వివాహ భోజనంబు వింతైన వంటకంబు (పాట)

తెలుగు సినిమా పాట

వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనేది 1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం మాయాబజార్లో పాట.

"వివాహ భోజనంబు వింతైన వంటకంబు"
("vivaha bhojanambu..vintainavantakambu...")
మాయాబజార్ పోస్టరు
రచయితపింగళి నాగేంద్రరావు
సంగీతంఘంటసాల వెంకటేశ్వరరావు
సాహిత్యంపింగళి నాగేంద్రరావు
ప్రచురణమాయాబజార్ (1957)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిమాధవపెద్ది సత్యం
రికార్డు చేసినవారు (స్టుడియో)మార్కస్ బార్ట్లే
చిత్రంలో ప్రదర్శించినవారుఎస్వీ రంగారావు

విశేషాలు

మార్చు

ఈ పాటను పింగళి నాగేంద్రరావు గారు మాయాబజార్ (1957) సినిమా కోసం రచించారు. ఈ పాటను మాధవపెద్ది సత్యం పాడగా, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని అందించారు. చాయాగ్రాయకుడు మార్కస్ బార్ట్లే సినిమాలో ఈ పాటను వంటశాలలో ఎస్వీ రంగారావు పై చిత్రీకరించారు.

ఈ పాటలో తెలుగువారి పెళ్ళి భోజనాలలోని వంటకాలను పేర్కొన్నారు. గారెలు, బూరెలు, అరిశెలు, లడ్డులు, అప్పడాలు, ధప్పడాలు, పాయసాలు మున్నగు వంటలను చూపించారు కూడా.

సాహిత్యం

మార్చు

పింగళి తన రచనలో షడ్రసోపేతమైన పెళ్ళి వంట ఎలా వుంటుందో బూరెలు, గారెలు, అప్పళాలు, దప్పళాలు, పాయసాలు, లడ్లు, జిలేబీలు, అరిసెలు ఒకటేమిటి సమస్తం వడ్డించాడు మనకి ఎప్పటికీ మరచి పోకుండా. అంతే కాకుండా పద ప్రయోగం చూస్తే మూడు చరణాలలో చక్కని ప్రాస కనపడుతుంది. ఎలా అంటే - గారెలల్ల, బూరెలిల్ల, అరిసెలుల్ల, నాకె చెల్ల; లందు, ఇందు, ముందు, విందు; అప్పళాలు, దప్పళాలు, పాయసాలు, చాలు. బలేగా వుంది గదా తెలుగు సొగసు. భోజనంబు, వంటకంబు అనే పదాలు ఇప్పటి వ్యవహారిక భాషలోని భోజనము, వంటకము అనేవాటికి సమానమైన ప్రాచీన రూపాలు. ఇందులో ముకు బదులు ంబు చేరినది. ఈ చిత్రానికి రంగులు అద్దితే పిండివంటల గురించి ఇంకా చెప్పాలా! ఈ సన్నివేశానికి యస్వీఆర్ అద్భుత నటన, మార్కస్ బార్ట్‌లీ ట్రిక్ ఫోటోగ్రఫీ అపూర్వం. పాత్రకు తగిన నవ్వును పాటలో జోడించి మాధవపెద్ది ఈ పాటను అజరామరం చేశారు. ఇది కలం-గళం-స్వరం సమ్మిళితం చేసి నట, దర్శక, ఛాయా చిత్ర ముద్రణకు విజయ సంతకంగా నిలిచింది.

మాతృక

మార్చు

వివాహభోజనంబు’ పాటకు మాతృక:The Laughing Policeman – Charles Jolly (ఇంగ్లీష్ పాట). ఈ స్ఫూర్తితో 1939లో వచ్చిన మాయాబజార్ (శశిరేఖ పరిణయం) చిత్రంలోను, సురభి వారి మాయాబజార్ నాటకంలోను- ఈ పాటను సన్నివేశానికి అనుగుణంగా కూర్చి వాడుకున్నారు. జనాదరణ పొందిన ఈ పాటను విజయా వారు యధాతధంగా అజరామరంగా తెరకెక్కించారు.[1]

సినిమా పాట

మార్చు

హహ్హహహ్హహహ్హహా.. వివాహభోజనంబు అహ్హహ ఆ.

పల్లవి: వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హోహ్హొ నాకె ముందు | వివాహ |
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ

చరణం: ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల | ఔరౌర |
ఓహ్హోరె అరెసెలుల్ల హహహ్హహహ్హహా
ఇయెల్ల నాకె చెల్ల
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహోహ్హొ నాకె ముందు
అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహహ్హ అహహ్హహహ్హహ

తమిళంలో

మార్చు

ఈ పాటను తెలుగు వెర్షన్ లో మాధవపెద్ది సత్యం, తమిళ వెర్షన్లో తిరుచ్చి లోకనాథన్ పాడేరు. ట్యూన్ రెండు భాషలలోనూ ఒకటే. సాహిత్యం కూడా అంత నోరు తిరగనంతదేం కాదు. ఐతే తమిళ గీతాన్ని పాడిన తిరుచ్చి లోకనాథన్ గారికి గొంతు పచ్చి పుండై రెండు మూడు రోజుల దాకా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందట. మన మాధవపెద్ది సత్యం గారు మాత్రం ఆ తెలుగు వెర్షన్ పాటను తను చనిపోయే దాకా స్టేజ్ ప్రోగ్రాం లలో కూడా పాడుతూ వుండేవారు.

మార్కస్‌ బార్ట్లే మాయాజాలం

మార్చు

మార్కస్‌ బార్ట్లే ఆ రోజుల్లో ఎన్నో విజువల్‌ వండర్స్‌ చూపించాడు. ముఖ్యంగా ఘటోత్కచుడు ఎపిసోడ్‌ ఇప్పటికీ వండర్‌. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ లేవు. గ్రాఫిక్స్‌లేవు. కేవలం కెమేరాతో ట్రిక్‌వర్క్‌ చేసి ప్రచంచ తెలుగు ప్రేక్షకులందర్నీ అబ్బురపరిచాడు. బార్ల్టే పనితనానికి ఒక్క 'వివాహ భోజనంబు' పాట చాలు.[2]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు