వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా

(వినుడు వినుడు రామాయణ గాధ నుండి దారిమార్పు చెందింది)

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా పాట లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీలలు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని అందించారు.

నేపథ్యం

మార్చు

లవకుశులు వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్య చేరతారు. అక్కడ రాజవిధిలో గానం చేస్తున్న వీరిని గురించిన సమాచారాన్ని రాజరికంలో చేరుస్తారు. ఆ విధంగా అంతఃపురం చేరి రామాయణాన్ని గానం చేస్తారు.


పల్లవి :
ఓ ఓ ఓ .....

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా .....
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథా
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా .....


చరణం :
శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని .....
పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని
కారుచిచ్చుగా మారెను కైక మంథర మాట విని ..... మంథర మాట విని ||| వినుడు వినుడు |||


చరణం :
అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి
జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృథివి
మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి
చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని ..... కూలే భువి పైని ||| వినుడు వినుడు |||


చరణం :
కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోసమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి
వనవాస దీక్షకు సెలవు కోరి పినతల్లి పదాల వ్రాలి


ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా .....
వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా
గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది
వీడకుమా మనలేనని వేడుకొన్నది
అడుగులబడి రాఘవా .....
అడుగులబడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది .....
అడలి అడలి కన్నీరై అరయుచున్నది .....

సాహిత్య విశేషాలు

మార్చు

రామాయణం లోని అయోధ్యకాండ, అరణ్యకాండలకు సంబంధించిన కథాంశాలను తీసుకొని శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలను ఈ పాటలో వివరించారు.[1] రాముడులేని రాజధాని, అయోధ్య ప్రజలకు ఎలా శూన్యము మిగిల్చిందో, ఎలా దుఃఖసాగరంలో ముంచెత్తిందో కరుణారస భరితంగా రాశారు. సముద్రాల సీనియర్ తెలుగు భాషలోని క్రియ పదాలతో "ఈ"కారాంత వాక్యవిన్యాసంతో ఈ గీతాన్ని కొత్తరీతిన నిర్మించారు. విని/తన్వీ/పృథివీ/కాదనీ/భూజానీ/మహీపతీ/కటారీ/రోసిల్లీ/తమ్మునీ/తొల్లుమన్నదీ/అరయుచున్నదీ మొదలైన పదాలు ఈ పాటలో సందర్భానుసారంగా ఉపయోగించారు. ఈ పాటకు కీరవాణి రాగం ఆధారమైనది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. లవకుశ (1963), జీవితమే సఫలము: సీనియర్ సముద్రాల సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్య, మూడవ సంపుటము, డా. వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీ:140-151.

బయటి లింకులు

మార్చు