శ్రీరంగం గోపాలరత్నం

భారతీయ గాయని

శ్రీరంగం గోపాలరత్నం (1939 - 1993) ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు మొదలైనవి ఈమె ఆలపించిన పాటల్లో ప్రాచుర్యం పొందినవి. 1992 లో ఈమెకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం లభించింది.

శ్రీరంగం గోపాలరత్నం
జననం1939
పుష్పగిరి, విజయనగరం జిల్లా
మరణం1993 మార్చి 16
వృత్తిగాయని
తల్లిదండ్రులు
  • వరదాచార్యులు (తండ్రి)
  • సుభద్రమ్మ (తల్లి)
పురస్కారాలుపద్మశ్రీ

వ్యక్రిగత వివరాలు

మార్చు

ఈమె 1939 సంవత్సరంలో విజయనగరం జిల్లా పుష్పగిరిలో వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. తల్లికి మేనమామ అయిన అప్పకొండమాచార్యులు రాసిన రెండు హరికథలను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడమే వీరి తొలి ప్రదర్శన. కవిరాయని జోగారావు గారు వీరి ప్రధాన సంగీత గురువు. ద్వారం వెంకటస్వామి నాయుడు, శ్రీపాద పినాకపాణి వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు.

తొలిసారిగా విజయవాడ ఆకాశవాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటినుండి రెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమాలను సమర్పించారు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు ఆమె కంఠం నుంచి జాలువారిన మధురరస పారిజాతాలు. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆమె ప్రతిభకు గీటురాళ్ళు. ఈమెకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం మీరాబాయి.

శ్రీ వేంకటేశ్వర వైభవం చిత్రంలోని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా పాట ఆంధ్ర దేశం అంతా వ్యాపించింది. బికారి రాముడు చిత్రంలో ఈమె పాడిన నిదురమ్మా నిదురమ్మా గీతం బహుళ పాచుర్యం పొందింది.

  • 1969లో తిరుమల - తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా సేవలందించారు.
  • 1977లో హైదరాబాదు లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్బావంతో లలిత కళా పీఠానికి ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు.
  • ఈమెను గాన కోకిలగా, సంగీత కళానిధిగా, సంగీత రత్నగా అభిషేకించాయి.
  • 1992లో భారత ప్రభుత్వం ఈమెను 'పద్మశ్రీ' గౌరవంతో సత్కరించింది.

ఈ గానకళా తపస్విని 1993 మార్చి 16న పరమపదించారు.

బయటి లింకులు

మార్చు