వినత
వినత కశ్యపుని భార్య. ధరణి, దక్షుడు ఈమె తల్లిదండ్రులు. దితి, అదితి, కద్రువ ఈమె సవతులు. అనూరుడు, గరుత్మంతుడు ఈమె సంతానం. శాప కారణంగా ఈమె కద్రువకు దాసి అవుతుంది. గరుత్మంతుడీమెను దాసీత్వంనుండి తప్పిస్తాడు.
పురాణ కథనంసవరించు
వినత దక్షుడి కూతురు. దక్షుడు ఈమెను 12 మంది సోదరీమణులతో పాటు కశ్యపునికిచ్చి వివాహం చేస్తాడు. కద్రువ ఈమె చెల్లెలు. వీళ్ళందరూ కశ్యపుని భార్యలుగా ఆయన బాగోగులు చూసుకుంటూ ఉండగా వారి సపర్యలకు మెచ్చి ఒక్కొక్కరికి ఒక్కో వరాన్ని ప్రసాదిస్తాడు.[1] కద్రువ సర్పజాతికి చెందిన వేయిమంది పుత్రులు కావాలని కోరుకుంటుంది. ఆమె మాటలు విన్న వినత కద్రువ పుత్రులు కన్నా శక్తివంతమైన ఇద్దరు పుత్రులు కావాలని వరం కోరుకుంటుంది. కశ్యపుడు వారిద్దరి కోరికలనూ మన్నించాడు. వారిద్దరూ గర్భవతులయ్యాక పిల్లలు పుట్టిన తర్వాత జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళతాడు.
చాలా కాలం తర్వాత కద్రువ వేయి గుడ్లనూ, వినత రెండు అండాలను ప్రసవిస్తారు. ఆ అండాలను వెచ్చగా ఉండే పాత్రల్లో జాగ్రత్తగా భద్రపరుస్తారు. 500 ఏళ్ళ తర్వాత కద్రువ అండాలనుంచి వేయి మంది పుత్రులు బయటకు వస్తారు. ఈ వేయి మందిలో శేషుడు, వాసుకి, తక్షకుడు ముఖ్యమైన వారు. ఈ ప్రపంచంలో ఉన్న సర్పజాతులన్నీ వీరి వల్ల జన్మించిన వారేనని విశ్వాసం. తన చెల్లెలు పుత్రులు బయటకు వచ్చినా ఇంకా తన అండాలు ఇంకా పొదగలేదని వినతకు ఈర్ష్య కలుగుతుంది. తొందరలో ఒక అండాన్ని పగలగొడుతుంది. అందులో సగం మాత్రమే రూపుదిద్దుకున్న శిశువు కనిపిస్తాడు. ఆ శిశువు తన అర్ధ శరీరాన్ని చూసి కోపగించి తల్లి తొందరపాటుకు ఆమెని శపిస్తాడు. ఈ శాపం ప్రకారం ఆమె తన చెల్లెలు కద్రువకు 500 ఏళ్ళ తర్వాత మరో శిశువు పుట్టేదాకా బానిసగా పనిచేయాల్సి ఉంటుంది. వినత రెండో కొడుకు గరుత్మంతుడు, అత్యంశ శక్తివంతమైన వాడుగా జన్మిస్తాడు.[2]
మూలాలుసవరించు
- ↑ Mani, Vettam (1975). Puranic encyclopaedia : a comprehensive dictionary with special reference to the epic and Puranic literature. Robarts - University of Toronto. Delhi : Motilal Banarsidass.
- ↑ డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనం చేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ).