శప్తభూమి

తెలుగు నవల

శప్తభూమి 2017 లో ప్రచురితమైన తెలుగు చారిత్రిక నవల. 18 వ శతాబ్దపు రాయలసీమ చరిత్ర నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ ఈ నవలను బండి నారాయణస్వామి రచించాడు. 2017 మే లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహించిన తెలుగు నవలల పోటీలో ఇది, మరో రెండు నవలలతో సంయుక్తంగా మొదటి బహుమతిని పంచుకుంది. 2019 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.[1]

శప్తభూమి
"శప్తభూమి" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: బండి నారాయణస్వామి
అంకితం: ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, బెంగుళూరు నాగరత్నమ్మ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: రాయలసీమ చారిత్రిక నవల
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: తానా పబ్లికేషన్స్, అమెరికా
విడుదల: 2017 డిసెంబరు
పేజీలు: 226
ముఖపత్రాలంకరణ: అక్షర క్రియేటర్స్, హైదరాబాదు
ముద్రణ: చరిత ఇంప్రెషన్స్, హైదరాబాదు
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

నేపథ్యం మార్చు

శప్తభూమి అంటే శపించబడిన నేల అని అర్థం.[2] 18వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన చరిత్రను రచయిత ఈ నవలలో నమోదు చేశాడు. శ్రీకృష్ణదేవరాయల పాలన తరువాత పాలెగాళ్ళ సంస్థానాల లోని రాజకీయాలు, కక్షలు కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాలు, పాలెగాళ్ల దౌర్జన్యాలు, బసివిని వ్యవస్థ, సతీ సహగమనం వంటి అనాచారాలు, కరువు కాటకాలకు తట్టుకోలేక పసిపిల్లలను అమ్ముకునే దుస్థితీ ఈ నవలలో కనిపిస్తాయి. రచయిత తనకు తెలిసిన గాలిదేవర సమాధి, గులిగానప్ప పరస, కదిరప్ప స్వామి పరస, వీరగల్లులు మొదలైన చారిత్రక దాఖలాలను ఆధారం చేసుకుని ఈ నవలను రాసాడు.[3] అదే సమయంలో వర్తమాన సందర్భమైన తెలంగాణా ఉద్యమం కూడా రచయితను ప్రభావితం చేసింది. రాయలసీమ ప్రాంత ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన చరిత్రను నవలారూపంలో అందించాలని రచయిత భావించాడు.

సంక్షిప్త కథ మార్చు

1775 ప్రాంతాలలో అనంతపురం సంస్థానాన్ని హండేరాజు సిద్ధరామప్పనాయుడు పరిపాలిస్తుంటాడు. తన శత్రువులైన తాడిమర్రి సంస్థానం వారు బుక్కరాయసముద్రం చెరువుకు గండి పడేటట్లు చేసి అనంతపురాన్ని ముంచివేయాలనే కుట్ర పన్నుతారు. కానీ బిల్లే ఎల్లప్ప అనే గొర్రెల కాపరి సాహసంతో వారి కుట్రను భగ్నం చేస్తాడు. రాజు మెచ్చి అతడిని అమరనాయకుడిగా నియమిస్తాడు. అతడు ఎల్లప్పజెట్టీగా పిలువబడుతుంటాడు. తన రాజు బొక్కసం నింపడం కోసం తాడిమర్రి సంస్థానానికి చెందిన యెల్లుట్లను దోచుకుంటాడు.

సిద్ధరామప్పనాయుడు మైసూరు నవాబు టిప్పుసుల్తానుకు రెండు సంవత్సరాలు ఖండినీరూకలు బాకీ పడినాడు. దానిని వసూలు చేసుకోవడానికి మైసూరు నవాబు తరఫున గుత్తి సుబేదార్ అనంతపురం సంస్థానంపై దాడికి దిగుతాడు. అతడితో చెరువులోపల్లె పరగణా కుదువ పెట్టడానికి, ఇరవై ఐదు వేల రూకలు చెల్లించడానికి ఒప్పందం కుదురుతుంది. ఐతే పద్నాలుగు వేల రూకలు మాత్రమే సర్దుబాటు కావడంతో గుత్తి సుబేదార్ కోపంతో కోటవాకిళ్లు, దివాణం వాకిళ్లు పడగొట్టి పోతాడు. తమ దొరకు జరిగిన అవమానానికి ఎల్లప్పజెట్టీ కృంగిపోతాడు. వానల కోసం వీరమంటపం ఎక్కడానికి శ్రీశైలం మల్లికార్జునస్వామికి మొక్కుకుంటాడు ఎల్లప్పజెట్టీ. గండకత్తెరతో తన శరీరంలోని అంగాలను ఆన్నింటిని కత్తిరించి మల్లికార్జునికి అర్పించి దేహ త్యాగం చేయడంతో నవల సమాప్తమౌతుంది.

ఈ కథతో పాటు ఎల్లప్పజెట్టీని తిరస్కరించి వివాహ బంధం నుండి బయటపడిన ఇమ్మడమ్మ, నాయకరాజుల సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న రాచవేశ్య పద్మసాని, ఇంగ్లీషు చదువులు చదివిన ఆమె కుమారుడు మన్నారుదాసు, కండబలం వున్నా కులం బలం లేక అన్యాయాన్ని ఎదురించలేని కంబళి శరభుడు, తండ్రి మరణానికి కారకుడైన వాడిపై ప్రతీకారం తీర్చుకునే హరియక్క, మతం ముసుగుతో లైంగిక దోపిడీకి పాల్పడే నాగప్ప ప్రగడ, ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించే గురవడు, తన కూతురి దుర్గతికి కారణమైన స్త్రీలోలుడు సిద్ధప్పనాయుడి పతనానికి ఎత్తులు వేసిన బయ్యన్నగారి అనంతయ్య శ్రేష్టి మొదలైనవారి కథలు ఉన్నాయి.

శైలి, భాష మార్చు

నవలా కాలమిన పద్దెనిమిదవ శతాబ్దపు రాయలసీమ వాడుకభాషను వాడానని రచయిత, పుస్తకం చివర ఉన్న "ఈ నవలను రాయించిన క్రమం ఒకటుంది" అనే వ్యాసంలో రాసాడు. తంజావూరు ప్రాంతానికి చెందిన పద్మసాని అనే పాత్రకు ఆ ప్రాంతపు వాడుకభాషను వాడడమే ఉచితమని భావించానని కూడా రాసాడు.

చారిత్రిక నవలని చెప్పుకున్నప్పటికీ, పుస్తకంలో ఎక్కడా పాదపీఠికలు, మూలాలు ఇవ్వలేదు. "ఈ నవల రచన వెనుక అనేక చరిత్రకారుల గ్రంథాల అధ్యయనముంది." అని చెబుతూ ఆ రచయితలందరికీ ధన్యవాదాలని చెప్పాడు గానీ, గ్రంథ సూచీ ఇవ్వలేదు.

సమీక్షలు మార్చు

ఈమాటలో ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ రచయిత దాసరి అమరేంద్ర, "నిస్సందేహంగా ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన చెప్పుకోదగ్గ నవల." అని రాసాడు. "సహగమనానికి అంత గౌరవం ఇస్తూ చిత్రించడం ఎందుకూ?!",

"నవల దళిత బహుజన చరిత్ర అని చెప్పబడింది గానీ శప్తభూమిలో అడుగడుగునా అగ్రవర్ణ విలువలు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి." అని సమీక్షకుడు ఈ సమీక్షలో విమర్శ కూడా చేసాడు.[4]

"స్వామి ‘శప్తభూమి’ నవలలో సీమ ప్రజ​ల జీవితాన్ని పాత్రలుగా మలచి పాఠకుల ఎదుట నిలిపారు.", అని ప్రభాత వెలుగు పత్రికలో రాసిన సమీక్షలో పసునూరి రవీందర్ రాసాడు.[5]

పురస్కారాలు మార్చు

  • 2017 తానా ఉత్తమ నవలల పోటీలో మొదటి బహుమతి
  • 2019 కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి

మూలాలు మార్చు

  1. "బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2020-12-25. Retrieved 2020-12-25.
  2. "బండి నారాయణస్వామి 'శప్తభూమి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". బిబిసి న్యూస్ తెలుగు. Archived from the original on 2020-12-25. Retrieved 2020-12-25.
  3. "సీమ బతుకు వెతల కథకుడు - ప్రజాశక్తి పత్రికలో ప్రచురితం". Dailyhunt. Archived from the original on 2020-12-25. Retrieved 2020-12-25.
  4. దాసరి, అమరేంద్ర (1 ఫిబ్రవరి 2020). "ఏ విలువలకీ శప్తభూమి?". ఈమాట. Archived from the original on 2020-12-25. Retrieved 2020-12-25.
  5. పసునూరి, రవీందర్ (2019-12-21). "చరిత్రను తవ్వి రచనల్లో పొదిగాడు". ప్రభాత వెలుగు.{{cite web}}: CS1 maint: url-status (link)
"https://te.wikipedia.org/w/index.php?title=శప్తభూమి&oldid=3808550" నుండి వెలికితీశారు