శ్రీశైల మహాత్మ్యం (సినిమా)

(శ్రీశైల మహత్యం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

శ్రీశైల మహాత్మ్యం 1962, ఫిబ్రవరి 3న విడుదలైన భక్తిరస ప్రధానమైన తెలుగు సినిమా. ఇది కన్నడభాష నుండి తెలుగు భాషలోనికి డబ్ చేయబడింది.

శ్రీశైల మహాత్మ్యం
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం అరూర్ పట్టాభి
నిర్మాణం బి.ఎన్.స్వామి
తారాగణం రాజ్‌కుమార్,
సంధ్య,
కృష్ణకుమారి,
డిక్కి మాధవరావు
సంగీతం పామర్తి
గీతరచన మల్లాది రామకృష్ణశాస్త్రి
సంభాషణలు మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ అలంకార్ ఫిలింస్
భాష తెలుగు

శిలాదుడనే మహర్షి పరమేశ్వరుడిని మెప్పించి నంది, పార్వతులనే పుత్రుల్ని పొందుతాడు. ఒకనాటి రాత్రి నంది పార్వతులు పూలుకోసుకోవడానికి శ్రీశైల శిఖరానికి వెడతారు. అలా వెళ్ళిన నంది పార్వతులకు ఎక్కడచూసినా పూలలో శివలింగాలు దర్శనమీయడంతో ఆశ్చర్యపడి ఆ అద్భుతాన్ని తండ్రికి వివరిస్తారు. శిలాదుడు వారి సుకృతానికి సంతోషించి, శ్రీశైలమహాత్మ్యాన్ని బోధించడంతో వారికి శివసాక్షాత్కారం పొందాలనే అభిలాష పుట్టి ఆ పర్వతంపై తపస్సు ప్రారంభిస్తారు.

నారదుడు నంది పార్వతుల వృత్తాంతం ఈశ్వరుని చెవిని వేయడానికి బయలుదేరి వెళుతూ దారిలో దూర్వాస మహర్షిని దర్శించి అతని ప్రగల్భాలకు, అహంకారానికి తగినట్లు గుణపాఠం చెప్పాలని తలపోసి కైలాసానికి వెళ్ళమని దూర్వాసుని పురికొల్పుతాడు.

కైలాసంలో శివపార్వతులు ఆనందంలో తన్మయులై ఉండగా దూర్వాసుడు సమయాసమయాలు గమనించకుండా వారి ఏకాంతాన్ని భంగపుచ్చడంతో జగన్మాతకోపించి శపిస్తుంది. దూర్వాసున్ని తన భక్తుని వృథాగా శపించినందుకు కుపితుడై శంకరుడు పార్వతిని శపిస్తాడు.

శాపఫలితంగా పార్వతీదేవి పసిపాపై సంతానహీనులైన సత్యవతీ చంద్రగుప్తులకు లభిస్తుంది. శాపగ్రస్తుడైన దూర్వాసమహర్షి అక్కడికే చేరుకుంటాడు. ఆయన ఆపాపకు భ్రమరాంబ అని పేరు పెట్టిస్తాడు.

ఇంతలో శత్రువులు తన రాజ్యంపై దండెత్తి వస్తున్నారని విన్న చంద్రగుప్తుడు యుద్ధానికి వెడతాడు. 16 సంవత్సరాలు గడుస్తాయి. భ్రమరాంబ యౌవనవతియై పరమశివునే వలచి వివాహమాడాలనుకుంటుంది. యుద్ధంలో విజయలక్ష్మిని చేపట్టిన రాజు మహదానందంతో తిరిగివచ్చి ఆనాడు రాజధానిలో ప్రవేశానికి ఆటంకం కలగడంవల్ల బయటనే వుండి శివాలయానికి దర్శించడానికి వస్తాడు. యక్షిణీ శాపఫలితంగా అక్కడకు ఆ సమయంలోనే పూజకువచ్చిన భ్రమరాంబను చూసి తన కుమార్తె అని తెలియక మోహిస్తాడు రాజు.

ఇంటికివచ్చి జరిగింది తెలుసుకున్నాడు. దుష్టశక్తులు ఆవహించడంతో భ్రమరాంబను తప్పక పెళ్ళిచేసుకోవాలనే తలంపుతో పట్టుపట్టాడు. వద్దని వారించిన రాణిని త్రోసివేస్తాడు. ఇది భరించలేక భ్రమరాంబ అంతఃపురం వదలి వెళ్ళిపోతుంది శ్రీశైలానికి.

భ్రమరాంబను కానక రాజు ఉన్మాదియై దేశద్రిమ్మరి అవుతాడు.రాజ్యంలో క్షామదేవత తాండవం చేస్తూ ఉంటుంది. ఒకనాడు తలవనితలంపుగా భ్రమరాంబను చూసి బలాత్కరించబోయి రాజు శిలైపోతాడు. భ్రమరాంబ శివసాన్నిధ్యంలో ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆయన సాక్షాత్కరించి పరిగ్రహించడమే కాక నంది పార్వతులకు వరాలు అనుగ్రహించడంతో కథ పూర్తి అవుతుంది.[1]

పాటలు

మార్చు
  1. అనుపమ భాగ్యమిదే కామేశా ప్రాణేశా చిన్మయ తన్మయ పి.సుశీల
  2. కైలాస గిరివాస సమయమిదే.. ధ్యానవేశా శరశరణైక - పామర్తి
  3. పావన జీవన ఫలము జగమే ఈశ్వర కరుణా మయము - అప్పారావు
  4. పాహి మహేశా పాహి మహేశా హే జగదీశా ఆశ్రిత జన - పి.లీల
  5. బ్రోవ భారమే ఐతిమి దేవా మౌనమే న్యాయమే దివ్య ప్రభావా - పి లీల
  6. మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే - ఘంటసాల
  7. మానవా నీకిదే అమృతమౌర పావన శివ ధ్యానం - ఘంటసాల బృందం
  8. లే మల్లె రేఖల ఉయ్యాలలల్లి చిన్నారి పొన్నారి పూలు జల్లి - కె.రాణి బృందం
  9. శాంతమూర్తి భద్ర ఈశ్వరేచ్చవే నీవు శాంతమూర్తివి - పద్యం - పామర్తి
  10. శిలగా మారేగదా నా తండ్రి అయ్యయ్యో మతిలేక (పద్యం) - పి.లీల
  11. శివశివ నేనింత వంతగన చేల్లెనా సాకారా నన్ బ్రోవ బరువ - పి.లీల
  12. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు వెలసిన శ్రీశైలం కలిలో నరులకు - ఘంటసాల
  13. హే దయాకరా చాలు ఈ బంధనా శోకము నీ దీవానా - పి.సుశీల

మూలాలు

మార్చు
  1. ఎ.ఎన్.ఆర్. (25 February 1962). "శ్రీశైల మహాత్మ్యం చిత్రసమీక్ష". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 20 February 2020.[permanent dead link]