వెలుదండ నిత్యానందరావు

(వెల్దండ నిత్యానందరావు నుండి దారిమార్పు చెందింది)

వెలుదండ నిత్యానందరావు పేరుపొందిన రచయిత, పరిశోధకుడు, ఉపన్యాసకుడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు.

ఆచార్య

వెలుదండ నిత్యానందరావు
Veldanda nityanadarao.jpg
జననం (1962-08-09) 1962 ఆగస్టు 9 (వయస్సు 58)
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ., పి.హెచ్.డి.
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తితెలుగు ఆచార్యుడు
ఉద్యోగంఉస్మానియా విశ్వవిద్యాలయం
సుపరిచితుడుపరిశోధకుడు,
వ్యాసరచయిత
Notable work
తెలుగు సాహిత్యంలో పేరడీ,
హాసవిలాసం,
నిత్యాన్వేషణం
తల్లిదండ్రులువెలుదండ రామేశ్వరరావు, లక్ష్మమ్మ
బంధువులువెలుదండ సత్యనారాయణరావు (అన్న)

జీవిత విశేషాలుసవరించు

ఇతడు 1962, ఆగష్టు 9వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా, మంగునూరులో రామేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి వెలుదండ రామేశ్వరరావు కవి, పండితుడు. ఇతని సోదరుడు వెలుదండ సత్యనారాయణరావు కూడా కవి. ఇతడు మంగునూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని, శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ప్రాచ్య కళాశాల, పాలెంలో డిగ్రీ వరకూ చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి. పూర్తి చేసుకొని తను చదివిన విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో 1988-92 వరకూ పార్ట్‌ టైమ్‌ లెక్చరరుగా చేసి, తదనంతరం లెక్చరరుగా, సహాయాచార్యుడుగా, ఆచార్యుడుగా ఎదిగాడు. డిగ్రీ స్థాయిలో రంగాచార్యులు, కపిలవాయి లింగమూర్తి మొదలైనవారు, పి.జి. స్థాయిలో సి.నా.రె, ఎల్లూరి శివారెడ్డి, ఎస్వీ రామారావు మొదలైనవారు ఇతని గురువులు. ఇతడు కవిగా, కథకుడుగా, నాటకకర్తగా, ప్రవక్తగా, సమీక్షకుడుగా, సంపాదకుడుగా, ఆచార్యుడుగా, అన్నింటికీ మించి మహావ్యాసకారుడుగా బహుముఖీనతను సంతరింపజేసుకున్నాడు[1].

సాహిత్యరంగంసవరించు

ఇతడు ఇప్పటి వరకు రెండు వేలకు పైచిలుకు పరిశోధక వ్యాసాలు, ఎన్నో గ్రంథ సమీక్షలు, మరెన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు, ముప్పాతిక దాకా పీఠికలు వ్రాశాడు. సాంకేతికాభివృద్ధి అంతా చేరువలో లేని రోజులలోనే అవిభాజ్య ఆంధ్రదేశంలో వివిధ విశ్వవిద్యాలయాలలోని తెలుగు విభాగాలలో వచ్చిన ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి పరిశోధన వివరాలను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి 1998లో 'విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన'గా వేశాడు. 2004, 2013లో పరివర్ధిత ముద్రణలను పొందిన ఈ గ్రంథం పరిశోధక విద్యార్థులకు దిక్సూచిగా పనిచేస్తున్నది. ప్రాచీనాధునిక సాహిత్యకారులందరూ ఈసడించుకున్న చంద్రరేఖా విలాపం అనే ప్రబంధాన్ని తన ఎం.ఫిల్. పరిశోధనాంశంగా స్వీకరించి ఈ తొలి వికట ప్రబంధం పైన సమగ్ర పరిశీలన చేసి ఈ ప్రబంధంలోని ప్రౌఢమైన పదాల గుంభనాన్ని, సరస హాస్యాలను బయల్పరిచాడు. 'తెలుగు సాహిత్యంలో పేరడీ' అనే అంశంపై శోధించి డాక్టరేటు పొందాడు.

రచనలుసవరించు

రచయితగాసవరించు

 • తెలుగు సాహిత్యంలో పేరడీ (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)
 • విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన
 • భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర
 • చంద్రరేఖా విలాపం-తొలి వికట ప్రబంధం (ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం)
 • బూర్గుల రామకృష్ణారావు
 • హాసవిలాసం (వ్యాస సంపుటి)
 • నిత్యవైవిధ్యం (వ్యాస సంపుటి)
 • నిత్యానుశీలనం (వ్యాస సంపుటి)
 • నిత్యాన్వేషణం (వ్యాస సంఫుటి)
 • తెలుగు పరిశోధన (2012లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురించిన గ్రంథం)

సంపాదకుడిగాసవరించు

 • నవయుగ రత్నాలు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం సాహిత్య వ్యాస సంపుటి,
 • తెలుగు పరిశోధన వ్యాసమంజరి (105 సిద్ధాంత గ్రంథాల సారసంగ్రహ సంకలనం),
 • ఆధునిక భాషాశాస్త్రం- ప్రకార్యభాష (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఏ. దూరవిద్య తెలుగు పాఠ్య గ్రంథం).
 • ఆధునికాంధ్ర భావకవిత్వం (రచన:పాటిబండ మాధవశర్మ)
 • వాఙ్మయ దివాకరుడు (దివాకర్ల వేంకటావధాని శతజయంతి సంచిక, 2014) - సహ సంపాదకత్వం
 • పాలవెల్లి (పల్లా దుర్గయ్య శత జయంతి సంచిక, 2016) - సహ సంపాదకత్వం

పురస్కారాలుసవరించు

 • కవిశేఖర కొండేపూడి సుబ్బారావు సాహిత్య విమర్శ పురస్కారం[2]

మూలాలుసవరించు

 1. బి.బాలకృష్ణ (16 September 2019). "తెలుగు సంశోధన సామ్రాట్టు". నవతెలంగాణ. Retrieved 31 May 2020.
 2. విలేకరి, ఆంధ్రజ్యోతి (11 December 2019). "ఓయూ ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు పురస్కారం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 31 May 2020.