గోగులపాటి కూర్మనాధ కవి విజయనగర సంస్థాన ప్రభువైన విజయరామరాజు యొక్క ఆశ్రితుడు. భగవద్భక్తుడు. మానవులకు అంకితంగా ఏ కావ్యాన్నీ వ్రాయలేదు. అసూయాపరులైన విద్వాంసులు కొందరు విజయరామరాజుతో "ప్రభులపైన కూర్మనాథకవికి గౌరవం లేదు. అందువల్లే మీకు అంకితంగా ఏ గ్రంథమూ వ్రాయలేదు" అని చాడీలు చెప్పి కవి పైన విజయరామరాజుకు అసంతృప్తి కలిగించారు. ఆయన కూర్మనాథ కవిని పిలిపించి "మా పేరు వచ్చే విధంగా ఒక శతకాన్ని వ్రాయవలసింది"గా ఆదేశించాడు. కవి చిక్కులో పడ్డాడు. ప్రభువుకు అసంతృప్తీ, కోపమూ కలగకుండా తన నియమము చెడకుండా ఉండే రీతిలో, విజయనగరం దగ్గరలో ఉన్న రామతీర్థం క్షేత్రంలో వెలసివున్న శ్రీరాముని సంబోధిస్తూ "విజయరామా! రామతీర్థాశ్రయా!" అనే మకుటంతో శతకము వ్రాశాడు. విజయరామరాజుకు రామతీర్థంలోని శ్రీరామునిపై భక్తి ఎక్కువ. ఆ దేవస్థానం కట్టించింది విజయనగర సంస్థానాధీశులే. ఆ శతకాన్ని విని విజయరామరాజు తన్ను సంబోధిస్తూ దాన్ని వ్రాసినట్లు భావించి తృప్తి పొందాడు. చాడీలు చెప్పిన పండితుల పాచిక పారలేదు.