విద్యానాథుడు
విద్యానాథుడు 13వ శతాబ్దానికి చెందిన సంస్కృత కవి. ఇతడు కాకతీయ చక్రవర్తులలో చివరివాడైన ప్రతాపరుద్రుని ఆస్థాన కవి.
విశేషాలు
మార్చుఇతని అసలు పేరు విద్యానాథుడు కాదని అది అతని బిరుదు అని తెలుస్తున్నది. ఇతని పేరు అగస్త్యుడు అని కొందరు పరిశోధకుల అభిప్రాయం. ఇతడు సంస్కృతంలో "ప్రతాపరుద్రయశోభూషణమ్" లేదా "ప్రతాపరుద్రీయమ్" అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. భారతీయలాక్షణిక సంప్రదాయంలో దక్షిణాత్యులకు ఒక ఉనికి ఏర్పరచిన గొప్ప గ్రంథమిది. ఈ కావ్యంలో అనేక పదాలకు నిర్వచనాలు చాలా నిర్దుష్టంగా ఉన్నాయి. ఈ గ్రంథంలో విద్యానాథుడు అనేక కారికలకు ఉదాహరణలుగా తన ప్రభువు ప్రతాపరుద్రుని కీర్తిస్తూ శ్లోకాలు చెప్పాడు. ఈ ప్రతాపరుద్రీయ గ్రంథాన్ని మల్లినాథ సూరి తన వ్యాఖ్యానాలలో అనేక సార్లు పేర్కొన్నాడు. మల్లినాథుని కుమారుడు కుమారస్వామి ఈ గ్రంథానికి రత్నాపణం అనే వ్యాఖ్యను రచించాడు. ఈ ప్రతాపరుద్రయశోభూషణాన్ని అనుసరించి రామరాజభూషణుడు నరసభూపాలీయం లేదా కావ్యాలంకార సంగ్రహం అనే అలంకార గ్రంథాన్ని వ్రాశాడు. విద్యానాథుని ఈ సంస్కృత గ్రంథాన్ని జమ్మలమడక మాధవరామశర్మ "ఆంధ్ర ప్రతాపరుద్రీయమ"నే పేరుతో తెలుగుభాషలోనికి అనువదించాడు.
విద్యానాథుడు పై అలంకార గ్రంథాన్నే కాక బాలభారతమనే మహాకావ్యాన్ని, కృష్ణచరిత్ర అనే గద్యకావ్యాన్ని, నలకీర్తి కౌముది అనే 24 సర్గల కావ్యాన్ని రచించాడు. ఇవి కాక దశావతారస్తోత్రం, లక్ష్మీస్తోత్రం, శివస్తవం, శివసంహిత, లలితా సహస్రనామం, మణి పరీక్ష మొదలైన కృతులను వెలువరించాడు.