శారదా దేవి

(శారదా మాత నుండి దారిమార్పు చెందింది)

శారదా దేవి ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధి.

శారదా దేవి
శారదా దేవి
జననం(1853-12-22)1853 డిసెంబరు 22
జయరాం బాటి, పశ్చిమబెంగాల్
మరణం1920 జూలై 20(1920-07-20) (వయసు 66)
ఇతర పేర్లుశారదామాత
జీవిత భాగస్వామిరామకృష్ణ పరమహంస
తల్లిదండ్రులు
  • రామచంద్ర ముఖోపాధ్యాయ, (తండ్రి)
  • శ్యామసుందరీదేవి (తల్లి)

శారదాదేవి (డిసెంబరు 22, 1853 - జూలై 20, 1920), జన్మనామం శారదమణి ముఖోపాధ్యాయ. ఈవిడ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో బహుముఖ్యులైన శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి. రామకృష్ణ సాంప్రదాయ అనుయాయులు శారదాదేవిని శారదామాయి/శారదమాత/శ్రీ మా/హోలీ మదర్ అని పలుతీర్లుగా సంబోధిస్తారు. శారదాదేవి రామకృష్ణ బోధలు భావితరాలకు అందించడంలో, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు విస్తరించడంలో ముఖ్యపాత్ర పోషించారు.

శారదాదేవి జయరాంబాటిలో జన్మించారు. ఐదేళ్ళ బాల్యప్రాయంలో ఆవిడ వివాహం రామకృష్ణులతో జరిగింది. కాని కిశోరప్రాయం వరకూ రామకృష్ణులుండే దక్షిణేశ్వర్ కు వెళ్ళలేదు. రామకృష్ణ శిష్యులు పేర్కొన్న ప్రకారం, ఈ దంపతులిరువురూ జీవించినంతకాలం సన్యాసులవలే కఠోరబ్రహ్మచర్యం అవలంబించారు. రామకృష్ణుల మరణం తర్వాత ఈమె కొన్నాళ్ళు ఉత్తరభారతంలో తీర్థయాత్రలు చేసి, కొన్నాళ్ళు జయరాంబాటిలో, కొన్నాళ్ళు కలకత్తాలోని ఉద్బోధన్ కార్యాలయంలో ఉంటుండేవారు. రామకృష్ణులశిష్యులందరూ ఆమెను కన్నతల్లిలా చూసుకొన్నారు. వారి గురువు మరణం తర్వాత ఎలాంటి అధ్యాత్మిక సలహాలకైనా, సందేహనివృత్తికైనా శారదాదేవి దగ్గరకే వచ్చేవారు. రామకృష్ణ సాంప్రదాయం ఆచరించేవారు ఈవిడను ఆదిశక్తి అవతారంగా భావిస్తారు.

జననం, తల్లిదండ్రులు

మార్చు

శారదమణి దేవి, పశ్చిమబెంగాల్లో ఒక కుగ్రామమైన జయరాంబాటిలో ఒక పేదబ్రాహ్మణ ఇంట జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రామచంద్ర ముఖోపాధ్యాయ, శ్యామసుందరీదేవి ధార్మికులు. రామచంద్రకి జీవనాధారం పౌరోహిత్యం, వ్యవసాయం. శారదాదేవి జననం ముందు తల్లిదండ్రులిద్దరికీ మానవాతీత అనుభూతి కలిగిందని ప్రతీతి.

శారదాదేవి చాలా సాధారణమైన పల్లెటూరి అమ్మాయిలా బాల్యం గడిపారు. బాల్యంనుంచే ఆమెకు హిందూ పురాణగాథలంటే ఆసక్తి మెండు. అప్పట్లో చాలమంది అమ్మాయిల్లాగే శారదకు పాఠశాలకు వెళ్ళి విద్యనేర్చుకొనలేదు. దినచర్యలో ప్రధానభాగం అంత పెద్ద ఇంటిని నడపడంలో అమ్మకు సేవచేస్తూ, చిన్నవారైన తమ్ముళ్ళ ఆలనాపాలనా చూస్తూ ఇతరులసేవలోనే గడిచేది. 1864లో బెంగాల్లో వచ్చిన ఘోరకరువులో అన్నార్తులకు ఆమె కుటుంబం చేసిన సేవలో ఆమె కూడా చురుకుగా పాల్గొంది. కాళీ, లక్ష్మీ దేవతల మట్టిబొమ్మలను సదా పూజిస్తూ ఉండేది. చాలా చిన్న వయసులోనే ధ్యానం చేసి పారమార్థిక అనుభూతులు పొందగల్గింది. ఎక్కడనుండో వచ్చిన ఎనిమిది మంది బాలికలు ఆమె వెన్నంటే చెరువుకు వస్తుండేవారని తర్వాతికాలంలో శిష్యులతో అన్నారు.

వివాహం

మార్చు

1855లో శ్రీరామకృష్ణులు సర్వం త్యజించి దక్షిణేశ్వర్ దగ్గర కాళీమందిరంలో ఆధ్యాత్మికసాధనలు చేస్తుండేవారు. ఆయన అమ్మ, సోదరుడు పెళ్ళి చేస్తే ఆయన ధ్యాస కాస్త లౌకికవిషయాలవైపు మళ్ళించవచ్చని భావించి వధువుకోసం వెతుకుతుంటే శ్రీరామకృష్ణులే ఈ శారదామణి తనకు తగిన సంబంధమని సూచించారు. 1859 మేలో వారి వివాహమైంది. అప్పుడు శారద వయస్సు 5ఏళ్ళు, రామకృష్ణులవయస్సు 23ఏళ్ళు. అప్పటి భారతీయ సమాజంలో అది సర్వసాధారణమైన విషయం.

వివాహం తర్వాత శారదాదేవి తల్లిదండ్రుల సంరక్షణలో ఉండగా రామకృష్ణులు దక్షిణేశ్వరం వెళ్ళిపోయారు. పధ్నాలుగేళ్ళ ప్రాయంలో ఆమె కామార్పకూర్లో మూడు నెలలు మళ్ళీ రామకృష్ణులతో గడిపారు. అప్పుడు రామకృష్ణులు ఆమెకు ధ్యానం, ఆధ్యాత్మికజీవనం గురించి బోధించారు. రామకృష్ణులు తరచూ భావావస్థలోకి వెళ్ళి ఏదో మాట్లాడడం చూసి చాలామంది ఆయనకు పిచ్చి పట్టింది అనుకునేవారు. మరికొంతమందేమో ఆయన్నొక గొప్ప సాధువుగా భావించేవారు. ఇదంతా విని పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో, ఆవిడే సంకల్పించి దక్షిణేశ్వర్ వెళ్ళారు. తనతో, ఇతరులతో రామకృష్ణుల ప్రవర్తన చూసి నిజం గ్రహించారు.

దక్షిణేశ్వరం కాళీ మందిరంలో

మార్చు

దక్షిణేశ్వరంలో శారదాదేవి నహబత్ (సంగీతశాల) లోని ఒక చిన్నగదిలో నివసించారు. మధ్యమధ్యలో జయరాంబాటిలో గడిపిన కొన్నాళ్ళు మినహా 1885 వరకూ అక్కడే ఉన్నారు. అప్పటికే రామకృష్ణులు సన్యాసదీక్ష స్వీకరించారు. శారదాదేవినే మూర్తిగా చేసుకుని రామకృష్ణులు షోడశీపూజ నిర్వహించారు. ఆయన ముఖ్యశిష్యుల్లో ఒకరైన స్వామి శారదానంద, వీరి వివాహం లోకానికి ఒక ఆదర్శవివాహాన్ని చూపడానికేనని అంటారు. ఆయన శారదాదేవిని ఆదిశక్తి అవతారంగానే భావించారు. సదా గౌరవంగా సంబోధించేవారు. శిష్యులతో ప్రస్తావించినప్పుడు శ్రీమా అని అనేవారు.

శారదాదేవి దినచర్య పొద్దున్నే మూడింటికి మొదలయ్యేది. గంగానదిలో స్నానాదికాలు ముగించి తెల్లవారేవరకూ జపధ్యానాల్లో మునిగిఉండేవారు. రామకృష్ణులే ఆమెకు మంత్రదీక్షనిచ్చి ఆధ్యాత్మిక జీవనానికి బాటలు వేశారు. ఆవిడే శ్రీరామకృష్ణుల ప్రథమ శిష్యురాలు అంటారు. రామకృష్ణులకూ, ఆయన అనుయాయులకూ వండి వార్చడానికే ఆమే దినచర్యలో ప్రధానభాగం కేటాయించబడేది. చాలాకాలం ఆవిడ తెరవెనుకే ఉండేవారు. కొంతమంది స్త్రీ శిష్యులు మాత్రమే ఆవిడను చూడగలిగేవారు. ఈ కాలంలో ఆమె జీవితం ప్రధానంగా సేవ, జప, ధ్యానాలతో గడిచింది.

రామకృష్ణుల చివరిరోజుల్లో గొంతులో క్యాన్సర్‌తో బాధపడుతూ కలకత్తాలో ఉన్నప్పుడు రామకృష్ణులకు, ఆయనను రాత్రింబవళ్ళూ చూసుకున్న శిష్యగణానికి నిత్యం వంటగది అవసరాలన్నీ ఆవిడే చూసుకొన్నారు. 1886లో రామకృష్ణుల నిర్యాణం తరువాత అప్పటి ఆచారం ప్రకారం చేతికున్న బంగరు కడియాలు తీసి విధవరాలి బట్టలు కట్టుకోబోతుంటే, రామకృష్ణులు ఆమెకు దర్శనమిచ్చి "నేను చనిపోలేదు, ఒకగదిలోంచి మరో గదిలోకి మారాను" అని చెప్పారని ప్రతీతి. ఆయన నిర్యాణం తర్వాత ఎంతో మంది శిష్యులకు మంత్రదీక్షనొసగి, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ సంస్థలు అభివృద్ధి చెందడంలో కీలకపాత్ర పోషించారు.

తీర్థయాత్రలు

మార్చు

రామకృష్ణుల నిర్యాణం తర్వాత శారదాదేవి బనారస్ వెళ్ళి విశ్వనాథుడి దర్శనం, అయోధ్య వెళ్ళి రామమందిర దర్శనం చేసుకొన్నరు. కొన్నాళ్ళు ఆధ్యాత్మిక సాధనలు అనుష్టిస్తూ మధుర దగ్గరి బృందావనంలో గడిపారు. అప్పటివరకు తెరచాటునున్న శారదాదేవి అక్కడే నిర్వికల్పసమాధి పొంది ఒక ఆధ్యాత్మిక గురువు పాత్ర నిర్వహించడం ఆరంభించారు. రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన స్వామియోగానంద, మహేంద్రనాథ్ గుప్తా (M) లకు మంత్రదీక్షనొసగారు.

కలకత్తా లో

మార్చు

తీర్థయాత్రల తర్వాత కొన్నాళ్ళు ఒంటరిగా కామార్పుకూర్లో జీవించారు. అక్కడ దుర్భర దారిద్ర్యంలో బతికారు. కొన్నాళ్ళు కేవలం ఇంట్లో కాసిన్ని ఆకుకూరలు తిని బతికారు. 1888లో ఇదంతా విన్న రామకృష్ణుల శిష్యగణం ఆమెను కలకత్తాకు రమ్మని ఆహ్వానించారు. స్వామి శారదానంద అనే శిష్యుడు అప్పుచేసి శారదాదేవి కోసం కలకత్తాలో ఇల్లు కట్టించారు. అప్పుడు వారు బెంగాలి భాషలో ప్రచురించిన ఉద్బోధన్ పేరుతో ఆ ఇంటిని పిలిచేవారు. దానినే "మాయేర్ బాటి" (అమ్మ ఇల్లు) అని అనే వారు. జీవితంలో చాలా కాలం ఆవిడ ఆ ఇంట్లోనే గడిపారు.

ఉద్బోధన్ కార్యాలయంలో ఆవిడతో పాటు స్త్రీ భక్తులైన గోపాలుని అమ్మ, యోగిన్ మా, లక్ష్మీ దీదీ, గౌరిమా వారు ఉండేవారు. అనేకమైన శిష్యులు ఆవిడదగ్గరకి ఆధ్యాత్మిక మార్గదర్శనానికై వచ్చేవారు. శ్రీ అరబిందో కూడా ఆమెను కలిశారని ప్రతీతి. పాశ్చాత్య శిష్యురాండ్రైన సిస్టర్ నివేదిత, సిస్టర్ దేవమాత కూడా అక్కడే ఆమెతో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొలుపుకున్నారు. ఆవిడతో ప్రత్యక్షంగా సమయం గడిపిన వారంతా ఆమెలో పొంగిపొరలే మాతృత్వభావన గురించి చెప్పియున్నారు. ఆవిడ అనుంగు శిష్యుడైన స్వామి నిఖిలానంద "ఆమెకు స్వంతబిడ్డలు లేకపోయినా ఆధ్యాత్మిక సంతానానికి మాత్రం కొదవలేదు" అనే వారు.

రామకృష్ణ సాంప్రదాయంలో ఆవిడను చాలా ఉచ్ఛస్థానంలో ఉంచుతారు. రామకృష్ణులు బతికి ఉన్నప్పుడే "ఆవిడ లోకానికంతటికీ అమ్మ", "నా తర్వాత నా కార్యాన్ని నెరవేర్చేది ఆమే", తనకూ ఆమెకూ మధ్య భేదం లేదని చెప్పియున్నారు. ఆవిడ శిష్యులు రాసిన "శారదామాయి వచనామృతాం"లో ఆమె శిష్యులను తల్లిలా చూసుకొన్న తీరు విస్తారంగా వివరించబడింది. చాలా మంది శిష్యులకు ఆమె కలలో కనిపించి మంత్రదీక్ష ఇచ్చినట్టు ప్రతీతి. ఉదాహరణకి, బెంగాలీ నాటక పితగా వర్ణించబడ్డ గిరీశ్ చంద్రఘోష్ అనే శిష్యుడు, పందొమ్మిదేళ్ళ వయసులో కలలో శారదాదేవిని గాంచి మంత్రదీక్ష తీసుకున్నాడు. చాన్నాళ్ళ తర్వాత ఆమెను ప్రత్యక్షంగా చూసినప్పుడు నాకు కలలో కనిపించింది మీరేనని ఆశ్చర్యపోయాడట.

చివరి రోజులు

మార్చు

శారదాదేవి చివరి రోజులు కలకత్తాకు జయరాంబాటికి మధ్య పయనిస్తూ గడిపారు. 1919 జనవరిలో, జయరాంబాటి వెళ్ళి అక్కడే ఒక యేడాది కాలం గడిపారు. అక్కడ చివరిమూడు నెలలూ ఆమె ఆరోగ్యం క్షీణించగా ఫిబ్రవరి 27, 1920 న తిరిగి కలకత్తాకు తీసుకువచ్చారు. మరి ఐదు నెలలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. నిర్యాణానికి ముందు ఆవిడ శిష్యులతో అన్న మాటలివి. "ఒక్క విషయం చెబుతాను-- మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే". దీన్నే ఆమె అంతిమసందేశంగా భావిస్తారు. ఆవిడ 1920 జూలై 20 న రాత్రి ఒకటిన్నరకు పరమపదించారు.

బోధనలు, సూక్తులు

మార్చు

శారదాదేవి సాంప్రదాయిక పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు, పుస్తకాలూ ఏమీ రాయలేదు. ఆమెతో పెక్కుకాలం గడిపిన స్వామి నిఖిలానంద, స్వామి తపస్యానంద అనే శిష్యులిద్దరూ ఆమె జ్ఞాపకాలౌ, బోధనలౌ సూక్తులు "శ్రీశారదాదేవి చరితామృతం", "శ్రీశారదాదేవి వచనామృతం" అనే రెండు పుస్తకాల్లో గ్రంథస్థం చేశారు. ముఖతా ఆమెతో మాట్లాడిన గొప్పమేధావులు సైతం ఆమె ఆధ్యాత్మికజ్ఞానానికి అబ్బురపోయేవారు. ఆమె బోధనల సారాంశం.

  • క్రమం తప్పక ధ్యానం చేయండి. అలా చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానం చేయకుండ ఉండలేని స్థితికి వస్తారు.
  • ప్రచండ వాయువు మేఘాలను చిన్నభిన్నం చేసినట్టు పావన్ భవన్నామం మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది. జపం ఒక సాధన మనం ప్రయత్నించి అభ్యసంచాలి.
  • మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే

మూలాలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.