వెలుదండ నిత్యానందరావు

వెలుదండ నిత్యానందరావు పేరుపొందిన రచయిత, పరిశోధకుడు, ఉపన్యాసకుడు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉపకులపతి.

వెలుదండ నిత్యానందరావు
వెలుదండ నిత్యానందరావు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 అక్టోబరు 2024 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1962-08-09) 1962 ఆగస్టు 9 (వయసు 62)
నాగర్‌కర్నూల్ జిల్లా,
బిజినేపల్లి మండలం,
మంగునూరు గ్రామం
జాతీయత భారతీయుడు
తల్లిదండ్రులు వెలుదండ రామేశ్వరరావు, లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి వి. గీతారాణి
బంధువులు వెలుదండ సత్యనారాయణరావు (అన్న)
సంతానం వి.నాగసాయి శ్రీవర్ష, వి.శ్రీహర్ష
నివాసం ప్లాట్ నెం.34, విరాట్ నగర్, మీర్‌పేట్, హైదరాబాదు
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తి తెలుగు ఆచార్యుడు
మతం హిందూ

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1962, ఆగష్టు 9వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా, మంగునూరులో వెలుదండ రామేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి కవి, పండితుడు. ఇతని సోదరులు వెలుదండ సత్యనారాయణరావు, వెలుదండ వేంకటేశ్వరరావులు కూడా డాక్టరెట్లు చేసినవారు, కవులు, రచయితలు. నిత్యానందరావు ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మంగనూరులో పూర్తి చేసుకొన్నాడు. ఆ తర్వాత శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ప్రాచ్య కళాశాల, పాలెంలో 1983లో డిగ్రీ చేసాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (1985), ఎం.ఫిల్‌. (1988), పిహెచ్‌.డి. (1990) పూర్తి చేసుకొని తను చదివిన విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో 24-జులై 1992న లెక్చరరుగా చేరాడు. క్రమంగా సహాయాచార్యుడుగా, ఆచార్యుడుగా, తెలుగు విభాగం అధిపతి(2015-2017)గా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మెన్ గా ఎదిగాడు. వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖలలో పాఠ్య నిర్ణాయకసంఘం అధ్యక్షుడుగా సేవలందించారు. అధ్యాపకుల ఎంపికలలో విషయ నిపుణులుగా వ్యవహరించారు. ఇతడు కవిగా, కథకుడుగా, నాటకకర్తగా, వక్తగా, సమీక్షకుడుగా, సంపాదకుడుగా అన్నింటికీ మించి పరిశోధకుడిగా బహుముఖీనతను సంతరింపజేసుకున్నాడు.[1] ప్రొ. వెలుదండ నిత్యానందరావును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి గా 18 అక్టోబరు 2024న నియమించింది.

సాహిత్యరంగం

మార్చు

ఇతడు ఇప్పటి వరకు రెండు వేలకు పైచిలుకు పరిశోధక వ్యాసాలు, ఎన్నో గ్రంథ సమీక్షలు, మరెన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు, పీఠికలు రాశాడు. సాంకేతికాభివృద్ధి అంతగా చేరువలో లేని రోజులలోనే దేశవిదేశాలలో గల వివిధ విశ్వవిద్యాలయాలలోని తెలుగు విభాగాలలో వచ్చిన ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి పరిశోధన వివరాలను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి 1998లో 'విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన' అనే గ్రంథాన్ని వెలువరించాడు. 2004, 2013లలో పరివర్ధిత ముద్రణలను పొందిన ఈ గ్రంథం పరిశోధక విద్యార్థులకు దిక్సూచిగా, కరదీపికగా పనిచేస్తుంది. ప్రాచీనాధునిక సాహిత్యకారులందరూ ఈసడించుకున్న చంద్రరేఖా విలాపం అనే ప్రబంధంలోని సాహిత్య, సామాజిక, చారిత్రక విషయాలను వెలుగులోకి తెచ్చి దానిని ‘తొలి వికట ప్రబంధం’గా నిరూపించాడు. 'తెలుగు సాహిత్యంలో పేరడీ' అనే అంశంపై శోధించి 1990లో డాక్టరేటు పొందాడు.

రచనలు

మార్చు

రచయితగా

మార్చు
  • తెలుగు సాహిత్యంలో పేరడీ (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)
  • విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన
  • భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర
  • చంద్రరేఖా విలాపం-తొలి వికట ప్రబంధం (ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం)
  • బూర్గుల రామకృష్ణారావు
  • హాసవిలాసం (వ్యాస సంపుటి)
  • నిత్యవైవిధ్యం (వ్యాస సంపుటి)
  • నిత్యానుశీలనం (వ్యాస సంపుటి)
  • నిత్యాన్వేషణం (వ్యాస సంఫుటి)
  • తెలుగు పరిశోధన (2012లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురించిన గ్రంథం)
  • ఆచార్య వెలుదండ నిత్యానందరావు 1922 ఆగస్టులో షష్టిపూర్తి సందర్భంగా తమ రచనలన్నింటిని నాలువేల పుటల్లో ఏడు సంపుటాలుగా వెలువరించారు. వాటిపేర్లు వరుసగా...
  • అనుభూతి - అన్వేషణ (సమీక్షలు - పీఠికలు)
  • అక్షరమాల (రచయితల సాహిత్య వ్యక్తిత్వ సౌరభం)
  • వాగ్డేవి వరివస్య ( సాహిత్య, భాషాసంబంధ వ్యాసాలు)
  • పరిశోధక ప్రభ ( ఎం.ఫిల్, పిహెచ్.డి. ఇత్యాదులు)
  • వ్యాసశేముషి (సాంప్రదాయక, హాస్య విశ్లేషణాత్మక వ్యాసాలు)
  • సృజనానంద (నాటకాలు, కవితలు, లేఖలు మొదలైనవి)
  • ఆదర్శపథం (బంకించంద్ర, బూర్గుల రామక్రిష్ణరావు జీవితచరిత్రలు)

సంపాదకుడిగా

మార్చు
  • నవయుగ రత్నాలు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం సాహిత్య వ్యాస సంపుటి,
  • తెలుగు పరిశోధన వ్యాసమంజరి (రెండు సంపుటాలు -105 సిద్ధాంత గ్రంథాల సారసంగ్రహాల సంకలనం),
  • ఆధునిక భాషాశాస్త్రం- ప్రకార్యభాష (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఏ. దూరవిద్య తెలుగు పాఠ్య గ్రంథం).
  • ఆధునికాంధ్ర భావకవిత్వం (రచన: పాటిబండ మాధవశర్మ)
  • వాఙ్మయ దివాకరుడు (దివాకర్ల వేంకటావధాని శతజయంతి సంచిక, 2014) - సహ సంపాదకత్వం
  • పాలవెల్లి (పల్లా దుర్గయ్య శత జయంతి సంచిక, 2016) - సహ సంపాదకత్వం
  • ఆంధ్రపద నిధానము - తూము రామదాసకవి (తెలంగాణ సాహిత్య అకాడెమి ప్రచురణ)
  • రామకృష్ణ యుధిష్ఠిరచరితమ్ - చెన్నమాధవుని వేంకటరామరాజకవి (మూడర్థాల సంస్కృత కావ్యం)

పురస్కారాలు

మార్చు
  • కవిశేఖర కొండేపూడి సుబ్బారావు సాహిత్య విమర్శ పురస్కారం[2]
  • ఎం.ఏ. తెలుగులో ప్రప్రథమ స్థానం పొందినందుకు గురజాడ అప్పారావు స్వర్ణపతక పురస్కారం - 1985.
  • సాహిత్య విమర్శలో ధర్మనిధి పురస్కారం- తెలుగు విశ్వవిద్యాలయం 2007.
  • కొత్తూరు సుబ్బయ్య దీక్షితులు వేంకటలక్ష్మీ పురస్కారం - భీమన్న సాహితి నిధి 2011.
  • భీమన్నపురస్కారం - భీమన్న సాహితి నిధి 2019
  • సాహిత్య విమర్శలో ప్రతిభా పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం 18-12-2021.
  • ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి పురస్కారం (78వ జన్మదిన సందర్భంగా) జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక 7-4-2022.
  • సాహిత్య విమర్శరంగంలో ఉత్తమగ్రంథ పురస్కారం; తెలంగాణ సారస్వత పరిషత్- 2022
  • సాహిత్య విమర్శ రంగంలో పీచరసునితారావు పురస్కారం 2023
  • సాహిత్య విమర్శరంగంలో ఉత్తమగ్రంథ పురస్కారం; తెలుగు విశ్వవిద్యాలయం- 2024

మూలాలు

మార్చు
  1. బి.బాలకృష్ణ (16 September 2019). "తెలుగు సంశోధన సామ్రాట్టు". నవతెలంగాణ. Archived from the original on 31 మే 2020. Retrieved 31 May 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. విలేకరి, ఆంధ్రజ్యోతి (11 December 2019). "ఓయూ ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు పురస్కారం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 31 మే 2020. Retrieved 31 May 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)