సంకీర్తన (సినిమా)
సంకీర్తన కోణార్క్ మూవీ క్రియేషన్స్ పతాకంపై అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా గీతాకృష్ణ దర్శకత్వం వహించిన 1987నాటి తెలుగు చలన చిత్రం.
సంకీర్తన (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గీతా కృష్ణ |
---|---|
నిర్మాణం | ఎం.గంగయ్య |
తారాగణం | అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, శరత్ బాబు |
సంగీతం | ఇళయరాజా |
కూర్పు | అనిల్ మల్నాడ్ |
నిర్మాణ సంస్థ | కోణార్క మూవీ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఓ పల్లెటూళ్ళో జాలరి కులానికి చెందిన కాశీ (అక్కినేని నాగార్జున) అజ్ఞాత కవి, గాయకుడు. కాశిలోని ప్రతిభ పెద్దగా ఎవరకీ తెలియదు. తల్లి (డబ్బింగ్ జానకి) జాలరిగా పనిచేస్తూంటుంది. పెద్ద కులానికి చెందిన కీర్తన (రమ్యకృష్ణ)ని నిజానికి పిల్లలు లేని వాసుదేవ మూర్తి (జె.వి.సోమయాజులు) గుడిమెట్లపై దొరికితే తెచ్చుకుని పెంచుకుంటూంటాడు. కానీ కీర్తన తమ సొంత కూతురు కాకపోవడంతో వాసుదేవమూర్తి భార్యకు ఆమెపై అక్కసు, వ్యతిరేకత ఉంటుంది. ఇదిలావుండగా ఆ ఊరి జనం దేవతలా భావించి కొలుస్తూ ఉంటారు. ఆమె అడుగుపెట్టాకే తమ కడగళ్ళు పోయాయని, గ్రామం సుభిక్షమైందని నమ్ముతూంటారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలో కీర్తన నాట్యం చేస్తూంటుంది, ఆమెకు నాట్యశాస్త్ర గురువు పరమేశ్వరశాస్త్రి (గిరీష్ కర్నాడ్). అలాంటి ఓ సంవత్సరపు నృత్యప్రదర్శనలో ఆమెను చూసిన కాశికి అప్పటి నుంచి కవితలకు ఆమే ప్రేరణగా మారిపోయే స్థితి వచ్చేస్తుంది. ఆమె అతని కవితా దేవతగా భావించుకుంటాడు. కాశీ స్నేహితులైన ముగ్గురు చిన్న పిల్లలు, గోదారి (రాళ్ళపల్లి)ల ద్వారా ఆ కవితలు చూసి చదివిన కీర్తనలో కాశీ పట్ల ప్రేమ అంకురిస్తుంది. ఆ గ్రామంలోకెల్లా సంపన్నులైనవారి కొడుకు శ్రావణ్ (శరత్ బాబు) చదువు ముగించుకుని ఊళ్ళోకి వస్తాడు. అతను మంచి చిత్రకారుడు, కీర్తన నాట్యం చూసి ఆమె పట్ల ప్రేమ పెంచుకున్నా కీర్తనకి కాశీ పట్ల ఉన్న ప్రేమ గురించి తెలుసుకుని తన ఆలోచనలు వదులుకుంటాడు.
కాశీలోని గానకళ అందరికీ తెలిసేందుకు ఓ కచేరీ కూడా ఏర్పాటుచేస్తాడు, ఆ సమయంలోనే కాశీ తల్లి మరణిస్తుంది. కీర్తనని విదేశాలకు తీసుకొనివెళ్లి ప్రదర్శనలు ఇప్పిస్తానంటాడు శ్రావణ్. ఈ విషయం తెలుసుకున్న కీర్తన తల్లి అసూయతో ఒకామెకి లంచం ఇచ్చి జాతరలో ఆమెను అమ్మవారు పూనినట్టుగా నటింపజేస్తుంది. కీర్తన తల్లి వేసిన పథకం ప్రకారం ఆ పూనకంలో కీర్తనకు వివాహం కారాదని అమ్మవారి ఆదేశించినట్టు నటిస్తారు. కీర్తన తనని ప్రేమిస్తోంది అన్న విషయం తెలుసుకున్న కాశీ ఆ ప్రేమని అంగీకరిస్తాడు. తాను హైదరాబాద్ వెళ్ళి తిరిగివచ్చాకా ఎవరిని ఎదిరించైనా కాశీ, కీర్తనలను కలుపుతానని శ్రావణ్ మాట ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తన తల్లి ఆమెని చాలా ఆరళ్ళు పెడుతుంది, ఆ బాధలో తాండవం చేస్తూన్న కీర్తనను హఠాత్తుగా వివాహం చేసుకుంటాడు కాశీ. ఇది తెలిసిన గ్రామస్థులు వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు.
సరిగా ఇదే సమయానికి ఓ వాస్తవం బయటపడుతుంది. ఆలయ పూజారి శాస్త్రి కీర్తనకు అసలు తండ్రి అనీ, అతనికీ ఓ చిన్న కులస్తురాలైన ఆమెకీ పుట్టిన అమ్మాయి కావడంతో ఏం చేయాలో తెలియక మూర్తికి దొరికేలా చేసినట్టు చెప్తాడు. ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకుని ఆమె దుర్గమ్మ రూపమని ప్రచారం చేసినట్టు, తాను చేసిన తప్పుకు ఆమె జీవితం నాశనం కాకూడదని హితవు చెప్పి వాళ్ళని పంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఊరి జనం ఆగ్రహంతో శాస్త్రిని చావగొడతారు. ఊరి జనం కాశిని చంపి తాము దేవతగా భావించే కీర్తనను తీసుకువద్దామని బయలుదేరతారు. ఇంతలో వారిపై ఎప్పటినుంచో కక్ష ఉన్న జమీందారు కొడుకు (సాయికుమార్), అతని మిత్ర బృందం కాశిని చితగ్గొట్టి కీర్తనను ఎత్తుకుపోతారు. కీర్తనను, కాశీనీ కాపాడేందుకు వాళ్ళను గోదారి చంపేస్తాడు. చివరకు ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తులను అడ్డుకుని, వివేకాన్ని మేల్కొలిపేలా సందేశాన్నిచ్చి శ్రావణ్ కాశి-కీర్తన జంటను తీసుకుని వెళ్ళిపోతాడు. [1]
తారాగణం
మార్చు- అక్కినేని నాగార్జున (కాశీ)
- రమ్యకృష్ణ (కీర్తన)
- గిరీష్ కర్నాడ్ (పరమేశ్వర శాస్త్రి)
- జె వి సామయాజులు (వసుదేవశర్మ)
- శరత్ బాబు (శ్రావణ్ బాబు)
- సాయి కుమార్
- రాళ్ళపల్లి
- సాక్షి రంగారావు (రామశర్మ)
- నర్రా వెంకటేశ్వరరావు
- మల్లికార్జున రావు
- కె కె శర్మ (చిదంబరం పిళ్ళై)
- ధం(కోడిపెట్టలు)
- వై.విజయ (మహాలక్ష్మి)
- మాష్టర్ సురేశ్ (జూనియర్ కాశీ)
- తారా
శైలి
మార్చుసంకీర్తన చిత్ర కథలోనే కాక కథనంలోనూ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శైలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తూంటుందని విశ్లేషకులు భావించారు.[1]
సంగీతం
మార్చుచిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం ఇళయరాజా అందించారు. చిత్రానికి పాటలు, నేపథ్య సంగీతాలే ప్రధాన ఆకర్షణగా నిలిచి, ప్రజాదరణ పొందాయి. పాటల సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సి.నారాయణ రెడ్డి రాశారు.
మనసున మొలిచిన సరిగమలే , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కోరస్
దేవీ దుర్గాదేవి, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
వందరూపాయల నోటు, రచన: సి నారాయణ రెడ్డి గానం.ఎస్ పి శైలజ కోరస్
దివిదారుల(పద్యం) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మనసే పాడెనులే, రచన: సి నారాయణ రెడ్డి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
తిల్లానా (దిమ్ తరణ ) రచన: సి నారాయణ రెడ్డి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ .
వే వేలా వర్ణాల , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
కలికి మేనిలో , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
ఏ నావది ఏ తీరమో , రచన: ఆచార్య ఆత్రేయ, కె జె జేసుదాస్
గానం ఆగిపోదులే , రచన: సి నారాయణ రెడ్డి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
ఓంకార వాక్యం , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆలూరు, యశ్వంత్. "సంకీర్తన (1987)". యశ్వంత్ క్రానికల్. Archived from the original on 2 ఫిబ్రవరి 2016. Retrieved 7 March 2016.