విపశ్యన అంటే వాస్తవంగా ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఇది భారతదేశం యొక్క ఒక అతి పురాతన ధ్యాన పద్ధతి. ఇది భారతదేశంలో 2500 సంవత్సరాల క్రితం సార్వత్రిక రుగ్మతల కోసం, సార్వత్రిక పరిహారంగా బోధించబడింది.[1] విపశ్యనా ధ్యాన పద్ధతి మనస్సులోని వికారాలను సమూలంగా నిర్మూలించి తద్వారా సంపూర్ణ విముక్తి వలన లభించే పరమానందాన్ని కలుగజేస్తుంది. నిర్మూలనమంటే, కేవలం వ్యాధి నిరోధమే కాకుండా సంపూర్ణ మానవ దు:ఖ నిర్మూలనమే దీని లక్ష్యము. విపశ్యన స్వీయ పరిశీలన ద్వారా స్వీయ పరివర్తన కలిగించే మార్గం.[2]

ఈ విపశ్యనా ధ్యానాన్ని 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు కనుగొన్నాడు. బోధి వృక్షం క్రింద ఈ ధ్యానం లోనే వుండే సంబోధి (జ్ఞానోదయం) పొందాడు. అందువలన విపశ్యనా ధ్యానాన్ని బౌద్ధ ధ్యానం అనికూడా అంటారు. ఇది ఇతర ధ్యానాల కన్నా మౌలికంగా విలక్షణమైనది. సాధారణంగా ధ్యాన విధానాలన్నీ మానసిక వత్తిడిని తగ్గించి ప్రశాంతతను, పరమానందానుభూతిని కలిగిస్తాయి. అయితే విపశ్యనా ధ్యానంలో ఈ ప్రయోజనం సిద్ధించడమే కాకుండా అదనంగా మనలో వున్న దుఖాన్ని సమూలంగా నిర్మూలిస్తుంది.

ప్రత్యేకతలు

మార్చు

ఏ ధ్యానంలో అయినా సమాధి స్థితిని, ఆ స్థితిలో పొందే చిత్తానందకర స్థితిని పొందవచ్చు. అయితే విపశ్యనా ధ్యానంలో పొందే సమాధి స్థితికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.

  • విపశ్యనా ధ్యాన లక్షణం సంపూర్ణ దుఃఖ నివారణ. అంటే మనస్సులోని అశాంతిని పూర్తిగా తొలగించి పూర్ణ శాంతిని పొందడం. అందువలన విపశ్యనా ధ్యానంలో శీల-సమాధి-ప్రజ్ఞల అభ్యాసానికి చాలా ప్రాముఖ్యత వుంటుంది.
  • ఇది దుఖాన్ని, అశాంతిని, భాధలను రూపు మాపే ఒక పద్ధతి.
  • విపశ్యనా ధ్యానం ఇతర ధ్యానాలతో పోలిస్తే లోతైనది. కష్టతరమైనది.
  • ఈ ధ్యానంలో మనస్సును రూప శబ్దాదులపై కాక కేవలం శ్వాస పైనే కేంద్రీకరిస్తారు.
  • విపశ్యనా ధ్యానంలో పొందే చిత్తానందకర స్థితి శాశ్వతమైనది.
  • విపశ్యనా ధ్యానంలో సాధకులు సమాధి స్థితిని, తద్వారా కలిగే చిత్తానందకర స్థితిని పూర్తి స్పృహ (Consciousness) లో వుండే అనుభవిస్తారు. నడుస్తూన్న వర్తమాన క్షణం లోనే ఆ స్థితిని అనుభవిస్తారు
  • విపశ్యనా ధ్యానం వ్యక్తిలోని ప్రజ్ఞను జాగృతం చేస్తుంది.
  • విపశ్యనా ధ్యానంలో వ్యక్తి శీల నియమ పాలన అత్యంత ఆవశ్యకం.

బుద్ధుడు కనుగొన్న ధ్యానం

మార్చు

గౌతమ బుద్ధుడు మహాభినిష్క్రమణ అనంతరం అలారకముని, ఆ తదనంతరం ఉద్దక రామపుత్త వంటి గురువుల వద్ద ధ్యాన విద్యలు అబ్యసించాడు. అలారకముని వద్ద అకిన్చంయాయతన సమాధి ప్రక్రియను నేర్చుకొన్నాడు. అదే విధంగా ఉద్దక రామపుత్త వద్ద నైవసంజ్ఞాన్యాసజ్ఞాయత అనే సమాధి ప్రక్రియను అభ్యసించాడు. అయితే వారు చెప్పిన ధ్యాన సాధనలో ప్రశాంతత చేకూరినప్పటికి, ధ్యానానంతరం అతని మనస్సులోని ఆలోచనలు ముప్పిరిగొని చికాకుపరిచేవి. ఫలితంగా సిద్ధార్ధుడు చాలా అశాంతికి లోనయ్యేవాడు. దీనిని తన గురువుల దృష్టికి తీసుకువెళ్ళాడు. అయితే అలాంటి ఆలోచనలను నిరోదించే మార్గం తమకు కూడా తెలీదని గురువులు తమ నిస్సహాయతను వ్యక్తం చేసారు. మాకు తెలిసిన ధ్యాన పద్ధతులు నేర్పాము అంతకుమించి మాకు తెలియదని చెప్పారు.దానితో సిద్దార్ధుడు ఆ గురువుల వద్ద శెలవు తీసుకొని తన మనసులో రేకేత్తుతున్న అశాంతిని సమూలంగా తుడిచిపెట్టే ధ్యాన మార్గం కొరకు అన్వేషిస్తూ మరింత కఠోర తపస్సు ఆచరించాడు. అయితే అది కూడా నిష్ప్రయోజనమని తెలుసుకొని చివరకు మధ్యేమార్గం అవలంబించాడు. చివరకు ఒక బోధివృక్షం క్రింద ధ్యానం చేసి తృష్ణను జయించి సంబోధిని పొందాడు. ఈ విధంగా చిట్ట చివరలో బుద్ధుడు చేసిన ధ్యానమే విపశ్యనా (సంస్కృత భాషలో) లేదా విపస్సనా (పాళీ భాషలో) ధ్యానంగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా బుద్ధుడు ఈ విపశ్యనా ధ్యానాన్ని సాధన చేసి దుఖాన్ని నిర్మూలించాడు. తృష్ణను జయించాడు.

కామ, క్రోధ, ఈర్ష్యాసూయలు వంటి వాటిని మన మనస్సు పై పొరాలనుండి తొలగిస్తాము. కాని ఆ చెడు గుణాలకు సంబంధించిన అవశేషాలు మన మనస్సు అంతరంగ పొరలలో అణిగి దాగి వుంటాయి. వాటిని కూకటివ్రేళ్ళతో తొలగిస్తేనే దుఖం పూర్తిగా నివృత్తి కాదు. అలా దుఖం పూర్తిగా నివారించబడితేనే కాని మనసుకు పరిపూర్ణ ప్రశాంతి లభించదు అని తెలుసుకొన్న బుద్ధుడు విపశ్యనా ధ్యానంతో అంతర్ముఖుడై తనలో తాను ప్రవేశించి తనను తాను దర్శించుకోగలిగాడు.[3] తనను కలవరపాటుకు గురిచేస్తున్న అశాంతికి కారణభూతమైన మనో వికారాలను కూకటి వ్రేళ్ళతో సహా పెకిలించివేసి దుఖనివృత్తిని సాధించాడు.

బుద్ధుడు దీనినే జీవనకళగా పేర్కొని అందరికీ బోధించాడు. ఏదో ఒక మతాన్ని గానీ, సిద్ధాంతాన్ని గానీ, ఆయన బోధించలేదు. లోపలి యథార్థాన్ని యథాతథంగా చూస్తూ ప్రకృతిని పరిశీలించమని మాత్రమే ఆయన ఆదేశించాడు.

భారతదేశంలో పునర్జీవనం

మార్చు

బుద్ధుని కాలంలో, ఉత్తర భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు విపశ్యనా సాధన ద్వారా బాధను బంధాల నుండి విముక్తులయ్యారు. కాలక్రమేణా మయన్మార్ (బర్మా), శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర తూర్పు ఆసియా దేశాలకు ఇది విస్తరించింది. అయితే బుద్ధుని అనంతరం ఐదు శతాబ్దాల తర్వాత, విపశ్యనా వారసత్వం భారతదేశం నుండి కనుమరుగైంది. ఈ ధ్యాన ఉపదేశంలోని స్వచ్ఛత కూడా తాను పుట్టిన దేశంలో కోల్పోయింది. అయితే మయన్మార్ దేశంలో అంకితభావం కలిగిన గురు శిష్య పరంపర ద్వారా విపశ్యనా వారసత్వం కాపాడబడింది.

ఈ విధంగా సుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా, అంకితభావంతో కూడిన ప్రాచీన గురు శిష్య పరంపర, పురాతనమైన విపశ్యనా ధ్యాన అభ్యాస మార్గాలను, ఘనమైన వారసత్వాన్ని ఒక తరం నుండి మరో తరానికి పరిశుద్ధతరీతిలో అందించగలిగింది. ప్రఖ్యాత బర్మీస్ విపశ్యనా గురువు సయ్యాగి యు బా ఖిన్ (Sayagyi U Ba Khin) (1899 - 1971) విపశ్యనా ధ్యానాన్ని అది జన్మించిన భారతదేశంలోకి పునర్జీవింప చేయాలని గట్టిగా కోరుకోవడంతో, ఆయన నుండి అనుమతి పొంది సత్యనారాయణ గోయెంకా భారతదేశంలో విపశ్యనా ధ్యానాన్ని పునర్జీవింప చేసారు.[4] గోయెంకా భారతదేశంలో స్థిరపడి 1969 నుండి విపశ్యనా బోధించడం ప్రారంభించారు. అప్పటి నుండి వారు తూర్పు, పాశ్చాత్య దేశాలలోని అన్ని జాతి మత భేదాలకతీతంగా వేలాదిమంది ప్రజలకు విపశ్యనాను బోధించారు.

బౌద్ధ, బౌద్దేతేర ధ్యానాల మధ్య గల తేడాలు

మార్చు

బౌద్దేతర ధ్యానం వ్యక్తీ చిత్తంలో కలిగే తృష్ణను తృప్తి పరిచేదిగా వుంటే విపశ్యనా ధ్యానం ఆ చిత్తంలో కలిగే తృష్ణను నిర్మూలించే విధంగా వుంటుంది

మార్చు

సరియైన ధ్యాన పద్ధతులలో అభ్యాసం చేసిన సాధకుడు సమాధి స్థితిని పొందగలుగుతాడు. ఈ సమాధి స్థితిలో సాధకుడు ప్రశాంతమైన పరమానందాన్ని పొందుతాడు. సమాధి స్థితి అంటే చిత్తానందమైన ప్రీతికర స్థితి. అయితే బౌద్ధేతర ధ్యాన పద్ధతులలో సాధకుడికి ఈ స్థితిలో తన పట్ల తనకు ఏ మాత్రం ఎరుక వుండదు. ఆ సమాధి స్థితిలో కలుగుతున్న పరమానందానికి అతని చిత్తంలో (మనస్సులో) ఆ స్థితి పట్ల ప్రీతి జనిస్తుంది. అంటే పరమానంద స్థితి పట్ల చిత్తంలో తృప్తి జనిస్తుంది. అంటే పరమానంద స్థితి పట్ల చిత్తంలో జనించే తృష్ణను తృప్తి పరచడానికి ఆ సాధకుడి యొక్క అంతర మనస్సు తగు ప్రయత్నాలు చేస్తూ వుంటుంది. అయితే బౌద్ధ ధ్యాన పద్ధతులలో సాధకునిలో కలిగే పరమానంద స్థితిని పొందడానికి అదనంగా అతని చిత్తంలో ఉత్పన్నమయ్యే తృష్ణను కనిపెట్టి, ఆ తృష్ణను పెరికివేసే అభ్యాసాలు కూడా చేస్తారు.

అంటే బౌద్ధేతర ధ్యాన పద్ధతులలో వ్యక్తీ మనస్సు లోపలి పొరలలో కలిగే తృష్ణను తృప్తి పరిచే అభ్యాసాలుంటాయి. దీనికి విరుద్ధంగా విపశ్యనా ధ్యాన పద్ధతులలో ఆ తృష్ణను కనిపెట్టి దానిని పూర్తిగా పెరికివేసే అభ్యాసనలు వుంటాయి.

బౌద్ధేతర ధ్యాన పద్ధతులలో తనకు నచ్చిన దాని పట్ల ఇంకా ఇంకా కావాలనే రాగాపూరిత తృష్ణను, తనకు నచ్చని దాని పట్ల వద్దంటే వద్దని నిరాకరించే ద్వేషపూరిత తృష్ణను వాటి ఉత్పన్నకారకమైన చిత్తంతోనే సాధన చేయడం జరుగుతుంది. అంటే బౌద్ధేతర ధ్యానాలలో చిత్తంలోని రాగద్వేషాలను నిర్మూలించే ధ్యాన అభ్యాసాలు చేయడం జరగదు. విపశ్యనా ధ్యానం (బౌద్ధ ధ్యానం) లో మాత్రం రాగ ద్వేషాలను సమూలంగా పెకిలించే ధ్యాన అభ్యాసాలుంటాయి.

బౌద్దేతర ధ్యానంలో ఎరుకలేని కాలరహిత సమాధి స్థితిని పొందితే, విపశ్యనా ధ్యానంలో వర్తమాన క్షణాన్ని ఎరుకతో గుర్తిస్తూ సమాధి స్థితిని పొందుతారు

మార్చు

సమాధి స్థితి అంటే త్రికాలరహిత స్థితిగా భావించవచ్చు. సమాధి స్థితిలో సాధకుని చిత్తం భూత, భవిష్యత్, వర్తమాన కాలాలనుంది విముక్తి చెందుతుంది. సాధారణంగా ప్రతీ వ్యక్తి త్రికాలాలలో ఏదో ఒక కాల స్థితిలో జీవిస్తుంటాడు. అయితే సమాధి స్థితిలో మాత్రం కాలరహిత స్థితిని అంటే కాలం తెలియని స్థితిలో ఉంటాడు. ఈ సమాధి స్థితిలోనే సాధకుడు ప్రశాంతమైన పరమానందాన్ని పొందుతాడు. ఈ విధంగా ధ్యానంలో పరిపూర్ణంగా నిమగ్నుడైన సాధకుని యొక్క మనసు తనలో వున్న ఆలోచనలు పూర్తిగా నిరుద్దమై, చిత్తానందంతో సమాధి స్థితిని పొందే ప్రయత్నం చేస్తుంది. అయితే బౌద్ధేతర ధ్యాన మార్గంలో పొందిన సమాధి స్థితిలో సాధకుడు పూర్తిగా ఎరుకను కోల్పోతాడు. దీనికి విరుద్ధంగా విపశ్యనా ధ్యాన మార్గంలో పొందిన సమాధి స్థితిలో సాధకుడు ఎప్పటికప్పుడు గడుస్తూ వున్న వర్తమాన క్షణాన్ని ఎరుకతో గుర్తిస్తూ ఉంటాడు.

సమాధి అవస్థను, చిత్తానందకర స్థితిని ఏ రకమైన ధ్యాన మార్గంలోనైనా పొందవచ్చు. అయితే బౌద్ధేతర ధ్యానంలో - పూర్తి ఎరుకను కోల్పోతూ దానిని అనుభవిస్తే, విపశ్యనా ధ్యానంలో - పూర్తి ఎరుకలో వుండే ఆ స్థితిని అనుభవిస్తారు. మరోవిధంగా చెప్పాలంటే బౌద్ధేతర ధ్యానంలో పొందే సమాధి స్థితి త్రికాలరహితంగా (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఏ మాత్రం తెలియని స్థితి) వుంటే, విపశ్యనా ధ్యానంలో పొందే సమాధి స్థితి వర్తమాన క్షణాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుంటుంది. బౌద్ధేతర ధ్యానంలో సాధకుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఏ మాత్రం తెలియని స్థితిలో సమాధి స్థితిని పొందితే, విపశ్యనా ధ్యానంలో సాధకుడు భూత, భవిష్యత్ కాలాలను విడనాడి వర్తమాన కాల స్థితిలోనే సమాధి స్థితిని అనుభవిస్తాడు.

ధ్యాన వస్తువు

మార్చు

బౌద్ధేతర ధ్యానంలో ధ్యానం చేసేటప్పుడు సాధకులు ఎరుకలో లేని స్థితి (Unconsciousness state) లో ధ్యానం చేస్తారు. ధ్యానం చేసేటప్పుడు దేవుని రూపం, నామం, మంత్రం తదితర రూప శబ్దాదుల వస్తువు పైన మనస్సును లగ్నం చేస్టారు. ఇది చాలా సులభమైన పద్ధతి. అంతే గాక ఈ పద్ధతిలో మనస్సు చాలా సులువుగా ఏకాగ్రతకు (Concentration) లోనవుతుంది.

బౌద్ధ ధ్యానంలో ధ్యానం చేసేటప్పుడు సాధకులు పూర్తి స్పృహా (Consciousness) లో వుండి, అప్రమత్తుడై ఎరుకలో ధ్యానం చేస్తారు. అలా ధ్యానం చేసేటప్పుడు మనస్సును రూప, శబ్దాదుల వస్తువు పైన కాకుండా శ్వాస పైనే లగ్నం చేస్తారు. మనసు పరిపరి విధాల పక్కకు మళ్ళుతున్నా, అలా దారి తప్పుతున్న మనసును తీసుకువచ్చి మళ్ళీ శ్వాసను గమనించే పనిపై లగ్నం చేస్తారు. అంటే బౌద్ధంలో శ్వాసను ధ్యాన వస్తువుగా చేసుకొని ధ్యానం చేస్తారు. కనుక విపశ్యనా ధ్యానం కొంచెం కష్టతరమైనది.

ఇతర ధ్యానాల కన్నా విపశ్యనా ధ్యానం లోతైనది. గంభీరమైనది. కష్టతరమైనది కూడా

మార్చు

ఇతర ధ్యానాలలో సమాధి స్థితిలో చిత్తంలో కలిగే పరమానందం తాత్కాలికమైంది. ఆ ధ్యానంతరం అశాంతి, క్రోధం లాంటి మనోవికారాలు మామూలుగానే వుండి తిరిగి దుఃఖావహ స్థితి లోనికి నెట్టివేస్తాయి. దీనిని అధిగమించే ప్రయత్నంలో ‘ఇతర ధ్యానాలలో ఏ సమాధి స్థితిని అంతిమ ఆనంద స్థితిగా భావిస్తాయో ఆ స్థితిని’ విపశ్యనా ధ్యానంలో ప్రాథమిక స్థితిగా భావించి మరింతగా లోతుగా సాధన చేస్తారు. సంపూర్ణ దుఃఖ నివారణ లక్ష్యంగా కొనసాగే విపశ్యనా ధ్యానంలో శీల-సమాధి-ప్రజ్ఞల అభ్యాసం చేయవలసి వుండటంతో ఇది ఇతర ధ్యానాల కన్నా లోతైనది. మరింత కష్టతరమైనది.

బౌద్దేతర ధ్యానాలలో వ్యక్తి శీల పాలన ఐచ్చికం కాగా విపశ్యనా ధ్యానంలో శీల నియమాలు ఆవశ్యక బందం

మార్చు

బౌద్ధేతర ధ్యానాలలో శీల పాలన పై తప్పని సరి నియమాలుండవు. కాని విపశ్యనా ధ్యానంలో శీల నియమ పాలన అత్యంత ఆవశ్యక బందంగా వుంటుంది. శీల బంధనాలు వీడిన వ్యక్తి విపశ్యనకు అర్హుడు కాదు. వ్యక్తి నైతిక నియమాలు, శీలం పాటించకుండా, తన చిత్తాన్ని శీలవంతం చేయకుండా, దుశ్శీల చిత్తంతోనే ధ్యానం చేస్తే, ఆ ధ్యానంలో పొందే చిత్తానందం ఎంతోసేపు నిలవదు. ఆ ధ్యాననతరం కొద్ది సమయంలోనే చిత్తంలో దాగి వున్న మనోవికారాలు తిరిగి పైకి వచ్చి, ధ్యానం ద్వారా పొందిన చిత్తానందాన్ని చెల్లా చెదురు చేస్తాయి. దుర్గందంపై చల్లిన పన్నీరు తెచ్చే పరిమళం ఎలా తాత్కాలికమో, అదే విధంగా దుశ్శీల చిత్తంతో ధ్యానంలో పొందిన పరమానందం కూడా తాత్కాలికమైనది. అందువలనే విపశ్యనా ధ్యానంలో వ్యక్తి శీల నియమపాలన అత్యంత ఆవశ్యక బందంగా చేయబడింది.

బౌద్దేతర ధ్యానం వ్యక్తిలోని ప్రజ్ఞను నిద్రపుచ్చితే, బౌద్ధ ధ్యానం ప్రజ్ఞను మేల్కొలుపుతుంది

మార్చు

వ్యక్తిలోని అంతర్ ప్రజ్ఞ చైతన్యపూరితమయితే, అది మనస్సు అట్టడుగుపొరలో నిక్షిప్తమైన సూక్ష్మాతి సూక్ష్మమైన దుఃఖ కారకాలను సైతం వెలుపలికి తీసి నిర్మూలిస్తుంది. తద్వారా దుఖాన్ని పరిపూర్ణంగా నివారించి, అశాంతిని సమూలంగా తుడిచిపెడుతుంది. అయితే బౌద్ధేతర ధ్యానం వ్యక్తిలోని ప్రజ్ఞను మేల్కొలపదు. అందుకే బౌద్ధేతర ధ్యానంలో చేకూరే కాలరహిత సమాధి స్థితి అపరిమితమైన చిత్తానందాన్ని కలిగించినప్పటికి అది తాత్కాలికమైన ఆనందమే కాని శాశ్వతానందం కాదు. ఈ రకమైన సమాధి వ్యక్తి లోని ప్రజ్ఞను నిద్రావస్తలోనే ఉంచుతుంది.

బౌద్ధ ధ్యానం వ్యక్తిలోని ప్రజ్ఞను మేల్కొలిపి దానిని చైతన్యవంతం చేస్తుంది. అందుకే బౌద్ధ ధ్యానంలో సాధకుడు ప్రజ్ఞను చైతన్యం చేస్తాడు. తద్వారా చైతన్యపూరితమైన ఆ అంతర్ ప్రజ్ఞను ఆధారంగా చేసుకొని తన మనోదేహంలో స్వేచ్ఛావిహారం చేసి మనసు లోపలి పొరలలో దాగివున్న దుఃఖ శకలాలను కనిపెట్టి మరీ బయటకు పెరికివేస్తాడు. అందువలనే బౌద్ధ ధ్యానంలో తాత్కాలిక ఆనందం కలిగించే కాలరహిత సమాధి స్థితిని అభ్యాసం చేయరు.

విపశ్యనా ధ్యానంలో శారీరక మనస్సు రోగాలు రెండూ అదుపులోకి వస్తాయి

మార్చు

ఇతర ధ్యాన పద్ధతులలో సాధన చేసేవారికి మనసు రోగాలు నయం కావటం కంటే శారీరక రోగాలే తొందరగా అదుపులోకి వస్తాయి. విపశ్యనా ధ్యానంలో శారీరక మనస్సు రోగాలు రెండూ అదుపులోకి వస్తాయి. విపశ్యనా ధ్యాన లక్షణం సంపూర్ణ దుఃఖ నివారణ. కేవలం శారీరిక వ్యాధులను నయం చేయటం దీని లక్ష్యం కాదు. అయితే మనస్సు నిర్మలం కావటం వల్ల ఇతర ఫలితాలతో పాటు శారీరిక మానసిక బాధలు కూడా ఉపశమిస్తాయి. ఈ విద్య సమస్త దుఃఖాలకు కారణాలైన రాగ, ద్వేష, మోహాలను నిర్మూలం చేసే జీవనకళ.[5] విపశ్యన ధ్యానం చాల మందికి ప్రయోజనకారి అయినప్పటికీ, ఇది వైద్య లేదా మానసిక చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

అభ్యాసాలు - సాధనలు

మార్చు

విపశ్యనా, బుద్ధుడు అభివృద్ధి చేసిన ఒక పద్ధతి అయినప్పటికీ దీని ఆచరణ బౌద్ధులకు మాత్రమే పరిమితం కాలేదు. మానవులందరూ ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటారు. వాటిని నిర్మూలించే పద్ధతి కూడా సార్వజనీకం అనే సూత్రం మీద ఆధార పడిఉంది.[6] అందువలన దీనికి ఏ మతంతో గాని వర్గంతో గాని నిమిత్తంలేదు. జాతి, మత, కుల, వర్గ, భాషా భేదాలు లేకుండా ఎవరైనా విపశ్యనను సాధనచేసి సమంగా ప్రయోజనం పొందవచ్చు
విపశ్యనా ధ్యానంలో 4 ధ్యాన అభ్యసాలుంటాయి.[7]అవి

  1. కాయానుపస్సన
  2. వేదనాను పస్సన
  3. చిత్తాను పస్సన
  4. ధర్మాను పస్సన

ఈ నాలుగు అభ్యాసాలలోను ప్రతీ ఒక్క దానిలో అనేకానేక ఉపసాధనాలుంటాయి. మనిషిలోని దుఖాన్ని సమూలంగా నిర్మూలించడం అన్న ఏకైక లక్ష్యంను ఆధారంగా చేసుకొనే ఈ ధ్యాన అభ్యాసాలను సాధన చేస్తారు. దుఖం ఏ ఏ రూపాలలో, ఏ ఏ సందర్భాలలో ఉత్పన్నమవుతుందో తెలుసుకొని ఆ దుఃఖ ఉత్పత్తిని తొలగించే ఉద్దేశంతోనే ఈ అభ్యాసనలు రూపొందించబడ్డాయి.

ప్రపంచ విపశ్యనా పగోడా

మార్చు
 
ప్రపంచ విపశ్యనా పగోడా (Global Vipassana Pagoda)

ప్రపంచ విపశ్యనా పగోడా (Global Vipassana Pagoda) అనే ధ్యాన మందిరం ముంబై నగర సమీపంలో అరేబియన్ సముద్రానికి గొరై (Gorai Creek) క్రీక్ ల మధ్యనగల ద్వీపకల్పంలో 2009 లో నిర్మించబడింది. ఒకప్పుడు భారతదేశంలో పుట్టి కనుమరుగైన విపశ్యనాను తిరిగి భారతదేశంలో పునర్జీవింప చేయడానికి ఉపకరించిన సుప్రసిద్ధ బర్మీస్ విపశ్యనా గురువు సయ్యాగి యు బా ఖిన్ (Sayagyi U Ba Khin) కు కృతజ్ఞతాపూర్వకంగా ఈ పగోడా నిర్మించబడింది.[8] ఈ పగోడా శాంతి, సామరస్యాలకు ఒక స్మారక చిహ్నంగా ఉంది.

రిఫరెన్సులు

మార్చు
  • ధ్యానం అంటే ఏమిటి-దానిని ఎలా చేయాలి - శ్రీ కృష్ణార్జున భోధి - మిసిమి మాస పత్రిక మే, 2009
  • విపశ్యన ధ్యానం [1]

మూలాలు

మార్చు
  1. "విపశ్యన ధ్యానం". Vipassana Meditation. Retrieved 2017-06-18.
  2. "విపశ్యన ధ్యానము". Vipassana Meditation. Retrieved 2017-06-18.
  3. పొనుగోటి, కృష్ణా రెడ్డి. బుద్ధుడు-బౌద్దధర్మం (2014 ed.). p. 93.
  4. "Vipassana Research Institute". Retrieved 2017-06-18.
  5. "Vipassana Meditation". Retrieved 2017-06-18.
  6. "Vipassana Meditation". Retrieved 2017-06-18.
  7. శ్రీ కృష్ణార్జున భోధి. "ధ్యానం అంటే ఏమిటి-దానిని ఎలా చేయాలి". మిసిమి (మే, 2009): 41.
  8. http://www.vridhamma.org/en2005-08
"https://te.wikipedia.org/w/index.php?title=విపశ్యనా&oldid=3850060" నుండి వెలికితీశారు