వికీపీడియా:కొత్తవారిని ఆదరించండి
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
అంకిత భావంతో పనిచేసే వికీపీడియనుల కృషి వల్లనే కాక, కుతూహలంతో ఉన్న కొత్తవారు చేసే రచనల వలన కూడా వికీపీడియా పురోగమిస్తుంది. మనమంతా ఒకప్పుడు కొత్త వాళ్ళమే. వికీపీడియాలో చేరిన నెలలు, సంవత్సరాల తరువాత కూడా ఇంకా కొత్తగానే అనిపించే వాళ్ళమూ ఉన్నాం.
కొత్త రచయితలు కాబోయే సభ్యులు. అంచేత విలువైనవారు. వారితో ఓపిగ్గా వ్యవహరించాలి — వారితో దురుసుగా ఉండడం, ఇక్కడ రచనలు చెయ్యడమంటే ఏదో గొప్ప విషయమన్నట్లుగా ఉంటే, వాళ్ళు బెదిరిపోతారు. కొత్తవారు కొందరు వెంటనే గాడిలో పడినప్పటికీ, కొందరు ఇక్కడ ఎలా పని చెయ్యాలనే విషయంలో అయోమయానికి గురౌతూనే ఉంటారు.
కొత్తవారిని ఆదరించండి
మార్చు- కొత్తవారు వికీపీడియాకు అవసరం. కొత్తవారి రాకతో వికీపీడియా విజ్ఞానం, భావాలు, ఆలోచనలు మెరుగుపడి, తటస్థత, నిబద్ధతలు కాపాడబడతాయి.
- కొత్తవారికి మనమిచ్చే ఆహ్వానం - వెనకాడకండి, చొరవగా ముందుకు రండి అని మరువకండి. మనకు నియమాలు, నిబంధనలు ఉన్నాయి. కానీ కొత్తవారిని బెదరగొట్టేలా వాటిని అమలు చెయ్యరాదు. వారి విజ్ఞానం, తెలివితేటలు, అనుభవ సారం వికీపీడియాను మరింత మెరుగుపరచవచ్చు. వారు చేసే పని కొత్తలో తప్పుగా అనిపించినప్పటికీ పోనుపోను అది వికీపీడియా మెరుగుదలకే దోహదం చెయ్యవచ్చు. వారు తప్పు చేస్తున్నట్లు అనిపిస్తే, ముందు గమనించండి, అవసరమైతే మాట్లాడండి. ఆ తరువాతే అది తప్పో, కాదో నిర్ణయించండి.
- కొత్తవారు తప్పుచేసారని మీకు అనిపిస్తే, కోప్పడకండి. ఇక్కడ ఎవరైనా దిద్దుబాట్లు చెయ్యవచ్చనీ, దిద్దుబాట్లు అందరి బాధ్యత అనీ, ఇక్కడ ఆజమాయిషీ చేసేందుకు ఎవరూ లేరనీ మరువకండి.
- కొత్తవారు చేస్తున్న తప్పుల గురించి చెప్పితీరాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తే, స్నేహపూర్వకంగా చెయ్యండి. సహాయపడుతున్నట్లుగా చెప్పండి. మృదువుగా చెప్పండి. వారి తప్పులతో పాటు వారు చేసిన దిద్దుబాట్లలో మీకు నచ్చిన వాటిని కూడా ఎత్తి చూపండి. పై విధంగా చెప్పలేని పక్షంలో అసలు చెప్పకుండా ఉండడమే మేలు.
- తటస్థతకు సంబంధించినవి, తరలించడం వంటి పెద్ద మార్పులు చేసేందుకు కొత్తవారు జంకుతారు. వికీపీడియాను చెడగొడతామేమోనన్న భయంతో అలా సందేహిస్తారు. ఏం పర్లేదు, చొరవగా ముందుకు వచ్చి దిద్దుబాట్లు చెయ్యమని వారిని ప్రోత్సహించండి.
- కొత్తవారికి సలహాలిచ్చేటపుడు పెద్ద పెద్ద, అర్థం కాని వికీపీడియా పదాలతో హడలగొట్టకండి. వికీపీడియాలో వారు ఉత్సాహంగా పాల్గొనాలి. అంతేగాని, మీరు సంతృప్తి పడేంత జ్ఞానం కలిగి ఉన్న వారు మాత్రమే ఇక్కడ పనికొస్తారు అనే భావన వారిలో కలిగించవద్దు. వికీపీడియా లాంటి కొత్త ప్రదేశాల్లో పని నేర్చుకునేందుకు కొంత సమయం పడుతుంది.
- కొత్తవారు తాము చేసే పని పట్ల నిబద్ధతతో ఉన్నారని భావించండి. వారికో అవకాశం ఇవ్వండి!
- మనకు తప్పుగా అనిపించే ప్రవర్తన వారి తెలియనితనం కావచ్చు. వారి పట్ల శాంతంగా, గౌరవంగా, ఆసక్తి తోటి వ్యవహరిస్తే మీ గౌరవం, హుందాతనం ఇనుమడిస్తుంది.
- మీరూ ఒకప్పుడు కొత్తవారేనని గుర్తుంచుకోండి. కొత్తలో మీపట్ల ఇతరులు ఎలా ఉండాలని కోరుకున్నారో... అలా, వీలైతే అంతకంటే ఉన్నతంగా, వ్యవహరించండి.
- కొత్తవారి వ్యాసాలను ప్రోత్సహించాలి. కొత్తవారి మంచి వ్యాసాలను కొనియాడాలి.