వికీపీడియా:వికీప్రేమ
This page is an essay. It contains the advice or opinions of one or more Wikipedia contributors. This page is not one of Wikipedia's policies or guidelines, as it has not been thoroughly vetted by the community. Some essays represent widespread norms; others only represent minority viewpoints. |
Click here to skip straight to the templates to share! |
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: Love thy fellow editor. |
“ | Make love, not war | ” |
వికీప్రేమ అనేది వికీ వాడుకరుల మధ్య ఉండవలసిన ఆరోగ్యకర వాతావరణాన్నీ, పరస్పర అవగాహననీ సూచించేందుకు వాడే పదం. WikiLove అనే ఆంగ్ల పదం మెయ్లింగ్ లిస్ట్‌లలో క్రమేణా తయారైన పదం. దానికి తెలుగు అనువాదమే వికీప్రేమ. వికీపీడియాలో ఎన్నో వేర్వేరు అభిప్రాయాలూ, దృక్పథాలూ, భావజాలాలూ కలవారు కలిసి వ్యాసాభివృద్ధి చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు కాస్తా దూషణలూ, పరిహాసాలుగా మారే అవకాశాలు చాలా ఎక్కువ. ఐతే మనందరం ఇక్కడ ఒకే అభిరుచి వలన గుమిగూడాము—జ్ఞానం మీద ప్రేమ. మానవాళికి తెలిసిన విషయ పరిజ్ఞానాన్నంతటినీ ఒక క్రమపద్ధతిలో పోగేసి, మునుపెన్నడూ ఎరుగనంత పెద్ద విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేయడం. ఇది చర్చలకు వేదిక కాదు, మనకి తెలిసిన విషయాలన్నిటినీ ఒకచోటకు చేర్చే ప్రయత్నం.
ఈ లక్ష్యాన్ని గుర్తుంచుకుని, అన్ని వేళలా, కష్టమైన వ్యాసాల్లో కూడా, తటస్థ దృక్కోణం ప్రతిబింబించేలా జాగ్రత్తపడుతూ, అవతలివారి కోణాన్ని కూడా అర్థం చేసుకుంటే ఈ "వికీప్రేమ"ను మనం నెలకొల్పగలుగుతాం. అలా చేయని పక్షంలో జరిగేదల్లా ఏమిటంటే, ఈ విజ్ఞాన సర్వస్వమే కాక, మన ఉమ్మడి లక్ష్యం కూడా నీరుగారిపోతుంది. నిరుపయోగకరమైన వాదప్రతివాదనలు సమర్పకులను నిరుత్సాహపరిస్తే, పక్షపాతభూయిష్టమైన వ్యాసాలు వీక్షకులకు పనికిరాకుండాపోతాయి. చివరికి కొన్నాళ్ళకి మన పేరు చెడిపోతుంది.
వికీప్రేమ విలసిల్లాలంటే బ్రహ్మ రహస్యం ఏమీ తెలియనక్కర్లేదు. ఈ కింది విషయాలను మనసులో పెట్టుకుంటే చాలు:
- వికీ మర్యాదను పాటించండి. పొరుగు వాడుకరులను గౌరవించండి.
- కొత్త వాడుకరుల వ్యాసాల నాణ్యత కొంచెం తక్కువగా ఉండవచ్చు. వారికి కాస్త వెసులుబాటు కల్పించి కొత్తవారిని ఆదరించండి.
- మా విధానాలూ, మార్గదర్శకాలను అనుసరించండి. అవి సమిష్టి కృషికి తోడ్పడతాయి.
- ఒకరితో విభేదించేటప్పుడు అవతలి వారిది సదుద్దేశమేనని భావించండి. ఎవరైనా మీతో విభేదిస్తోంటే సదుద్దేశంతోనే విభేదిస్తున్నారని భావించండి.
- తటస్థ దృక్కోణంతో వ్రాయడానికి ప్రయత్నించండి. అన్ని వర్గాలవారూ మీరు వ్రాసిన వ్యాసాలను చదివి ఒప్పుకోగలగాలి.
- సంయమనంగా ఉండండి. ఆవేశంలో చర్చల్లో పాల్గొనవద్దు. పరిస్థితుల వలన మీ కోపం మరి నషాళానికి అంటుతుంటే కొన్నాళ్ళు వ్యాసాలాభివృద్ధికి దూరంగా ఉండండి.
- మన్నించి మర్చిపోండి. ఇది కేవలం అంతర్జాలం మాత్రమే. ఏ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇతరుల ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, మహాత్ముడి అహింసా సిద్ధాంతాన్ని అనుసరించండి. మాటలతో కానీ చేతరతో కానీ ఎవరినీ బాధించవద్దు, బాధించేలా ఇతరులను ఉసిగొల్పవద్దు, ఎవరైనా ఇతరులను బాధిస్తోంటే వారికి మద్దతివ్వవద్దు.
- పొరుగు దిద్దుబాటుదారులు మీ కింద పనిచేసేవారు కాదని మర్చిపోకూడదు. అవతలి వారి కృషిని గుర్తిస్తే, అది ఎవరికైనా ఉత్సాహాన్నిస్తుంది. ఒకరి దిద్దుబాట్లపై వ్యాఖ్యానిస్తున్నప్పుడు, పరిస్థితులు కుదిరిన చోట, వారి కృషికి కృతజ్ఞతలు చెబుతూ మొదలుపెట్టండి.
వ్యాసాలాభివృద్ధిలో మీ సేవలు మాకు ఎంతో విలువైనవి. వికీప్రేమను వాడుకరులందరికీ పంచుతొరని ఆశిస్తున్నాము.