విశ్రవసుడు
విశ్రవసుడు పులస్త్యుని కుమారుడు. రామాయణంలో పేర్కొన్న ఋషి. ఈయన మంచి పండితుడిగా పేరు గాంచాడు. తపస్సు చేసి అనేక శక్తులు సంపాదించి ఋషులలో మంచి పేరు సంపాదించాడు. రామాయణంలో ప్రతినాయకుడైన రావణుడికి తండ్రి.[1]
జీవిత విశేషాలు
మార్చువిశ్రవసుని పుట్టుక గురించి రామాయణంలో ఉంది. ఒకసారి పులస్త్యుడు మేరు పర్వత ప్రాంతంలో ఉన్న తృణబిందుడు ముని ఆశ్రమంలో నియమ నిష్ఠలతో కూడిన తపస్య జీవితం సాగించేవాడు. విశ్రవసు ఏకాంతంలో ఎంతో శ్రద్ధగా తపమాచరించుచున్నప్పటికీ ఇతర ఋషుల కూతుర్లు తమ నృత్య వినోదన గానములతో అతని ప్రశాంతతకు భంగం కలిగించేవారు. పులస్త్యుడిని వీరి చర్యలు నచ్చక వారిని విశ్రవసు నుంచి దూరంగా ఉంచడానికి అతని దృష్టి తమ మీద పడిన వారు వెంటనే గర్భం దాలుస్తారు అని నియమం విధిస్తాడు. ఆ కఠిన నియమం గురించి భయపడ్డ యువతులు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అప్పటి దాకా అక్కడ లేని, తృణబిందు కుమార్తె అయిన మానిని[2] అప్పుడే తన స్నేహితుల్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి విశ్రవసు దృష్టిలో పడుతుంది. వెంటనే తాను గర్భవతి అయిన విషయం గమనించి పరుగున వెళ్ళి తన తండ్రికి ఆ విషయం గురించి చెబుతుంది. అప్పుడు తృణబిందుడు పులస్త్యుని తన కుమార్తెను వివాహం చేసుకోమని అభ్యర్థిస్తాడు. అందుకు అతను అంగీకరించి ఆమెను వివాహం చేసుకుని ఆ ఆశ్రమంలోనే జీవనం సాగిస్తుంటాడు. తన భార్య యొక్క ఉత్తమ ప్రవర్తన గురించి సంతృప్తి చెందిన పులస్త్యుడు తమకు పుట్టే సంతానం తమ ఉత్తమ గుణాలను పొందుతాడని, అతనికి విశ్రవసు అని పేరు పెడుదామని చెబుతాడు.[3]
విశ్రవసు పెరిగి పెద్దవాడై గొప్ప ఋషి అవుతాడు. వేదాధ్యయనం చేస్తూ ఐహిక సుఖాల నుంచి దూరంగా ఉంటాడు. భరద్వాజ ముని విశ్రవసుని గొప్పతనం గుర్తించి అతనికి తన కుమార్తె అయిన ఇలబిలను ఇచ్చి వివాహం చేస్తాడు. ఆమె ద్వారా విశ్రవసునికి సంపదలకు అధిపతి అయిన వైశ్రవణుడు లేదా కుబేరుడు పుట్టాడు. కుబేరుడికి లంకా రాజ్యాన్ని ఏలుకోమని బ్రహ్మ వరం ఇచ్చాడు.[3] రాక్షసుడైన సుమాలి తన కూతురు కైకసిని విశ్రవనుని భర్తగా పొందమనీ, అప్పుడు ఆమెకు కుబేరుని తలదన్నే పుత్రులను పొందవచ్చనీ చెబుతాడు. విశ్రవసుడు యజ్ఞం చేస్తుండగా ఆయనను సమీపించిన కైకసి తన తండ్రి కోరికను ఆయన ముందుంచుతుంది. సర్వజ్ఞుడైన విశ్రవసుడు జరగబోయే విషయం ముందుగానే గ్రహించి, తాము వివాహం చేసుకుంటే పుట్టబోయే సంతానం ప్రజలను పీడించే రాక్షసులు అవుతారని చెబుతాడు. కానీ తమ చివరి సంతానం మాత్రమే వారి గుణములను పొందగలడని చెబుతాడు. విశ్రవసుడి గొప్పతనాన్ని వదులుకోలేక, తండ్రి కోరికను కాదనలేక, కైకసి ఆయన చెప్పినట్లే కానిమ్మని కోరుతుంది. అలా ఆమెకు రాక్షస ప్రవృత్తి కలిగిన రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, రాక్షసుడైనా ధర్మ ప్రవర్తన కలిగిన విభీషణుడు సంతానంగా జన్మించారు.[4]
విశ్రవసుడు రావణాసురునికి తపస్సు చేయడం, యజ్ఞాలు నిర్వహించడం, వేదాలు మొదలైనవి నేర్పాడు.[5] రావణాసురుడు కుబేరుని చెందిన లంకను స్వాధీనం చేసుకొమ్మన్నప్పుడు, వారిద్దరి మధ్య గొడవలు లేకుండా ఉండటం కోసం తన సవతి తమ్ముని కోసం దానిని విడిచిపెట్టమని కోరగా కుబేరుడు లంకను విడిచిపెట్టి కైలాస శిఖరాలు చేరి లోకపాలుడిగా మారాడు.[6]
విశ్రవసుని మూడవ భార్య కైకసి చెల్లెలు అగు పుష్పోత్కట. ఆమె యందు ఆయనకు మహోదరమహాపార్శ్వాదులు జన్మించారు. నాల్గవభార్య కైకసి రెండవచెల్లెలు అగు రాకా. ఆమె ఖర దూషణ త్రిశిరులను కన్నది.[7]
మూలాలు
మార్చు- ↑ www.wisdomlib.org (2019-01-28). "Story of Viśravas". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
- ↑ www.wisdomlib.org (2015-08-01). "Trinabindu, Tṛṇabindu, Trina-bindu: 8 definitions". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
- ↑ 3.0 3.1 www.wisdomlib.org (2020-09-27). "The Birth of Vishravas [Chapter 2]". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
- ↑ www.wisdomlib.org (2020-09-27). "The Birth of Dashagriva and his Brothers [Chapter 9]". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-10-28.
- ↑ Pattanaik, Devdutt (2017-10-09). Four Brides for Four Brothers: (Penguin Petit) (in ఇంగ్లీష్). Penguin Random House India Private Limited. p. 55. ISBN 978-93-87326-18-7.
- ↑ Buck, William (2021-06-08). Ramayana (in ఇంగ్లీష్). Univ of California Press. p. 26. ISBN 978-0-520-38338-8.
- ↑ పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879