శ్రీమదాంధ్ర భాగవతం

పోతన భాగవతము

“పురా అపి నవ ఇతి పురాణః”. ఎంత పురాతనమైనదై ఉండి ఎప్పటికప్పుడు సరికొత్తగా స్పురిస్తుండేది పురాణం. భాగవత మహా పురాణం అష్టాదశ పురాణాలలోనిది, కావ్యత్రయం లోనిది. సర్గ, ప్రతిసర్గ, మనువులు, మన్వంతరము, వంశాను చరితములు పురాణానికి పంచలక్షణాలు అంటారు. వాటిలో ప్రధానమైనవి అష్టాదశ పురాణాలు. అవి మత్య్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్పహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు యని 18.

ఉపోద్ఘాతం

మార్చు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోతన భాగవతంలో, కారణాలు ఏవైతేనేం కొన్ని పూరణలు, కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. బమ్మెరవారు సంపూర్ణంగా వ్రాసారు కాని శ్రీరాముడికి తప్ప ఇతరులకు అంకితం ఇవ్వనన్న ప్రపత్తితో ఉండటంతో. అప్పటి పాలకుడైన సింగరాజు భూపతి కోపంతో మొత్తం తాళపత్ర కట్టలు అన్నీ భూస్థాపితం చేసాడని, తరువాత బయటకు తీసేసరికి కొవ్ని పత్రాలు చెదలు తిని నష్టపోయాయనీ; పోతన కాలధర్మం చేసాకా కొంతకాలానికి వారి కొడుకు పూజామందిరంలో ఈ ఉద్గ్రంథాన్ని కనుగొన్నాడు. పోతన శిష్యుడు, తన సహాధ్యాయి అయిన గంగనతో కలిసి కాల ప్రభావం వలన నష్టపోయిన భాగాలు పూరింప జేసారు అనీ, ఇలా రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ మహాగ్రంథంలో 31 రకాల ఛందోప్రక్రియలలో మొత్తం 9048 పద్యగద్యలతో విస్తారమైనది. సీసంక్రింద వాడిన తేటగీతి, ఆటవెలది పద్యాలను కూడా లెక్కలోకి తీసుకుంటే మొత్తం 10061 పద్యగద్యలు.

మాతృక

మార్చు

శ్రీమద్భాగవతమును శ్రీ వేదవ్యాసుల వారు సుమారు 5,000 సంవత్సరముల క్రితము సంస్కృతమున రచించారు. దీనిని వారు భాగవత పురాణమని మనకు అందించారు. శ్రీ కృష్ణ భగవానులు తమ శరీరమును విడిచిన తరువాత, యావత్ భారతీయులకు వారి లీలలను గాథలను స్మరింపచేసి, మానవుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో తోడ్పడిన పవిత్ర గ్రంథములలో శ్రీమద్బాగవతము ప్రప్రథము అనుట అతిశయోక్తియే కాదు. ఈ లోపలి కాలములో అనేక భాషలలో సామాన్య జనులకు కూడా అర్థం అయ్యేలా ఎందరో మహానుభావులు రచనలు, కీర్తనములు రచించారు. వారిలో శ్రీ మీరా బాయి, శ్రీ సూర్ దాసు, శ్రీ భక్త జయదేవ, శ్రీ లీలాశుకులు కొందరు.

500 సంవత్సరముల క్రితము ఆంధ్ర దేశానికి చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు, పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము, అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము. దీనిని సాహిత్య అకాడమి వారు 1964 లో ముద్రించారు.

హైందవ సాహిత్యంలో ముఖ్యమైనవి మూడు రామాయణ భారత భాగవత ఇతిహాసాలు.ఈ మహాకావ్యంలో ముందుగా స్ఫూరించే పద్యం

కంద పద్యం:

పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?

పద్యాల వివరాలు

మార్చు

స్థూలంగా చెప్పుకోవాలంటే 1, 2, 3, 4, 7, 8, 9, 10 (రెండు భాగాల) స్కంధాలు (7949 పద్యగద్యలు) పోతనామాత్యుల వనీ; 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన వారి రచన అనీ; 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ రచన అనీ; 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉన్నది పై ముగ్గురిలో నారయ ఒక్కరే తన కృతిలో పోతన శిష్యుడను అని ధ్రువీకరించి చెప్పారు. తెలుగు భాగవతం గ్రంథము సంఖ్య 9013; సీసం క్రింది వాటిని కలిపితే 10061 పద్యగద్యలు. వీటిని 12 స్కంధాలలో రాసారు. వీటిలో పంచమ, దశమ రెండేసి భాగాలుగా విడదీయబడ్డాయి కనుక, మొత్తం 14 సంపుటులుగా రాసినట్టు. ఈ 12 స్కంధాలలోనూ కలిపి మొత్తం 30 రకాల ఛందోరీతులు వాడారు. వీటిలో సీస పద్యంలో సర్వలఘు సీసం, సీసపద్యాలక్రింద వాడిన తేటగీతి, ఆటవెలది పద్యాలను; సీసం క్రింది తేటగీతి, సీసం క్రింది ఆటవెలది అని గణనాధ్యాయం చేయడం జరిగింది. మొత్తం గ్రంథములో తేటగీతులు 290 ఉంటే సీసం క్రింద 771 తేటగీతులు పడ్డాయి; ఆటవెలదులు గ్రంథము మొత్తం మీద 427 ఉంటే, సీసం క్రింద 276 పడ్డాయి. అందుచేత వీటి వాడుక విస్తార రీత్యా, సర్వలఘు సీసం ఒకటే ఉన్నా దాని ప్రత్యేకత రీత్యా వీటిని విడిగా గణించడం జరిగింది.

శ్రీమదాంధ్రభాగవతం పద్యాల సంఖ్య
కవి పద్యాల సంఖ్య
పోతన 7949
బొప్పన 352
సింగయ 531
నారాయ 182
స్కంధాల వారీగా పద్యాల సంఖ్య
సంఖ్య స్కంధం పద్యాల సంఖ్య
1 ప్రథమ 530
2 ద్వితీయ 288
3 తృతీయ 1055
4 చతుర్థ 977
5 పంచమ - పూర్వ 184
5 పంచమ - ఉత్తర 168
6 షష్ఠ 531
7 సప్తమ 483
8 అష్టమ 745
9 నవమ 736
10 దశమ - పూర్వ 1792
10 దశమ - ఉత్తర 1344
11 ఏకాదశ 127
12 ద్వాదశ 54

ముఖ్యమైన ఘట్టములు

మార్చు

వచన , టీక తాత్పర్య గ్రంథాలు

మార్చు
  • ఉషశ్రీ భాగవతము
  • రమణీయ భాగవత కథలు
  • పిలకా గణపతి శాస్త్రి భాగవతము

కొన్ని పద్యాలు

మార్చు
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునా కర్ణించు వీనులు వీనులు, మధు వైరి దవిలిన మనము మనము
భగవంతువలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు 
కుంభీనీధవు జెప్పెడి గురుడు గురుడు తండ్తి! హరి జేరుమనేడి తండ్రి తండ్రి.
కలడంబోధి గలండు గాలి గలదాకసంబునుం గుంభినిన్గ
లడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలదడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంటన్
గలడీశుండు కలండు తండ్రి! వేదకంగానేల నీ యా యెడన్
ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై 
యెవ్వని యందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూలకరణం
బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వా
డెవ్వడు, వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్.
కలడందురు దీనులయెడ 
కలడందురు పరమ యోగి గణముల పాలన్
కలడందురన్ని దిశలను 
కలడు కలండనెడివాడు కలడో లేడో


లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే తనువులున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!
అలవైకుంఠ పురంబులో నగరిలోనామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పలపర్యంకరమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై.

ఇవీ చూడండి

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

బయటి లంకెలు

మార్చు