వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/మాండలికాలు - ప్రామాణికత

అంశం

వ్యక్తులుగా ప్రతీవారికి స్థానికతతో పాటు వారి భాషకు మాండలికం ఉంటుంది. కోట్లాదిమందిని లక్ష్యం చేసుకున్న సంస్థలు ఈ స్థానికతల నుంచి కొంత స్వీకరించి ప్రామాణిక భాషను తయారుచేసుకోవడం చూశాం. (ఉదాహరణకు ఈనాడు, సాక్షి వగైరా పత్రికల వేర్వేరు భాషలు చూడండి) అయితే ప్రతీవారికి విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ప్రారంభమైనదీ, ప్రతీవారినీ రాయమని ఆహ్వానిస్తున్నదీ అయిన వికీపీడియాలో ఈ వైవిధ్యాన్ని ఏం చేయాలి? ప్రామాణికమని దేనిని స్వీకరించాలి అన్నది ప్రస్తుతం మన శైలీ నిర్ణయంలో ఒక కీలకమైన అంశం. సభ్యులు దీనిపై ఆలోచించవలసిందని, తమ తమ అభిప్రాయాలు, పరిశీలనలు పంచుకోవాలని కోరుతున్నాను.

ఆవశ్యకత

వచ్చాడు, వచ్చిండు, వచ్చినాడు అన్నవి మూడు వేర్వేరు మాండలికాలకు చెందని ప్రయోగాలు. వచ్చాడన్నది మనలో చాలామంది ప్రస్తుతం ఉపయోగిస్తున్నది, అయితే వచ్చిండు అన్న ప్రయోగాలు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వికీపీడియన్లు చేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో తెలుగు నాట తెలంగాణ పత్రికలు ప్రారంభమై ప్రామాణిక భాషను విస్తృతీకరించి, తెలంగాణ స్థానీయత దానిలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూండడం కూడా వాడుకరులను ప్రభావితం చేస్తూందని, భవిష్యత్తులోనూ చేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఈ అంశాన్ని సబ్జెక్టివ్‌గా చర్చించడం అవసరమని ప్రతిపాదిస్తున్నాను.

ఆంగ్ల వికీపీడియా ఉదాహరణ

ప్రపంచభాషల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంగ్ల భాషలో అమెరికన్, బ్రిటన్, ఆస్ట్రేలియన్, ఇండియన్ వంటి అనేక తీవ్ర భేదాలున్న మాండలికాలు ఉన్నాయి. అయితే తెలుగు వంటి భాషలకు భిన్నంగా ఈ ఆంగ్ల భాషా రూపాలన్నిటా తమదైన ప్రామాణికత ఉన్నది. అంటే అమెరికన్ స్టాండర్డ్ ఇంగ్లీష్, బ్రిటీష్ స్టాండర్డ్ ఇంగ్లీష్, ఇండియన్ స్టాండర్డ్ ఇంగ్లీష్ వంటివి ఉన్నాయి, ఈ ప్రామాణిక భాషల్లో పత్రికా భాష, పరిశోధన భాష ఇప్పటికే ఏర్పడివుంది. అయితే అంతర్జాతీయ పాఠకులను (అంటే వివిధ స్థానీయతలకు చెందినవారు) ఉద్దేశించి రాసే ఆంగ్ల వికీపీడియాలో ఏ విధమైన భాష తీసుకోవాలన్న ప్రశ్నకు - ఏ ఒక్క మాండలికాన్నో ఏకైక ప్రామాణిక భాషగా వికీపీడియా స్వీకరించదని నిర్ణయించారు. కనుక ఒక వ్యాసానికి ఏ విధమైన భాషా శైలి స్వీకరించాలన్నదానిపై కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. దాని ప్రకారం 1. అన్ని భాషా శైలులకు సరిపడే సాధారణ శైలిని అవకాశం ఉన్నంతవరకూ స్వీకరించడం 2. వ్యాసంలోని అంశం యొక్క స్థానీయతను బట్టి ఆ స్థానిక రకాన్ని వాడడం అంటే ముంబై గురించి ఇండియన్ ఇంగ్లీష్‌లో, అమెరికా అంతర్యుద్ధం గురించి అమెరికన్ ఇంగ్లీష్‌లో, సిడ్నీ గురించి రాసేప్పుడు ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్‌లో, జార్జ్ బెర్నార్డ్ షా గురించి బ్రిటీష్ ఇంగ్లీష్‌లో, దక్షిణాఫ్రికా జాతి వివక్ష గురించి సౌతాఫ్రికన్ ఇంగ్లీష్‌లో రాయడం పద్ధతి. ఈ పద్ధతి వల్ల ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యాసాలు ఆ ప్రాంతానివి అవుతాయని భ్రమించరాదు. 3. పై రెండు సూత్రాలు వర్తించని చోట్ల వ్యాసంలో అప్పటికే ఏ మాండలిక శైలి వాడుతూంటే ఆ మాండలిక శైలినే కొనసాగించాలి, అవసరమైతే ఈ వ్యాసం ఫలానా ఇండియన్ ఇంగ్లీష్‌లో ఉందని ఓ మూస పెట్టవచ్చు.
అయితే ఆంగ్ల వికీపీడియా ఉదాహరణ పరిశీలించినప్పుడు ఆంగ్ల భాషలో పలు ప్రామాణిక భాషలు ఏర్పడి దాదాపుగా స్థిరపడిన విషయాన్నీ, తెలుగులో పలు ప్రామాణిక భాషల లేమిని, ఆ ఏర్పాటు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూండి ఇంకా స్థిరపడలేదన్ని విషయాన్నీ గుర్తుచేయదలిచాను. ఇప్పుడు అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి సభ్యులు ఈ విషయంపై ఆలోచనలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:35, 6 జూన్ 2018 (UTC)