వెంకటరామన్ రామకృష్ణన్

(వెంకి రామకృష్ణన్ నుండి దారిమార్పు చెందింది)

వెంకి రామకృష్ణన్ లేక వెంకటరామన్ రామకృష్ణన్ ప్రఖ్యాత నోబెల్ పురస్కారము పొందిన జీవరసాయన శాస్త్రజ్ఞుడు. తమిళనాడు లోని చిదంబరంలో 1952 సంవత్సరములో జన్మించాడు.[1] తండ్రి ఉద్యోగరీత్యా గుజరాత్ కు వెళ్ళడంతో బాల్యమంతా, విద్యాభ్యాసమంతా బరోడాలో గడిచింది. మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయంలో బీయస్సీ ఫిజిక్స్ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి అక్కడే స్థిరపడ్డాడు; రైబోసోముల రూపము ధర్మములపై చేసిన పరిశోధనలకు గాను రసాయన శాస్త్రములో 2009 నోబెల్ పురస్కారము లభించింది[2].2010లో భారత ప్రభుత్వం వీరిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

వెంకటరామన్ రామకృష్ణన్
జననం1952 (age 71–72)
చిదంబరం, తమిళనాడు, భారతదేశం
నివాసంయునైటెడ్ కింగ్ డామ్
పౌరసత్వంయునైటైడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డం
రంగములుజీవ రసాయన శాస్త్రము, జీవ భౌతిక శాస్త్రము
వృత్తిసంస్థలు
చదువుకున్న సంస్థలు
ప్రసిద్ధిStructure and function of the ribosome; macromolecular crystallography
ముఖ్యమైన పురస్కారాలుLouis-Jeantet Prize for Medicine (2007)
Nobel Prize in Chemistry (2009)
Padma Vibhushan (2010)

తొలి రోజులు

మార్చు

వారి స్వస్థలం తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరం. తండ్రి ఉద్యోగరీత్యా మూడు సంవత్సరముల వయసులో గుజరాత్ రాష్ట్రములోని బరోడా (వడోదర) వెళ్ళాడు.అప్పట్లో బరోడా పాఠశాలలన్నింటిలో గుజరాతీ మాధ్యమమే ఉండేది. ఆ ఊరు మొత్తమ్మీదా ఒకే ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉండేది. అది క్రైస్తవ సన్యాసుల ఆధ్వర్యంలో నడుస్తుండేది. ఆయన మూడో తరగతిలో ఉండగా దాన్ని బాలికల పాఠశాలగా మార్చివేశారు. అప్పటికే ఆ బళ్ళో చదువుకుంటున్న మగపిల్లలను మాత్రం పై తరగతులకు అనుమతించారు. తండ్రి వెంకటరామన్ బరోడా లోని మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయములో జీవ రసాయన శాస్త్రం బోధించే ఆచార్యుడు. పాఠశాల చదువు బరోడా లోనే సాగింది. 1960-61 లో ఆస్ట్రేలియా లోని అడిలైడ్లో చదివాడు. 1971 లో మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయము నుండి భౌతికశాస్త్రములో B.Sc పట్టా పొందాడు. తదుపరి అమెరికా వెళ్ళి ఒహియో విశ్వవిద్యాలయము నుండి 1976 లో భౌతికశాస్త్ర పరిశోధనలకు Ph.D పట్టా పొందాడు. మరలా జీవశాస్త్రము అభ్యసించడానికి విద్యార్థిగా సాన్ డియగో లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరాడు.[3]

చిన్నప్పుడు ఆయనకు సైన్స్ మీద ఆసక్తి కలగడానికి కారణం గణితం, భౌతిక శాస్త్రం బోధించే టి.సి. పటేల్ అనే ఉపాధ్యాయుడు.తండ్రికి ఈయన వైద్య విద్య అభ్యసించాలని కోరికగా ఉండేది. తండ్రి కోరిక మేరకు బరోడా వైద్య కళాశాలలో సీటు కూడా సంపాదించాడు. కానీ రామకృష్ణన్ కి మాత్రం భౌతిక శాస్త్రం మీద ఆసక్తి ఉండేది. అదే సమయంలో నేషనల్ టాలెంట్ టెస్ట్ జరుగుతోంది. అప్పుడు తండ్రితో ఆ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ నిరూపించుకుని ఉపకారవేతనం పొందగలిగితే వైద్యవిద్య చదవమని బలవంతం చేయకూడదని మాట తీసుకున్నాడు. అన్నట్లే ఉపకారవేతనం దక్కడంతో ఆయన ఇంకేమీ మాట్లాడలేదు. మెడికల్ కళాశాల నుంచి భౌతిక శాస్త్ర విభాగానికి మార్చుకున్నాడు.

గమనము

మార్చు

భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నపుడు సైంటిఫిక్ అమెరికన్ అనే మ్యాగజీన్ చదువుతుండేవాడు. సైన్సుకు సంబంధించిన అద్భుతమైన ఆవిష్కరణల గురించి ఆ పత్రికలో వ్యాసాలు వచ్చేవి. వాటిలో ఎక్కువ భాగం జీవ శాస్త్రానికి సంబంధించినవే ఉండేవి. అప్పుడే ఆయన దృష్టి భౌతిక శాస్త్రం నుంచి జీవశాస్త్రం మీదకు మళ్ళింది. అందులోనే చదువు, అధ్యయనం కొనసాగించాడు. రైబోజోముల అంశంపై పరిశోధనలకు పురికొల్పిన ప్రఖ్యాత జీవరసాయన శాస్త్రవేత్త పీటర్ మూర్ ను జీవితంలో తనను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తిగా చెబుతాడు రామకృష్ణన్.[4]

Ph.D పట్టా పొందిన తరువాత పీటర్ మూర్ వద్దనే రైబోసోములపై పరిశోధన మొదలుపెట్టాడు. కొంతకాలము బ్రూక్ హావెన్ పరిశోధనాశాలలో శాస్త్రవేత్తగా పనిచేసి 1995లో ఉటా(యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్) విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా చేరాడు. 1999లో అమెరికా వదలి ఇంగ్లాండ్ లోని ప్రసిద్ధ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములోని వైద్య పరిశోధనా సంస్థానములో చేరాడు.

1999లో 5.5 ఆంగ్సట్రాం పరిమితి గల రైబోసోం 30S ఉపఖండిక రూపురేఖలు ప్రచురించాడు. 2000లో రైబోసోం 30S ఉపఖండిక అణు రూపము పూర్తి స్థాయిలో వెలువరించాడు. యాంటిబయాటిక్ రసాయనాలు రైబోసోంతో జతకూడు స్థానములు పసిగట్టాడు. అటుపిమ్మట కొనసాగిన పరిశోధనల వల్ల రైబోసోం ఉపకరణముగా మాంసకృత్తుల తయారీకి సంబంధించిన సంపూర్ణ యంత్రాంగము అర్ధము చేసుకును వీలు చిక్కింది. గత కొద్ది సంవత్సరాల పరిశోధనల వల్ల రైబోసోంతో tRNA, mRNA జతకూడు స్థానములు, రూపురేఖలు తెలిశాయి.

పురస్కారాలు

మార్చు
  • బ్రిటిష్ రాజ్య సంఘ సభ్యుడు - Fellow of Royal Society.
  • అమెరికా జాతీయ శాస్త్రవిజ్ఞాన అకాడెమి సభ్యుడు - Felow of National Academy of Sciences.
  • కేంబ్రిడ్జ్ ట్రినిటీ కళాశాల సభ్యుడు.
  • వైద్యశాస్త్రములో లూయీ జీన్టె పురస్కారము - 2007
  • హీట్లే పతకము - బ్రిటిష్ జీవరసాయన సంఘము - 2008
  • రాల్ఫ్-సామ్మెట్ అచార్యుడు - ఫ్రాంక్ ఫర్ట్ విశ్వవిద్యాలయము - 2009
  • నోబెల్ పురస్కారము - 2009

పరివారము

మార్చు

ప్రస్తుతం ఆయన బ్రిటన్ లో నివసిస్తున్నాడు. పిల్లల పుస్తక రచయిత్రి 'వేరా రోసెన్బరి' ని పెండ్లాడాడు. వీరికి రామన్ రామకృష్ణన్ అను పేరు గల కొడుకు ఉన్నాడు. అతను కూడా సైన్సు పట్టభద్రుడే గానీ న్యూయార్క్ లోసంగీత వాద్యకారుడుగా ఉన్నాడు. ఒక కూతురు తానియా కాప్క ఒరెగన్ నగరములో వైద్యురాలు.అల్లుడు కూడా సంగీత కళాకారుడే.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-04-21. Retrieved 2010-01-09.
  2. నోబెల్ పురస్కారము: http://nobelprize.org/nobel_prizes/chemistry/laureates/2009/
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-02. Retrieved 2010-01-09.
  4. ఈనాడు ఆదివారం 7 మార్చి, 2010

ఇతర లింకులు

మార్చు