వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/ఆఖరి నివేదిక
జూన్ 2014న ప్రారంభమై మార్చి 2015న పూర్తైన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు యొక్క ఆఖరి నివేదిక ఇది. దీనికి మూలరూపం ఇక్కడ చూడవచ్చు. ఇది ప్రాజెక్టు ఉపపేజీ మాత్రమే కనుక గ్రాంటు వివరాలు కాక ప్రాజెక్టు వివరాలతో కూడిన నివేదిక మాత్రమే అవుతుంది ఇది.(ఇది కేవలం అనువాదం కాదు, ఇక్కడి వ్యక్తీకరణ, స్వేచ్ఛా వివరణలు అక్కడికి తేడాగా వుండవచ్చు)
సారాంశము
మార్చువిధానాలు, కార్యకలాపాలు
మార్చుఈ ప్రాజెక్టు నిర్వహణలో మేము పాటించిన విధానాల్లో ముఖ్యమైనవి ఈ క్రింద ఉన్నాయి:
- అన్ని అంశాల్లోనూ సముదాయం పాలుపంచుకోవడం: ఈ ప్రాజెక్టు నిర్వహణ వెనుక నేను ఉన్నానన్నది నిజమే అయినా, నేను ఒక్కణ్ణి మాత్రమేనన్నది వాస్తవం. ఈ ప్రాజెక్టు ఒంటరి కృషి అయిపోయేందుకు ప్రమాదం ఈ ప్రాజెక్టు డిజైన్ వల్ల ఎప్పుడూ పొంచివుండనే వుంది. దాన్ని నివారించేందుకు, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, ఆలోచనలు, సమస్యలు, పనులు సముదాయంతో పంచుకుంటూ, వారిని ఆయా నిర్ణయాల్లో భాగస్వాములను చేసేందుకు నా వంతుగా ఎప్పుడూ ప్రయత్నించాను. చివరికి కార్యప్రణాళికని సముదాయంలోని ముఖ్యులు తమ చేతుల్లోకి తీసుకుని, భవిష్యత్ కార్యక్రమాన్ని తయారుచేసేందుకు ముందుకువచ్చారు, అలా నా కృషి ఫలించినట్లయింది. అయితే దాని అర్థం ఈ కృషిలో నేను పాలుపంచుకోలేదని కాదండోయ్ :-) ప్రాజెక్టుకు ముఖ్యమైన కృషిచేసినవారిలో నేనొకణ్ణి, కానీ కృషిచేసినవారందరి కృషీ లెక్కిస్తే ప్రతి యత్నంలోనూ రెండో స్థానంలోనే పరిమితమయ్యేలా జాగ్రత్త పడ్డాను.
- తయారుచేసుకున్న కార్యప్రణాళికకు నిరంతరం మెరుగులు: ప్రాజెక్టు సమయం మొత్తంలో, ప్రాజెక్టు కార్యప్రణాళిక మరియు ఇతర ప్రయత్నాలు ప్రాజెక్టులో మాకు కలిగిన అనుభవాలు ఉపయోగించి మెరుగులు దిద్దడమో, విస్తృతపరచడమో చేస్తూనేపోయాం. ఉదాహరణకు నాటకరంగంపై ఎం.ఫిల్ చేస్తున్న పరిశోధక విద్యార్థి, వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ గారి కోరికను గమనించాకా కేవలం కాల్పనికేతర రచనల్లోనే విజ్ఞానం ఉందనుకోవడం అంత విశాలమైన ఆలోచన కాదని తెలిసింది, అన్ని విధాలైన పుస్తకాలను కాటలాగులో చేర్చడం ప్రారంభించింది ఆ తర్వాతే. అయితే ముందుగా మాత్రం విజ్ఞానసర్వస్వ తరహా పుస్తకాలకే ప్రాధాన్యతనిచ్చేవారం. కాటలాగ్‌లో చేరిన కాల్పనిక తరహా రచనల్లోనూ పీఠికలు, ఫోటోలు, ఇతర సమాచారం కూడా వ్యాసాలలో సమాచారం అభివృద్ధి చేేసేందుకు, ఇన్లైన్ రిఫరెన్సులతో వ్యాసం నాణ్యత పెంచేందుకు పనికివచ్చాయి. మరికొందరు వాలంటీర్లు తమకు సరి అనిపించిన విషయాలను ఆచరణలో పెట్టడం మొదలుపెట్టినారు, అయితే నేను వాటిని గుర్తించినప్పుడల్లా వాటిని చర్చలకు తీసుకువచ్చి కమ్యూనిటీ దృష్టిలో ఉంచేందుకు ప్రయత్నించాను.
ప్రాజెక్టు కార్యకలాపాలు ఇవి:
- డీఎల్ఐ పుస్తకాల జాబితాలు తయారుచేసి అభివృద్ధి చేయడం.
- తెలుగు వికీపీడియాలో లోపల్లోపల నావిగేట్ అయ్యేందుకు వీలున్న మూసలు వంటి వీలుచాళ్ళతో సహా అక్షరక్రమాన్ని ఉపయోగించి అనేక జాబితా పేజీలను తయారుచేశాము.
- పేజీలో పుస్తకం పేరు, లింకు, రచయిత/కవి/సంపాదకుల పేరు, కాటగిరీ, వివరణ, డీఎల్ఐ కోడ్, పుస్తక ప్రచురణ తేదీ సహా పుస్తకాల వివరాలను ఎప్పటికప్పుడు చేరుస్తూపోయాము.