్షంలో హైదరాబాదులోని శిల్పకళా వేదికలో 2013 జూలై 19న విడుదలయ్యాయి. విడుదలైన వెనువెంటనే ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభించింది.[16]
పాట | గానం | రచన | నిడివి |
---|---|---|---|
ఆరడుగుల బుల్లెట్టు | విజయ్ ప్రకాష్, ఎం. ఎల్. ఆర్. కార్తికేయన్ | శ్రీ మణి | 4:42 |
నిన్ను చూడగానే | దేవి శ్రీ ప్రసాద్ | దేవి శ్రీ ప్రసాద్ | 5:27 |
దేవ దేవం | పి. శ్రీరామ్, రీటా | రామజోగయ్య శాస్త్రి | 1:42 |
బాపు గారి బొమ్మ | శంకర్ మహదేవన్ | రామజోగయ్య శాస్త్రి | 4:38 |
కిర్రాకు | నరేంద్ర, డేవిడ్ | రామజోగయ్య శాస్త్రి | 3:56 |
టైం టు పార్టీ | డేవిడ్, మాల్గడి శుభ | రామజోగయ్య శాస్త్రి | 6:56 |
కాటమ రాయుడా | పవన్ కళ్యాణ్ | 1:11 |
సంభాషణలు
మార్చు- ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు.
- చూడప్పా సిద్ధప్పా, నేను సింహం లాంటోణ్ణి. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకొంటాను. అంతే తేడా. మిగతాదంతా సేం టు సేం.
రికార్డులు
మార్చుసెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా 170 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 36 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. తెలుగు సినిమా రంగంలో ఒక సినిమా విడుదల కాకముందే పైరసీ బయటకు రావడం ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ సినిమా సగభాగం పైరసీ సిడి బయటకు వచ్చింది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అల్లాడిపోయారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పారు. పైరసీ వచ్చినప్పటికీ సినిమా విడుదలైన తరువాత థియేటర్లు నిండిపోయాయి. కాసుల వర్షం కురిపించింది.[17]
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ మాటల రచయిత (త్రివిక్రమ్ శ్రీనివాస్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీప్రసాద్), ఉత్తమ సహాయ నటి (నదియా), ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ (రవిశంకర్-బొమన్ ఇరానీ)[18][19][20][21]
- సైమా అవార్డులు - 2013: ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్
మూలాలు
మార్చు- ↑ "Pawan Kalyan – Trivikram film title revealed!". 123 Telugu. 5 March 2013. Retrieved 6 March 2013.
- ↑ "Is Pawan's film Hare Rama Hare Krishna?". IndiaGlitz. 29 October 2012.
- ↑ "Pawan Kalyan and Trivikram's Sarada". 123 Telugu. Retrieved 28 November 2012.
- ↑ "Pawan Kalyan and Samantha in Trivikram's next flick". IBN. 27 October 2012. Archived from the original on 9 October 2013. Retrieved 11 May 2013.
- ↑ "పవన్ కళ్యాణ్‌కి హ్యాట్సాఫ్ చెప్పేశారు". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 16 అక్టోబరు 2017. Retrieved 16 October 2017.
- ↑ "Pawan-Trivikram's film to start in November". Times Of India. Archived from the original on 2013-09-28. Retrieved 2013-05-11.
- ↑ "Pawan Kalyan Trivikram film". Chiranjeevi Blog.
- ↑ "Praneeta in Pawan Kalyan - Trivikram film". idlebrain.com. Retrieved 5 January 2013.
- ↑ "Boman Irani Telugu debut in Pawan Kalyan – Trivikram film". idlebrain.com. February 4, 2013. Retrieved February 4, 2013.
- ↑ "Nadhiya in Pawan Kalyan 's Movie". timesofap.com. Archived from the original on 24 May 2013. Retrieved 1 March 2013.
- ↑ "Pawan Kalyan and Brahmanandam Combination again". timesofap.com. Archived from the original on 2013-09-27. Retrieved 4 March 2013.
- ↑ "Is Pawan Kalyan as taxi driver?". SuperGoodMovies. Archived from the original on 2013-03-15. Retrieved 13 Mar 2013.
- ↑ "Samantha romancing Pawan Kalyan in Pollachi". The Times of India. Retrieved 4 February 2013.
- ↑ "Rs 3 crores house set built for Pawan Kalyan's film!". 123 Telugu.
- ↑ "Attharintiki Daaredhi unit will head to Europe shortly". raagalahari.com. Retrieved May 2, 2013.
- ↑ "Pawan Kalyan's Atharintiki Daaredi music launch". idlebrain.com. Retrieved July 19, 2013.
- ↑ "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డ్!". Sakshi. 4 Jan 2014. Retrieved 15 Jan 2014.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.