శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీలలు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని అందించారు.

నేపథ్యం మార్చు

లవకుశులు వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్య చేరతారు. అక్కడ రాజవీధిలో గానం చేస్తున్న వీరిని గురించిన సమాచారం రాజమందిరానికి చేరుతుంది. ఆ విధంగా అంతఃపురం చేరి కౌసల్య, సుమిత్ర, కైకేయి, శాంత (రాముని సహోదరి) సమక్షంలో రామాయణాన్ని గానం చేస్తారు. ఈ పాటలో రావణుని చెల్లెలు శూర్పణఖ శ్రీరాముని మోహించడం, రావణుడు సీతను అపహరించడం, హనుమంతుడు శ్రీరామునికి సుగ్రీవునితో మైత్రి కల్పించడం, సీతాన్వేషణ, రావణ సంహారం, సీతాదేవి అగ్నిప్రవేశం, అందరూ కలసి అయోధ్యకు తిరిగిరావడం మొదలైన కథాంశాలను చిత్రించారు.

పాట మార్చు


పల్లవి :
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా .....
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ..... ||| శ్రీరాముని |||


చరణం :
చెలువు మీర పంచవటి సీమలో
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో ||| శ్రీరాముని |||


చరణం :
రాము గని ప్రేమ గొనె రావణు చెల్లి
ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడా మాట విని పంతము పూని
మైథిలిని కొనిపోయె మాయలు పన్ని ||| శ్రీరాముని |||


చరణం :
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమా
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా
హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా ||| శ్రీరాముని |||


చరణం :
ఆ ఆ ఆ ..... నాథా ..... ఆ ..... రఘునాథా ..... ఆ ..... పాహి పాహి .....

పాహి అని అశోకవనిని శోకించే సీతా .....
పాహి అని అశోకవనిని శోకించే సీతా
దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొనీ పావని .....

ఆ జనని శిరోమణి అందుకొనీ పావని
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని ||| శ్రీరాముని |||


చరణం :
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి .....
దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికె

చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజ పైనే అనుమానమా .....
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష

పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత .....
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
హుతవాహుడు చల్లబడి శ్లాఘించేను మాత.....
హుతవాహుడు చల్లబడి శ్లాఘించేను మాత
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా .....
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా ..... వినుడోయమ్మా


చరణం :
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

సాహిత్య విశేషాలు మార్చు

రామాయణంలోని అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండల సంక్షిప్త సమాహారంగా సముద్రాల సీనియర్ ఈ గీతాన్ని రాశారు. దీనిలో ప్రేమతో, భామతో, చెల్లీ, రోసిల్లీ, పావనీ, రివ్వుమనీ, కోసి : జేసి, సీతా : మాతా వంటి అంత్యప్రాసతో కూడిన పదబంధాలు అందాన్నిచ్చాయి.[1] ఈ పాటకు శివరంజని రాగం ఆధారమైనది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. లవకుశ (1963), జీవితమే సఫలము: సీనియర్ సముద్రాల సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్య, మూడవ సంపుటము, డా. వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీ:140-151.

బయటి లింకులు మార్చు