లవకుశ

1963 తెలుగు సినిమా

లవకుశ సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా, లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించగా, ఎన్.టి.రామారావు, అంజలీదేవి, మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, కాంతారావు, చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రధారులుగా 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు. సీతారాములు పట్టాభిషిక్తులు అయ్యాకా చాకలి తిప్పడు నిందవేశాడని రాజారాముడు గర్భవతియైన సీతాదేవిని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణ గానం చేయడం, రామ అశ్వమేథయాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి. 1934లో బ్లాక్ అండ్ వైట్లో లవకుశను దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యకే మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది.

లవకుశ
సినిమా పోస్టరు
దర్శకత్వంసి. పుల్లయ్య
సి. ఎస్. రావు
రచనసదాశివబ్రహ్మం (మాటలు), సముద్రాల, కొసరాజు, సదాశివబ్రహ్మం (పాటలు)
స్క్రీన్ ప్లేసి. పుల్లయ్య
సి. ఎస్. రావు
దీనిపై ఆధారితంఉత్తర రామాయణం
నిర్మాతఎ. శంకర్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంపి. ఎల్. రాయ్
కూర్పుఎ. సంజీవి
సంగీతంఘంటసాల
విడుదల తేదీ
29 మార్చి 1963 (1963-03-29)
సినిమా నిడివి
208 ని
దేశంభారతదేశం
భాషలుతెలుగు, తమిళం

1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఆర్థిక కారణాలతో సినిమా చిత్రీకరణ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. సినిమా ప్రారంభించినప్పుడు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్య అనారోగ్యం పాలుకావడంతో ఆయన కుమారుడు సి.ఎస్.రావు పునఃప్రారంభం తర్వాత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. మొత్తానికి సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని 1963లో 26 కేంద్రాల్లో విడుదలైంది. సినిమా అపూర్వమైన వాణిజ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్నికేంద్రాల్లో 150 రోజులు జరుపుకోవడంతో ప్రారంభించి 500 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. పావలా, రూపాయి టిక్కెట్లు ఉన్న రోజుల్లో సినిమా రూ.కోటి వసూళ్ళు పొందింది. 60లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్మి చరిత్ర సృష్టించింది. సినిమా తమిళ వెర్షన్ 40 వారాలు ఆడగా, హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. రిపీట్ రన్స్ లోనూ కేంద్రాల సంఖ్య, ఆడిన రోజుల్లో రికార్డ్ సాధించింది.

సినిమా ఘనవిజయాన్ని సాధించడంతో పాటుగా క్లాసిక్ స్థాయిని అందుకుంది. సినిమాలో సీతారాములుగా నటించిన ఎన్టీ రామారావు, అంజలీదేవి పాత్రల్లో ఎంతగా ప్రాచుర్యం పొందారంటే వారిని ప్రజలు నిజమైన సీతారాముల్లానే భావించి హారతులు పట్టేవారు. సినిమా పాటలు కూడా ఘన విజయం సాధించి ప్రతి పల్లెలోనూ ఉత్సవాల సమయంలో మారుమోగాయి. ఇప్పటికీ సినిమా టీవిలో ప్రదర్శితమైనప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

సినిమా కథ

మార్చు

రామాయణం ఉత్తరకాండము ఈ సినిమా కథాంశానికి మూలం. సీతపై నిందలు విని రాజధర్మమునకు అనుగుణముగా ఆమెను రాముడు అడవులకు పంపాడు. సీతమ్మ అప్పుడు వాల్మీకి ముని ఆశ్రమంలో కవలలను కంటుంది. వారు అసహాయశూరులైన బాలురు. గానవిశారదులు. వాల్మీకి నేర్పిన రామాయణాన్ని రాముని కొలువులో గానం చేశారు. లోక కళ్యాణం కొరకు రాముడు అశ్వమేధ యాగం చేయతలపెడతాడు. లవకుశులు యాగాశ్వాన్ని నిలువరించి తండ్రితో యుద్ధానికి తలపడ్డారు. అప్పుడు సీతమ్మ రామునకు కొడుకులనప్పగించి తాను భూప్రవేశం చేస్తుంది.

సినిమా బృందం

మార్చు

నటీనటులు

మార్చు

సాంకేతిక బృందం

మార్చు

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

లలితా శివజ్యోతి పతాకంపై నిర్మించిన చరణదాసి సినిమాలో ఎన్.టి.రామారావు, అంజలీదేవి ఓ చిన్న సన్నివేశంలో సీతారాములుగా నటించారు. వారిద్దరూ సీతారాములుగా కనిపించిన దృశ్యం ఆ చిత్ర నిర్మాత శంకరరెడ్డిని చాలా ఆకట్టుకుంది. వారిద్దరూ సీతారాములుగా ఉత్తర రామాయణాన్ని తీస్తే బావుంటుందని ఆయనకు ఆలోచన వచ్చింది. అయితే అప్పటికే పలు లవకుశలు ఉత్తర రామాయణం కథాంశంతో వచ్చాయి. మొట్టమొదట ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ పతాకంపై దేవకీబోస్ దీనిని బెంగాలీలో తీశారు. అదే స్క్రిప్టుతో ఆ కంపెనీవారే తెలుగులో తీసే బాధ్యత సి.పుల్లయ్యకు అప్పగించారు. అప్పటి డ్రామా నటులైన పారుపల్లి సుబ్బారావు రామునిగా, శ్రీరంజని సీతగా 1934లో బ్లాక్ అండ్ వైట్ లో "లవకుశ" తెరకెక్కి బాగా విజయవంతమైనది. అయితే చూసిన కథనే మళ్ళీ తీస్తే విజయవంతమవుతుందా అన్న సందేహం కలిగింది. దాంతో ప్రేక్షకులకు కొత్తదనం కలిగించి, ఆసక్తి కల్పించేందుకు సినిమాను రంగుల్లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. లవకుశ ప్రారంభించేనాటికి తెలుగులో రంగుల సినిమా రాలేదు. తమిళంలో వచ్చిన ఓ సినిమాను మాత్రం తెలుగులోకి అనువదించగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాకు గతంలో దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యనే మళ్ళీ దర్శకునిగా తీసుకున్నారు.[2]

నటీనటుల ఎంపిక

మార్చు

సినిమాకు బీజం పడడమే ఎన్టీ రామారావు, అంజలీ దేవిలను చిన్న సన్నివేశంలో సీతారాములుగా చూసినప్పుడు పడడంతో వారిద్దరినీ సీతారాముల పాత్రలకు తీసుకున్నారు. అయితే అంజలీదేవి ఎంపిక విషయంలో సినిమా పరిశ్రమలో చాలా విమర్శలు ఎదురయ్యాయి. అప్పటికి నాట్యప్రధానమైన పాత్రల్లో ఆకట్టుకున్న అంజలీదేవి సీతాదేవిగా చేయలేదని దర్శకుడు సి.పుల్లయ్య ముందే అన్న వారు ఉన్నారు. అయితే వారి విమర్శలు లెక్కచేయకుండా సినిమా నిర్మాణాన్ని కొనసాగించారు.[2] సినిమాలో వాల్మీకి పాత్రలో నాగయ్య, లక్ష్మణునిగా కాంతారావు, లవకుశులుగా నాగరాజు-సుబ్రహ్మణ్యం నటించారు.[3] ఈ సినిమాలో చాకలి తిప్పడిగా రేలంగి, అతని భార్యగా గిరిజ నటించారు.

చిత్రీకరణ

మార్చు

దీనిని "గేవా కలర్" (అగ్ఫ-గీవర్ట్ జర్మనీ సంస్థ) లో తీశారు. తెలుగులో రంగుల్లో చిత్రీకరణ ప్రారంభించిన తొలి చిత్రం లవకుశ మాత్రమే, దక్షిణభారతదేశంలో అంతకుముందు ఒకే ఒక్క తమిళచిత్రం కలర్ లో విడుదలైంది. తమిళంలోనూ, తెలుగులోనూ "లవకుశ" సినిమాను ఒకేసారి తీశారు. 1958లో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది, ప్రారంభించిన 5 సంవత్సరాల అనంతరం 1963లో పూర్తయ్యింది. సినిమా ప్రారంభమయ్యాకా కొన్నాళ్ళకు నిర్మాతకు ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో విధిలేక మధ్యలో ఆపేశారు. తర్వాత నిర్మాత ఆర్థికంగా నిలదొక్కుకుని మళ్ళీ చిత్రీకరణ మొదలుపెట్టించారు. అయితే అప్పటికి దర్శకుడు సి.పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. దాంతో దర్శకుడు బి.ఎన్.రెడ్డి, మరో పంపిణీదారుడి ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడు సి.ఎస్.రావు సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి చిత్రాన్ని పూర్తిచేశారు. సినిమా చిత్రీకరణ పున:ప్రారంభించేనాటికి సినిమాలో పనిచేసిన నటీనటులకు, ముఖ్యంగా చిన్నవయసులో ఉన్న లవకుశ పాత్రధారులు మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యంలకు శారీరికంగా మార్పులు వచ్చేశాయి. ఎదిగే వయసు కావడంతో వారిలో వచ్చిన మార్పులు కొట్టొచ్చినట్టు కనిపించేవి, అయినా మేకప్ తోనూ, ఛాయాగ్రహణ నైపుణ్యంతోనూ ఈ సమస్యలు కమ్ముకొచ్చే ప్రయత్నాలు చేశారు. కొత్తగా కలర్ లో వచ్చిన సినిమా కనుక అప్పటి సాంకేతికత ఆధారంగా బాగా శక్తివంతమైన లైటింగ్ వాడేవారు, దాంతో ఆ లైటింగ్ ముఖానికి కొడుతుండగా నటించేందుకు నటీనటులు చాలా ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి ప్రారంభించిన అయిదేళ్ళకు ఇద్దరు దర్శకులు మారి సినిమా పూర్తయ్యింది.[2]

నిర్మాణానంతర కార్యక్రమాలు

మార్చు

సినిమాను 1958లో ప్రారంభించాకా కొన్నాళ్ళకు ఆర్థిక కారణాలతోనూ, దర్శకుడు పుల్లయ్య ఆరోగ్య కారణాలతోనూ ఆపేయాల్సివచ్చింది. మళ్ళీ ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకునిగా పున:ప్రారంభించారు. అయితే ఈ రెండుసార్లు అయిదేళ్ళ కాలావధిలో జరుపుకున్న చిత్రీకరణతో కూర్పు కు సమస్యలు వచ్చాయి. నాయకా నాయకులు రామారావు, అంజలీదేవిలకు, ప్రధానపాత్రలైన లవకుశులుగా నటించిన సుబ్రహ్మణ్యం, నాగరాజు ఈ కాలావధిలో శారీరికంగా మార్పులు వచ్చాయి. దాంతో మొదట్లో పుల్లయ్య తీసిన సన్నివేశాల్లోనూ, తర్వాత సి.ఎస్.రావు తీసిన సన్నివేశాల్లోనూ వారి శారీరిక మార్పులు స్ఫుటంగా కనిపిస్తూండడంతో వాటిని ఎడిట్ చేసేప్పుడు జతచేస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తేడా ప్రేక్షకులకు తెలియనీకుండా కలపేందుకు నిర్మాణానంతర కార్యక్రమాల్లో సమస్యలు ఎదుర్కొన్నారు.[3]

విడుదల, స్పందన

మార్చు

మార్చి 29 1963లో విడుదలైన లవకుశ ఘనవిజయం సాధించింది. అపూర్వమైన విజయంతో పాటుగా ఎన్నో రికార్డులు సృష్టించింది. మార్చి 29న విడుదలైన 26 కేంద్రాలలోనూ శతదినోత్సవం జరుపుకుని 150 రోజుల వరకు ప్రదర్శితమైంది. లేట్ రన్ లో 46కేంద్రాల్లో వందరోజులు ఆడిన తొలిచిత్రంగా చరిత్రకెక్కింది. 14 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొంది. తెలుగునాట మొట్టమొదట 500రోజులు ప్రదర్శితమైన చలనచిత్రంగానూ చరిత్ర సృష్టించింది. రిపీట్ రన్ లోనూ ఈ చిత్రం స్థాయిలో ఆడిన చిత్రం మరొకటి లేదు. రిపీట్ రన్లోని ప్రదర్శనలన్నీ కలుపుకుంటే వందకు పైగా కేంద్రాల్లో ఏడాదిపైగా ఆడిన చిత్రంగా భారతదేశం మొత్తమ్మీద మరో రికార్డు స్వంతం చేసుకుంది. సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించి మదురైలో 40వారాల పాటు ప్రదర్శితమైంది. హిందీ అనువాద వెర్షన్ కూడా రజతోత్సవం జరుపుకుంది.[3]

వాణిజ్యపరంగానూ భారతీయ సినీ చరిత్రలోనే చెప్పుకోవాల్సిన విజయం సాధిచింది లవకుశ. పత్రికలలో కలెక్షన్లు ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రకెక్కి[ఆధారం చూపాలి] వందరోజులకు రూ. 25 లక్షలు పోగుచేసి, 365 రోజులకు కోటి రూపాయలను నాటి 25 పైసలు, రూపాయి టిక్కెట్లపై వసూలు చేసింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 3 కోట్లు మాత్రమే, పైగా ఈ సినిమా ప్రదర్శితమైన వంద కేంద్రాల్లోనూ కలుపుకుంటే 60 లక్షల లోపు జనాభానే ఉండేది అయితే ఈ సినిమాను నూరు కేంద్రాలలో 1.98 కోట్ల మంది ప్రజలు ఆదరించినట్లు ఆనాటి పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి. అంటే ప్రతి కేంద్రంలోనూ ఆయా కేంద్రాల జనాభా కంటే నాలుగు రెట్లు టిక్కెట్లు అమ్ముడై అప్పటికీ ఇప్పటికీ కనివినీ ఎరుగని చరిత్రను సొంతం చేసుకుందీ చిత్రం. ఉదాహరణకు 1-1-1964 తేదీన వరంగల్‌ రాజరాజేశ్వరి థియేటర్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో ఆ చిత్రాన్ని 4,34,800 మంది చూశారు. ఆ నాటి వరంగల్‌ జనాభా ఒక లక్ష మాత్రమే. అంటే సినిమాను ఒక్కొక్కరు అన్నిమార్లు చూశారు.[3]

లవకుశ ప్రభావం

మార్చు

లవకుశ సినిమా తెలుగు సినిమాలపైనే కాక తెలుగువారిపైనా తన ప్రభావాన్ని చూపించింది. తెలుగు గ్రామాల్లోని రామాలయాల్లో ఈ సినిమా పాటలు మారుమోగి తెలుగునాట లవకుశ పాటలు వినిపించని గ్రామమే లేదన్నంత స్థాయి ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాయి.[3] తెలుగు గ్రామాల్లో శ్రీరామనవమి సహా ఏ ఉత్సవం చేసిన ఊరిలో బాక్సు తీసుకువచ్చి సినిమాలు వేసే క్రమంలో లవకుశ సినిమాను వేయడమన్నది రివాజుగా మారింది.[ఆధారం చూపాలి] లవకుశ సినిమాలో సీతారాములుగా నటించిన ఎన్టీ రామారావు, అంజలీదేవిలను నిజంగా సీతారాములన్నట్టే కొలిచేవారు. వారు ఎక్కడకు వెళ్ళినా భక్తులు హారతులు పట్టేవారంటే వారికి వచ్చిన ఇమేజ్ అంచనావేయవచ్చు.[2] సినిమా విడుదలైన 50 సంవత్సరాలకు 2013లో కూడా డీవీడీలు, టీవీల ప్రదర్శనల ద్వారా ప్రజాదరణ పొందుతూనేవుంది.[2]

పురస్కారాలు, గౌరవాలు

మార్చు

లవకుశ సినిమాకు 1963 సంవత్సరం జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చలనచిత్రం పురస్కారం లభించింది.[2][3] నేటి లెక్కల ప్రకారం.. వెయ్యి కోట్ల సినిమా ‘లవకుశ’.

1964: జకార్తా లోను ,1965 లో మాస్కో లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైనది.

సంగీతం

మార్చు

రచన, స్వరకల్పన

మార్చు

లవకుశ సినిమా సంగీత దర్శకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావు వ్యవహరించారు.[2] సినిమాలోని పలు పాటలను కొసరాజు రాఘవయ్య చౌదరి, సముద్రాల రాఘవాచార్య, సదాశివబ్రహ్మం రాశారు. 30కి పైగా పద్యాలతో తెరకెక్కిన ఈ సినిమాలో పద్యాలను కూడా సదాశివ బ్రహ్మం, సముద్రాల రాఘవాచార్యులు రచించగా, కవికోకిలగా పేరొందిన దువ్వూరి రామిరెడ్డి రచించిన ఓ పద్యాన్ని మాత్రం తీసుకుని ఉపయోగించుకున్నారు.

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ కొసరాజు ఘంటసాల ఘంటసాల
జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల, పి.సుశీల, పి.లీల, వైదేహి, పద్మ మల్లిక్
రామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా సముద్రాల రాఘవాచార్య ఘంటసాల పి.సుశీల, పి.లీల
రామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమ సదాశివబ్రహ్మం ఘంటసాల పి.సుశీల, పి.లీల
లేరు కుశలవుల సాటి సరి వీరులో ధారుణిలో సముద్రాల రాఘవాచార్య ఘంటసాల పి.సుశీల, పి.లీల
వల్లనోరి మావా నీ పిల్లని, నేనొల్లనోరి మావా నీ పిల్లని సదాశివబ్రహ్మం ఘంటసాల ఘంటసాల, జిక్కి, జె.వి.రాఘవులు, రాణి
వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా సముద్రాల రాఘవాచార్య ఘంటసాల పి.సుశీల, పి.లీల
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మా సముద్రాల రాఘవాచార్య ఘంటసాల పి.సుశీల, పి.లీల
సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల
శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ సదాశివబ్రహ్మం ఘంటసాల జె.వి.రాఘవులు, వైదేహి, కోమల, సౌమిత్రి

ఇంకా పద్యాలూ, పాటలూ. పాటల్లాగే ఈ సినిమాలో డైలాగులు ఎంతో సున్నితంగా ఉండి ప్రేక్షకులకు గుర్తుంటాయి.

అన్ని పాటల జాబితా

01. అపవాద ధూషితయైన కాంతని బాసి పతి (పద్యం) - సుశీల - రచన: దువ్వూరి రామిరెడ్డి
02. అశ్వమేధయాగానికి జయము - ఘంటసాల,మాధవపెద్ది,రాఘవులు,రాణి,సరోజిని - రచన: కొసరాజు
03. ఇంతకు బూనివచ్చి వచింపకపోదునే విన్ము (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
04. ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు (పద్యం) - ఘంటసాల - రచన: రచన: సదాశివబ్రహ్మం
05. ఇనుడసాద్రికి చేరకుండ రిపురాజేంద్రున్ నిరోదించి (పద్యం) - పి.లీల
06. ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారడవిదే - పి.లీల,సుశీల - రచన: సదాశివబ్రహ్మం
07. ఎందుకే నామీద కోపం ఏమిటే నీ పరితాపం - పిఠాపురం, ఎ.పి. కోమల రచన: సదాశివబ్రహ్మం
08. ఏనిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు - ఘంటసాల - రచన: కొసరాజు
09. ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
10. ఒల్లనోరి మావా నీ పిల్లని - ఘంటసాల,జిక్కి,రాఘవులు,రాణి - రచన: సదాశివబ్రహ్మం
11. కన్నులారగ తుదిసారి కరువుదీర వీరశృంగార (పద్యం) - సుశీల - రచన: సదాశివబ్రహ్మం
12. జయ జయ రామా శ్రీరామ ధశరధ - రాఘవులు,సరోజిని బృందం - రచన: సదాశివబ్రహ్మం
13. జగదభిరాముడు శ్రీరాముడే - ఘంటసాల,సుశీల,లీల,మల్లిక్,వైదేహి - రచన: సముద్రాల
14. తండ్రి పంపున నేగి (సంవాద పద్యాలు ) - ఘంటసాల,లీల,సుశీల - రచన: సదాశివబ్రహ్మం
15. దక్కెను బాలకుండని రధమ్మున నెత్తుకపోవ జూతువా (పద్యం) - లీల
16. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
17. ప్రతిదినమేను తొలదొల్తపాదములంటి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
18. ముద్దుమోము ఇటు తిప్పే పిల్లా మురిపిస్తా - ఘంటసాల,జిక్కి బృందం - రచన: సదాశివబ్రహ్మం
19. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు - సుశీల,రాణి - రచన: కొసరాజు
20. రామ కథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే - లీల,సుశీల - రచన: సముద్రాల
21. రామ సుగుణధామ రఘువంశజలధిసోమా శ్రీరామ - లీల,సుశీల - రచన: సదాశివబ్రహ్మం
22. రంగారు బంగారు చెంగావులు ధరించు (పద్యం) - ఘంటసాల - రచన: కంకంటి పాపరాజు
23. రావణు సంహరించి రఘురాముడు దుర్భర(పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
24. రాజట రాజధర్మమట రాముడు గర్భవతి (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: సదాశివబ్రహ్మం
25. లేరు కుశలవుల సాటి సరి వీరులో ధారుణిలో - లీల,సుశీల - రచన: సముద్రాల
26. విరిసె చల్లని వెన్నెల మరల ఈనాడు మా కన్నుల - జానకి బృందం - రచన: సముద్రాల రాఘవచార్య
27. వినుడు వినుడు రామాయణ గాధ వినుడీ మనసార - లీల,సుశీల - రచన: సముద్రాల
28. వేద పఠనము - వేదపండితులు,ఘంటసాల
29. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
30. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత - లీల,సుశీల - రచన: సముద్రాల
31. శ్రీరాఘవం ధశరతాత్మజమప్రమేయం (సాంప్రదాయ శ్లోకం) - లీల,సుశీల
32. శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ - రాఘవులు,వైదేహి,కోమల,సౌమిత్రి - రచన: సదాశివబ్రహ్మం
33. సప్తాశ్వరధమరూఢం ప్రచండం కశ్యపాత్మజం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
34. సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ - ఘంటసాల - రచన: సముద్రాల
35. సవనాశ్వంబిది వీరమాతయగు కౌసల్యా (పద్యం) - సుశీల - రచన: సదాశివబ్రహ్మం
36. స్త్రీ బాల వృద్ధుల తెగ ( సంవాద పద్యాలు ) ఘంటసాల,లీల,సుశీల - రచన: సదాశివబ్రహ్మం
37. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం (సాంప్రదాయ శ్లోకం) - సుశీల
38. రామస్వామి పదాంబుజముల నారాధింతునేని సదా - పద్యం - సుశీల - రచన - సదాశివబ్రహ్మం ?

విశేషాలు

మార్చు

తెలుగు లవకుశులుగా వేసిన మాస్టర్ సుబ్రహ్మణ్యం, మాస్టర్ నాగరాజులు తరువాత ఒకరు వ్యవసాయంలో, ఒకరు టైలరింగ్ వృత్తిలో కాలం గడిపారు. 2006లో ఇద్దరూ యాదృచ్ఛికంగా కలుసుకొన్నారు - ఇది టీవీలో వార్తగా వచ్చింది. తమిళ చిత్రానికి ఘంటశాల కొన్ని పాటలకు సంగీతం సమకూర్చగా మిగిలిన సంగీతం కె వి మహదేవన్ సమకూర్ఛారు. కన్నడ డబ్బింగ్ చిత్రానికి ఘంటసాల సంగీతంలో ముఖ్యమైన పాటలు, పద్యాలు కన్నడలో చెయ్యగా మిగిలినవి తెలుగులోను కన్నడలోను ఒకేలా ఉంటాయి. లవకుశ చిత్రంలో మాధవపెద్ది సత్యం చిన్న వేషంలో యాగం వద్ద ఒక మునిలా కనబడతాడు. ఈ చిత్రంలో పాటల గురించి ప్రస్తావిస్తూ సుశీల ఇందులో పాటలు పాడ గలగటం ఒకటి చాలు జీవితం ధన్యమైంది అన్నారు. లవుడుగా నటించిన నాగరాజు అప్పట్లో చాలా చిత్రాలలోనే నటించాడు. ఉదాహరణకి భక్తరామదాసు, మహాకవి కాళిదాసు, టైగర్ రాముడు మొదలైనవి. బాపు సంపూర్ణరామాయణంలో లక్ష్మణుడిగా కూడా నటించాడు. లవకుశ చిత్రం సుఖాంతమా, దుఃఖాంతమా చెప్పడం కష్టం.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు, వనరులు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 ఈనాడు సినిమా, బృందం. "స్వర్ణోత్సవ లవకుశ" (పి.డి.ఎఫ్.). ఈనాడు. నందమూరిఫ్యాన్స్.కాం. Retrieved 18 August 2015. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 నేటి లెక్కల ప్రకారం వెయ్యికోట్ల సినిమా లవకుశ
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • http://www.cinegoer.com/lavakusa.htmలో[permanent dead link] వ్యాసం
  • సూర్య దినపత్రిక - 2008 జనవరి 4 సూర్యచిత్ర అనుబంధం వ్యాసం - వినాయకరావు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/w/index.php?title=లవకుశ&oldid=4212675" నుండి వెలికితీశారు