షా అలీ పహిల్వాన్ దర్గా
షా అలీ పహిల్వాన్ దర్గా మహబూబ్ నగర్ జిల్లాలో ఆలయాల పురంగా ప్రసిద్ధిచెందిన అలంపూర్లో ఉంది. ఇక్కడి బాల బ్రహ్మేశ్వరాలయం, జోగులాంబాలయాల సమీపాన్నే ఈ దర్గా కూడా ఉండటం విశేషం.

దర్గా చరిత్ర
మార్చుతెలుగు నేల మీద కాకతీయుల పాలన అంతమొందిన పిదప అలంపూర్ ప్రాంతంలో పఠాన్‌ల ప్రాబల్యం పెరిగిపోయింది. ఈ సందర్భంలోనే చాలా మంది పహిల్వాన్‌లు ముస్లిం సాధువులుగా ఈ ప్రాంతానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో షా అలీ పహిల్వాన్ కూడా ఒకరు. ఆయన ముందు అలంపూర్ సమీపంలోని కర్నూలుకు చేరుకుని, అక్కడి నుండి అలంపూర్‌లోని దేవాలయాలపై దండెత్తి, విగ్రహాలను, దేవాలయాలను ధ్వంసం చేశాడు[1]. ఈ తరుణంలో గ్రామస్తులకు, అతనికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో గ్రామస్తులంతా కలిసి పహిల్వాన్‌ను చంపివేశారు. ఈ సంఘటనలో పహిల్వాన్ మొండెం ఒకచోట, తల ఒక చోట పడింది. తల పడిన చోటే ప్రస్తుత దర్గాను నిర్మించారు. దీనిని సిర్ ముబారక్ అని, చిన్న దర్గా అని పిలుస్తారు. మొండెం పడిన చోట కూడా మరో దర్గాను ఏర్పాటుచేశారు. దీనిని పెద్ద దర్గా అని పిలుస్తారు. ఈ రెండు దర్గాలను విడదీస్తూ మధ్యలో జోగులాంబ వాగు ఉంటుంది. ప్రధాన దర్గా చుట్టూ దేవాలయాలు ఉన్నాయి. అయినా ఇక్కడ మత సామరస్యానికి ఏనాడు భంగం వాటిల్లిన దాఖాలాలు లేవు.
ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం ఇక్కడ నాలుగు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు గంధోత్సవం, రెండో రోజు చిన్న కిస్తీ, మూడో రోజు పెద్ద కిస్తీ, చివరి రోజు మహిళా ఉర్సు పేరుతో ఉత్సవాలను జరుపుతారు. షా అలీ పహిల్వాన్‌కు కుస్తీ (మల్ల యుద్ధం) పోటీలంటే ఇష్టం కాబట్టి ఈ ఉత్సవాల సందర్భంగా సరదాగా కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. ఆ కుస్తీనే కిస్తీగా మారిపోయింది. కిస్తీల సందర్భంగా దర్గాలో ఉన్న ఒక వెడల్పాటి రాతి దోణెలో పులావ్, వండిన ఇతర మాంసాహార పదార్థాలను నింపుతారు. కిస్తీలో గెలిచినవారికి పదార్థాలు దక్కుతాయి. చిన్న కిస్తీ పిల్లల కొరకు, పెద్ద కిస్తీ పెద్దల కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు. ఈ ఉత్సవాలకు సమీపంలోని చాలా గ్రామాల నుండి మతాలకతీతంగా ప్రజలు తరలివస్తారు. .ఇక్కడ ఈ ఉత్సవాలు సుమారు 750 సంవత్సరాల నుండి జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలంపూర్‌లో ఘనంగా జరిగే ఉత్సవాలలో శివరాత్రి ఒకటైతే, మరొకటి షా అలీ పహిల్వాన్ ఉర్సు..
గుల్బర్గాతో సంబంధం
మార్చుకర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో నిర్వహించే బందేనవాజ్ ఉర్సుకు అలంపూర్లో నిర్వహించే షా అలీ పహిల్వాన్ ఉర్సుకు సంబంధం ఉంది. బందే నవాజ్, షా అలీలది మామా అల్లుళ్ళ బంధమని అంటారు[2]. ప్రతి సంవత్సరం గుల్బర్గాలో ఉర్సు ముగిసిన ఏడు రోజులకు అలంపూర్‌లో ఉర్సు ప్రారంభమవుతుంది. గుల్బర్గా ఉర్సు నుంచి గంధాన్ని ఇక్కడికి తీసుకవచ్చి వంశపారంపర్య ఉర్సు నిర్వాహకుల ఇంటిలో ఉంచుతారు. అక్కడి నుండి ప్రభుత్వ తహశీల్దార్ కార్యాలయానికి తీసుకవెళ్తారు. గంధోత్సవం రోజు ప్రభత్వ అధికారిక లాంఛనాలతో, మేళతాళాలతో పెద్ద దర్గాకు, చిన్న దర్గాకు తీసుకవెళ్తారు.
ఇటీవలి ఉత్సవాలు
మార్చుతేది: 17.09.2014 నుండి షా అలీ పహిల్వాన్ 764 వ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉర్సు నిర్వాహకులు అహ్మద్ ఓవైసీ, అలంపూర్ మండల తాహశిల్ధార్ చాణక్య, అలంపూర్ వలయరక్షణాధికారి (సి.ఐ.) వెంకటేశ్వర్లు సంయుక్తంగా ఉత్సవాలను ప్రారంభించారు. తేది 19.09.2014 రోజు పెద్ద కిస్తీ సందర్భంగా అలంపూర్ శాసన సభ్యుడు సంపత్ కుమార్, జడ్పీటీసి సభ్యుడు సూర్యబాబు గౌడు హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు[3].